#


Index

   మహా పాపం. ఈశ్వర నామ ముచ్చరిస్తే పాతకమని చెప్పి వెంకట రమణా శ్రీనివాసా అని కేకలు పెడతారే. ఈశ్వర స్సర్వభూతానాం - కర్తా భోక్తా మహేశ్వరః ఇలాటి గీతా వాక్యాల నెలా ఉచ్చరిస్తారు. శివ మద్వైత మనే ఉపనిష ద్వాక్యాన్ని ఎలా సమన్వయిస్తారు. వీరి పిచ్చి గాని విష్ణు నామాల్లో శివనామాలెలా ఉన్నాయో - శివ నామాల్లో విష్ణు. నామాలూ ఉన్నాయి. అసలు శివమంటే మంగళం. శుభం. అది జ్ఞానం. అదే సర్వవ్యాపక మయితే విష్ణు. స్వరూప స్థితిలో ఉంటే బ్రహ్మం - బ్రహ్మ విష్ణు మహేశ్వరు లందుకే ఒకే ఒక తత్త్వం. కాళిదాసాది మహాకవులూ దార్శనికులూ ఎప్పుడో గ్రహించారీ రహస్యం. లోకులకు బోధించారు. అయినా ఈ ప్రబుద్ధుల కింకా అర్ధం కాలేదంటే భగవత్పాదులన్నట్టు మూర్ఖులని మనం త్రోసి పుచ్చటమే తప్ప చేసేది లేదు.

   అయితే శివకేశవులనేవి జ్ఞాన జ్ఞేయాలనీ అవి ఒకదాని కొకటి సాపేక్ష Relative మనీ చెప్పారే. నిరపేక్షమైన Absolute తత్త్వ మొకటి వీటి కాధారమైన దుంటే గదా ఆ మాట చెల్లుతుంది. ఆ నిరపేక్షమైన ఒకే ఒక తత్త్వమేమిటని ప్రశ్న. దానికిప్పుడు సమాధాన మిస్తున్నారు మహర్షులు.

నమో స్వనంతాయ - సహస్ర మూర్తయే - సహస్ర పాదాక్షి శిరోరు బాహవే - సహస్ర నామ్నే పురుషాయ శాశ్వతే - సహస్ర కోటీ యుగ ధారిణే నమః

Page 129