#


Back

సామాన్యం - విశేషం

సామాన్యం విశేషం ఈ రెండిటికున్న పోలిక తేడా ఏమిటో తేలిస్తే చాలు అద్వైత విజ్ఞానమంతా అందులోనే కలిసి వస్తుంది.వీటి పర్యాయపదాలే అన్వయ - వ్యతిరేకాలు,అనువృత్తి - వ్యావృత్తిలు,అద్యారోప - అపవాదాలు మొదలైనవి. ఇందులో సామాన్య మనేది ఎప్పుడు ఏకమే. విశేషాలు అనేకం. సామాన్యం నుంచే విశేషాలన్నీ వస్తాయి కాని విశేషాలు నుంచి సామాన్యం రాదు. విశేషాలిన్నిటిని సమానంగా వ్యాపిస్తుంది కనుకనే సామాన్యమన్నారు. విశేషాల ఒకదానినొకటి గాని సామాన్యాన్నిగాని వ్యాపించలేవు. సామాన్య మనేది లేకుంటే విశేషాలుండలేవు. విశేషాలు లేకున్నా సామాన్యం ఉండగలదు. సామాన్యం అస్తిత్వమే విశేషాల అస్తిత్వం. వాటికి ప్రత్యేకమైన అస్తిత్వం లేదు. అప్పటికి వాస్తవంగా ఉన్నది సామాన్యమే. విశేషాలు వాస్తవంలో లేవు. సామాన్యమే స్వరూపం. విశేషాలు దాని అభాస. సామాన్యమే స్వరూపంగా ఉంటుంది. అదే అభాసగా కనిపిస్తుంది. స్వరూపానికి వినాశం లేదు. విశేషాలు ఏప్పటికైనా నశిస్తాయి. కనుక సామాన్యాన్ని విశేషాలలో గుర్తించటమే ప్రత్యభిజ్ఞా. ప్రతి విశేషంలో అలా గుర్తిస్తూపోతే విశేషాలు సామాన్యానికి విజాతీయం కావు. దానికి సజాతీయమే అవుతాయి ఇదే ప్రవిలాపనం.

పైన చెప్పిన సామాన్య విశేషాల సంబంధము అర్ధం చేసుకోవాలంటే లోకంలో ఏదృష్టాంతమైనా తీసుకోని చూడవచ్చు సువర్ణాభరణ దృష్టాంతమే తీసుకొని చూడండి సువర్ణం ఏకం ఆభరణాలు అనేకం, సువర్ణం నుంచే ఆభరణాలు అన్ని వస్తాయి. ఆభరణాలన్నింటిని సువర్ణమే లోపల వెలుపల వ్యాపించి ఉంటుంది. ఆభరణాలు వ్యాపించలేవు. బంగారం తీసివేస్తే ఆభరణాలు లేవు. ఆభరణాలు లేకున్నా బంగారం ఉంటుంది. సువర్ణం అస్తిత్వమే వాటి అస్తిత్వం. వస్తుతః ఉన్నది అసలు సువర్ణమే. ఆభరణాలు కేవలం దాని ఆభాసే వాస్తవం కావు. బంగారమే స్వరూపంగా ఉంటూ సొమ్ములుగా కనిపిస్తున్న. అది నశించదు. సొమ్ములు కరిగించిన చెరిపించినా పోతాయి. కనుక సొమ్ములు అన్నిటిలో బంగారాన్ని గుర్తించటమే ప్రత్యభిజ్ఞా. గుర్తిస్తూ పోతే ఆభరణాలు సువర్ణానికి అన్యంగా కనిపించవు అదే వాటి ప్రవిలాపన.

