#


Index

  ద్రష్టవ్యః - సాధన చేసి అలాటి సర్వతోముఖమైన దర్శనాన్ని సంపాదించాలి. ‘సాధు పశ్యతా’ సంపాదించి తాను సర్వజ్ఞుడైతే తన విభూతిగా చూస్తాడీ సమస్తాన్నీ.

  సమస్తమంటే ఏమిటను కొన్నావు. ధర్మశ్చార్ధశ్చ కామశ్చ - ధర్మమూ దాన్ని ఆచరించే ధార్మికుడూ అర్థమూ ఆర్థికుడూ - కామమూ కామికుడూ మొత్తానికి ఇహపరాలూ వాటిలో బడిపోయే మానవుల మనో వ్యాపారాలనూ వారి వారి ఫలానుభవాలనూ అన్నింటినీ అలాగే నిర్లిప్తంగా నిలిచి చూస్తుంటాడు. చూస్తుంటే వాడు సిద్ధుడు. అది నీవూ నేనూ అలవరుచు కొంటూ పోతే సాధకులం. ఎప్పటికైనా ఏ మానవుడైనా అలా దర్శించే సాధన చేయాలని అప్పుడే ఆ స్థితి నందుకోగలడని భగవానుడి ఉపదేశం. అందుకొన్నవాడి దృష్టికీ లోక వ్యవహారమంతా ఎలా కనిపిస్తుంది. 'కాలక్రమ సమాహితాః' పురుషార్థాలూ వాటినర్ధించే పురుషులూ అంటే మానవులూ అంతా ఈశ్వరీయమైన కాలమనే క్రియాశక్తిలో సుళ్లు తిరుగుతూ ఒక నాటక ప్రదర్శనలాగా దర్శనమిస్తుంది. ఎటువచ్చీ అలా చూడాలి వివేకవంతుడైన ప్రతి మానవుడూ. అప్పుడే శాంతి. లేకుంటే సాంసారికమైన అశాంతికి లోనుగాక తప్పదు.

  ఇక్కడ రామస్వామి మాటల్లో ధర్మార్థ కామాలు మూడే వినబడు తున్నాయి. మోక్షమనే నాలుగవ పురుషార్ధం లేదిక్కడ. ఇది చాలా సాభిప్రాయమైన వాక్యం.

Page 68