#


Index

   మనకు మైకం కల్పించి మరలా ఆ మైకం నుంచి తేరుకొన్నామా లేదా తన సంగతి గుర్తుందా లేదా వీడికని మరలా మరుసటి దినం మనకు తన స్వరూపాన్ని గుర్తు చేస్తూ ఇలా వ్యక్తా వ్యక్తంగా మనతో దోబూచు లాడుతున్నాడు. ప్రతి దినమూ మూడు సంధ్యలలో వందనం చేస్తూన్నామంటే ఈ అఖండమైన బ్రహ్మ భావనతో సంబంధం పెట్టుకొనే ప్రయత్నమే గాని ఏదో సంధ్య అనేది ఒక కాలం. ఆ కాలంలో మనకు కనిపించినా కనిపించకున్నా ఒక మండలాన్ని పైన చూస్తూ క్రింద దాని కిదుగో ఈ అర్ఘ్య మిస్తున్నానని యాంత్రికంగా కాదు.

   ఇక్కడికి సూర్యోపస్థాన మయింది. మూడు సంధ్యలలోని మూడు మంత్రాలకూ అన్ని భూమికలలో అర్థం చెప్పుకొన్నాం. భూత విషయంగా ఒకటి. దేవతా విషయంగా ఒకటి. ఆఖరు కివేవీ గావు. పరమాత్మ విషయంగా ఒకటి. భూతం కంటే దేవత గొప్పదైతే దేవత కంటే పరాదేవత గొప్పది. దేవ అంటే దీవ్యతీతి దేవః - ప్రకాశించేదని అసలైన అర్ధం. జడ ప్రకాశం కాదది. చైతన్య ప్రకాశం. జడ ప్రకాశం ప్రకాశమే గాదు. అది భూతమే. దాన్ని ప్రకాశింప జేసేది దేవత. ఆ దేవత కూడా ఖండమైన ప్రకాశమే. దానికి కూడా ప్రకాశాన్ని సరఫరా చేసేది పరిపూర్ణమైన పరా దేవత. అదే పరిపూర్ణమైన చైతన్య ప్రకాశం. ఆ పరిపూర్ణ ప్రకాశమే మరలా ఆయా దేవతా రూపంగా లోపల చేరి భౌతికమైన ప్రపంచంగా బయటపడి కనిపిస్తున్నది.

Page 111