పండితులూ శాస్త్రజ్ఞులూ కళాకారులూ ధార్మికులమని విర్రవీగే వారి జీవితాలు కూడా ఇంతే. పోతే అదే కాలం విద్యా రూపిణి అయి మన బుద్ధులను కదుపుతూ పోయిందంటే ఏ తత్త్వాన్ని వదిలేసి మనమింత దూరం వచ్చి ఈ సాగరంలో పడ్డామో ఆ వాసుదేవ తత్త్వం వైపే తీసుకెళ్ళి మనకు దానితో సాయుజ్యాన్నే ప్రసాదిస్తుంది. ఇందులో మొదటిది మనలను శిక్షించట మైతే రెండవది రక్షించటం. అందుకే వాపోతుండాలి మానవుడెప్పుడూ అమ్మా కాల స్వరూపిణీ సంధ్యా ! నిన్ను నేను విద్యారూపిణిగా అంటి పట్టుకొన్నాను. నన్ను సంసార కూపంలో పడదోసి దెబ్బ తీయకుండా వాసుదేవ సాయుజ్యాన్ని ప్రసాదించి మోక్ష సుఖాన్ని అబ్బ జేయి తల్లీ శిక్షించకు నన్ను రక్షించమని. ఇదే అసలు థియో యోనః ప్రచోద యాత్తనే మాటలో కూడా ఇమిడి ఉన్న తాత్పర్యం. భర్గో దేవస్య - బ్రహ్మ విద్య. అది సవితృ రూపుడైన పరమాత్మ నుంచి మనదాకా ప్రసరిస్తూ వచ్చిన క్రియాశక్తే. థియో యోనః - అది మన బుద్ధులను కదుపుతూ పోవటమే ప్రచోదయాత్ ఎటు వచ్చీ ఆ ప్రచోదన విషయాభి ముఖంగా గాక ఆత్మాభిముఖంగా జరగాలనే మన ఆకాంక్ష.
శివాయ విష్ణు రూపాయ - శివ రూపాయ విష్ణవే - శివస్య హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయం శివః - యధా శివమయో విష్ణు - రేవం విష్ణు మయ శ్శివః - యధాం తరంన పశ్యామి - తధామే స్వస్తి రాయుషి -
Page 124