#


Index

   ఇంతవరకూ జ్ఞాన స్వరూపమైన వాసుదేవ తత్త్వాన్నీ ఆయనతో ఓతప్రోతమై మనదాకా ప్రసరిస్తూ వచ్చిన క్రియా రూపిణి అయిన సంధ్యా దేవతనూ రెంటినీ వర్ణించారు. ఈ సంధ్య ఏదో గాదు. బ్రహ్మ విద్యే గనుక ఈ బ్రహ్మ విద్య ద్వారానే మనమెప్పటికైనా బ్రహ్మ తత్త్వాన్ని అందుకోవాలని స్వానుభవానికి తెచ్చుకోవాలని అర్థమయింది. అందుకోసమే ఆ రెండింటినే నిత్యమూ వందనం చేయాలి సాధకుడు. అంటే మనసా వాచా అదే లోకంగా జీవించాలి. అప్పుడే జీవ జగత్తులనే భేదం నశించి అంతా బ్రహ్మ స్వరూపంగా చూడగలడు సాధకుడు.

   జీవుడు జ్ఞానమైతే జగత్తు జ్ఞేయం. ఈ రెండింటికీ ఉన్న సంబంధ మన్నాన్నా సంబంధం. అన్న మంటే ఈ చరా చర జగత్తే Matter. అన్నాద దీన్ని నిత్యమూ లోపలికి తీసుకొని దీని అనుభవాన్ని పొందుతున్న జ్ఞానమే Mind. కాగా ఇవి రెండూ పైకి రెండుగా కనిపిస్తున్నా అది ఆ భాసే సత్యం కాదు. సత్య మఖండమైన జ్ఞానం. అదే వాసుదేవ. సచ్చిద్రూపంగా అది ఈ జ్ఞేయమైన జగత్తునూ జ్ఞాత అయిన జీవులనూ రెంటినీ వ్యాపించి ఉంది. వస్తుతః ఇవి రెండూ దాని కభిన్నమే. అసలదే మన అవిద్యా వశాత్తూ ఇలా రెండు పాయలయి ప్రకాశిస్తున్నది.

   ఈ రెండు పాయలే శివకేశవులు. శాస్త్ర భాషలో జ్ఞాన జ్ఞేయలైతే పురాణ భాషలో శివకేశవులు. శివుడు జ్ఞానానికీ విష్ణువు జ్ఞేయానికీ సంకేతాలు.

Page 125