ఇప్పుడిలాంటి దృష్టాంతాలు ఏన్ని చెప్పినా అసలు విషయమైన ఆత్మ అనాత్మల స్వరూపాన్ని మనం బాగా అర్దం చేసుకోటానికే. చేసుకుంటే మన జీవిత సమస్య ఏమిటో అద్వైతులు దాన్ని ఎలా పరిష్కరించారో తేలిసి పోతుంది. ప్రస్తుతం ఆత్మ అనేది నేనున్నాననే స్పురణే. ఆస్పురణలో స్పురించే పదార్దాలన్ని అనాత్మ క్రిందకే వస్తాయి. ఈ స్పురణ ఒక్కటే. స్పురించే పదార్ధాలు అనేకం. అవి మన మనస్సు దగ్గర నుంచి బాహ్యమైన ఆకాశం వరకు ఏన్నో ఉన్నాయి. అవన్నీ స్పురణ నుంచి వచ్చినవే స్పురణ అస్తిత్వమే అన్నిటిని వ్యాపిస్తుంది. స్పురణే లేకుంటే ఈ అనాత్మ ప్రపంచం మనకే మాత్రం స్పురించదు. కనుక దాని అస్తిత్వమే వీటి అస్తిత్వం. అప్పటికి ఆత్మే ఉంది వస్తుతః అనాత్మ వాస్తవంగా లేదు. దాని స్వరూపం స్పురణే కనుక అవి దాని ఆభాసే. స్పురణే స్వరూపంగా ఉంటూ చరాచర ప్రపంచంగా బాసిస్తుంది. స్పురణ రూపమైన అస్తిత్వం ఎప్పటికి నశించదు. నశించేవి స్పురించే అనాత్మ పదార్ధాలే. కాబట్టి సాధకుడైన వాడు శరీరం మొదలుకొని విశ్వశరీరం వరకు ప్రతి పదార్ధంలో అస్తి - భాతి ఉందనే స్పురణ మాత్రమే గుర్తిస్తూ పోతే చాలు. ఇదే అసలైన ప్రత్యభిజ్ఞా. అలా గుర్తించే సరికి మన ఆత్మ సర్వత్ర వ్యాపిస్తుంది. ఈ అనాత్మ ప్రపంచం అంతా దానికి అన్యంకాదు కేవలం దానికి సజాతీయం గానే కనిపిస్తుంది. ఇదే ప్రవిలాపనం. రెండు కలిసి ఒక్క మాటలో చేపితే సర్వాత్మ భావం అద్వైత భావం.

ఇందులో మనం గ్రహించ వలసిన రహస్య మొకటి ఉన్నది. దృష్టాంతాలు ఏవి చెప్పినా అవి ఈ స్పురించే అనాత్మ ప్రపంచంలోనే . అవి ఆత్మకు అన్ని అంశాలలో సరిపోవు. ఇవి దృశ్యమైతే ఆత్మ జ్ఞాన స్వరూపం. కనుక వీటిలాగ దృశ్య కాదు అదృశ్యం. ఇది ఒక రహస్యం. మరొకటి ఇవన్నీ ఉన్న పదార్ధాలేగాని ఉనికి కాదు. పదార్ధాలు దృశ్యమే కాని వాటి ఉనికి అదృశ్యం. అదృశ్యమైన ఎరుక ఉనికి ఇవి రెండే ఆత్మ. అది మన స్వరూపమే. అదే ఉన్న పదార్ధాలుగా కనిపించే అనాత్మ ప్రపంచం అయినది. ఇందులో గుప్తమైన మన స్వరూపాన్ని పట్టుకోవటమే ప్రత్యభిజ్ఞా. అదే సాధన. ఆ దృష్టితో ప్రతి పదార్ధాన్ని చూస్తూపోతే అది మన ఆత్మ స్వరూపానికి సజాతీయంగా కేవలం మన విభూతిగా దర్శనమిస్తుంది. కనుక జనన మరణాది జీవిత సమస్యలన్నీ ఇలాంటి అద్వైత దర్శనంలోనే మనకు పూర్తిగా పరిష్కారం అవుతాయి.

***