#


Index

   అధాతే వరుణ ప్రియాసః - అలాటి దయా దాక్షిణ్యాలు మాపైన చూపావంటే మేము నీకెప్పుడూ ఇష్టమైన వాళ్లమే అవుతాము. లేకుంటే మమ్ములను నీవెప్పుడూ ప్రబలమైన శత్రువులుగానే చూస్తుంటావు. అలా చూస్తే మా అపరాధాలు మన్నించ లేవు. మమ్ము బిడ్డలలాగా దగ్గరికి తీసుకోలేవు. ఇదీ మంత్రార్ధం.

   అసలీ మంత్రం శునశ్శేపుడనే కుఱ్ఱవాణ్ణి హరిశ్చంద్రుడనే రాజుగారి కమ్మి అతడు వరుణ పాశ బద్ధుణ్ణి చేసినప్పుడా బాలుడు తన బంధ విముక్తి కోసం వరుణ దేవుణ్ణి స్మరిస్తూ ప్రార్ధించే వేదమంత్రమిది. కధావ్యాజంతో మన విషయమే వ్యంగ్యంగా బయట పెడుతున్నదా శాస్త్రమని తోస్తుంది నాకు. శునశ్శేఫుడెవడో కాదు మనమే. కుక్క బ్రతుకు బ్రతుకు తున్నాడు మానవుడు. వీణ్ణి ఈ సంసారానికి కట్టి వేసిన వరుణ పాశమా ఆవరణాత్మకమైన అవిద్యా పాశమే. దీని నుంచి మరలా విముక్తి కల్పించమని ఆ మాయా శక్తి కధీశుడైన పరమాత్మ అనుగ్రహం కోసం తహ తహలాడే మనబోటి జీవ కోటి ఆవేదన ఇది. అజ్ఞానం వల్ల ఎన్నో దుష్కృత్యాలు చేసి ఈ స్థితికి వచ్చాము. సంసార బంధంలో వచ్చి పడ్డాము. దీన్ని తప్పించి మాకు మరలా మోక్ష పదవిని ప్రసాదించ వలసిన వాడవు. నిత్య ముక్తుడవూ గుణాతీతుడవు నీవే సుమా అని ఆక్రందన.

   ఆ మాటకు వస్తే ఈ మూడు మంత్రాలకూ బాహ్యార్ధమే గాదు. అంతరార్ధమే గాదు. పరమార్ధం దాకా ఉన్నది విస్తారం. బాహ్యార్ధం భౌతికమైన స్థాయి వరకే.

Page 105