#


Index

   పోతే తన్నో విష్ణుః ప్రచోదయాత్తన్నారు. అదేమిటంటే అస్తిభాతి సర్వత్రా ఉండవచ్చు. చూచే అవకాశమూ ఉండవచ్చు. కాని మన బుద్ధి అందులో ప్రవేశించాలి గదా. బుద్ధి అందులో ప్రవేశించినప్పుడే అది బుద్ధిలో ప్రవేశిస్తుంది. లేకుంటే వస్తు సిద్ధంగా అది ఉన్నా మన సొమ్ము గాదు. ఇంతెందుకు వాయువు సర్వత్రా ఉంది. కాని దాన్ని మన మనుక్షణమూ పీల్చి లోపలికి తీసుకొంటేనే మనం బ్రతుకుతాము. లేకుంటే మనుగడే లేదు మానవుడికి. అలాగే ఆకాశమిప్పుడు సర్వత్రా ఉంది. మన వెలపలా ఉంది లోపలా ఉంది. వాయువులాగా పీల్చే ప్రయత్నం కూడా లేదు. కాని అది ఉన్నట్టు గుర్తించక పోతే దగ్గర ఉన్నా అది మనకు దూరమే. అందుకే చిన్న పిల్ల లాకాశ మెక్కడ ఉందని అడిగితే చేయి పైకెత్తి అదిగో ఆకాశమని పైకి చూపుతుంటారు. అలాగే ఇప్పుడా నారాయణ తత్త్వం వాసుదేవ రూపంగా సర్వత్రా సత్తాస్ఫురత్తలుగా దర్శనమిస్తున్నా నామరూపాలనే విజాతీయ భావాలడ్డు తగిలి దాన్ని ఉన్నదున్నట్టు పట్టుకో లేకపోతున్నాము. అంచేత తన్నో విష్ణుః ప్రచోదయాత్తనే మూడవ మాట వచ్చింది. విష్ణు అంటే విశతీతి విష్ణు. దేనిలో ప్రవేశిస్తుందో అది విష్ణు. ఏది మరలా బుద్ధిలో ప్రవేశిస్తుందో అది విష్ణు. మన బుద్ధి అందులో ప్రవేశించి చూడాలి మొదట. అప్పుడది తప్పకుండా బుద్ధికి స్ఫురిస్తుంది.

Page 121