ఈ విధంగా ఏ కాలరూపిణి అయిన సంధ్య కధీనమై ఉన్నాయో అది మమ్ము రక్షించాలని కోరటంలో ఏమిటి ఆంతర్యం. ముందు చెప్పిన వాసుదేవుడికీ ఈ సంధ్యకూ ఏమిటి సంబంధం. ఉంది. కావలసినంత ఉన్నది సంబంధం. వాసుదేవ జ్ఞాన స్వరూపమైన పరమాత్మ అయితే ఇది ఆయన క్రియాశక్తి. కాలమే క్రియ. కదిలే దదే గదా. అది కూటస్థమైన ఆ స్వరూపం దగ్గరి నుంచి మనదాకా కదులుతూ వస్తున్నది. వచ్చి మరలా మనలను కదుపుతూ కూచుంటుంది. అలా కదపటం వల్లనే ప్రతి ఒక్కడూ లోకంలో మనసా వాచా వపుషా నిత్యమూ కదులుతూనే ఉంటాడు. అణువు మొదలు అన్ని జడ పదార్థాలు కూడా అతి వేగంగా కదులుతూ ఉంటాయి. అలా కదలక పోతే తిండి లేదు. తీర్ధం లేదు. తిరగ లేము బ్రతకలేము. దేనికీ నోచుకోలేము.
అయితే ఈ కాలం మనలను కదిలిస్తున్నదంటే అది రెండు మార్గాలలో ఏదైనా కావచ్చు. అది అవిద్యా రూపిణి అయి కదిలించిందంటే సుఖం లేదు. ఐహికమైన అన్నపానాదులూ - వస్తు వాహనాదులూ పోగు చేసుకోటానికైనా కదులుతూ పోతాము మనం. చివరికీ వాసనలతోనే ఒక జన్మ నుంచి మరో జన్మకైనా కదలి పోతుంటాము. దీనివల్ల జీవిత సమస్య సమస్యగానే మిగిలిపోతుంది. తెగదు. తెల్లవారదు. నూటికి తొంభయి మంది జీవిత మిలాగే సాగిపోతున్నది. పామరులే గాదు.
Page 123