#


Index

   ఆ మాటకు వస్తే సర్వావస్థాం గతోపివా - ఏ దశలోనేనా ఉండనివ్వండి వాడు. అవి జాగ్రత్స్వప్న సుషుప్తులే కావచ్చు. శయనాసన భోజన భాజనాదులే కావచ్చు. కూచున్నా నిలుచున్నా నడుస్తున్నా మాటాడుతున్నా ఎప్పుడైనా సరే. మాకు వాడి శారీరకమైన దశ కాదు ముఖ్యం. మరేమిటి. మానసికమైన స్థితి.

   ఏమిటా మానసికం. అంటే చెబుతున్నాడు. యః స్మరేత్. ఎవడైతే మనసులో ఎప్పుడూ స్మరిస్తుంటాడో. స్మరించట మంటే తదేక ధ్యానంతో ఉండటం. అదే ఆలోచన. ఎవరిని గురించి ఆలోచన. పుండరీ కాక్షం. మీరేమి వైష్ణవులా పుండరీ కాక్ష మంటున్నారు. త్రియంబక మనవచ్చు గదా. ఈయనకు రెండయితే ఆయనకు మూడున్నాయి అక్షులు. అలాంటి వాణ్ణి స్మరిస్తే ఇంకా మంచిది గదా అంటే అది గాదిక్కడ అర్థం. పుండరీక మంటే తెల్ల తామర. తెల్లని తామర పువ్వులాగా వికసించి సర్వత్రా విస్తరించినట్టు కనిపించేది ఈ అనంతమైన ఆకాశం. దానిలాగా సర్వవ్యాపకమయి దాన్ని సాక్షిగా గమనించే అక్షి అంటే జ్ఞానమని అర్థం. అప్పటికి జడమైన ఆకాశానికి కూడా సాక్షి అయిన ఏ అఖండ జ్ఞానమున్నదో అలాటి పరమాత్మే ఇక్కడ పుండరీకాక్ష అనే శబ్దాని కర్ధం. సర్వసాక్షి గనుక అక్షి అయినా అది ఎప్పుడూ ముకుళించే స్వభావం లేని అక్షి అలాటి పరమాత్మ చింతనతో నిరంతరమూ నీ మనసు నిండి ఉంటే చాలు. నీవు పవిత్రుడవే. భావంలో బాహ్యంలో కూడా పవిత్రుడవే నంటున్నది మంత్రం.

Page 17