#


Index

  ఏమి కారణమంటే నీది పరిమితమైన సంకుచితమైన దృష్టి. దీనికి భిన్నంగా ఈశ్వర దృష్టి పరిపూర్ణం. పరిమితాన్ని శాసించేది పరిపూర్ణం. పరిపూర్ణాన్ని పరిమితం శాసించలేదు.

నియతిః కారణంలోకే నియతిః కర్మసాధనమ్
నియతి స్సర్వభూతానాం - నియాగేష్విహ కారణమ్ - 31

  ఆ ఈశ్వర శాసనమే నియతి Destiny ఇది ఇలాగే జరగాలి మరోలా జరగకూడదనే నియమం. సర్వానుల్లంఘ్య శాసనా అని అమ్మవారి నామం. ఎవరూ దాన్ని దాటిపోలేరు. నియతిః కారణంలోకే. అదే లోకంలో అన్నిటికీ కారణం. నియతిః కర్మసాధనం- మనంచేసే పనులు కాదు. చేయటానికి మనమెవరం. మనోవాక్కాయములతో మానవుడు చేసే ప్రతి కర్మకూ అదే సాధనం. అది చేయిస్తుంటే చేస్తున్నదీ మనసు ఆలోచన. మాటాడమంటే మాటాడుతున్నదీ వాక్కు మంచీ చెడ్డా చేయమని పురమాయిస్తే చేస్తున్నదీ శరీరం. నియతిస్సర్వ భూతానాం నియోగేష్విహ కారణం ఇంతెందుకిన్ని మాటలు. సమస్త ప్రాణులూ ఏది సంకల్పించినా ఏది చేస్తున్నా అదంతా నియతి అనేది వెనకాల చేరి ప్రేరణ చేస్తుంటేనే జరుగుతుంటుంది. స్వతంత్రంగా ఎక్కడా ఏదీ సంభవం కాదు. కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతి జైర్గుణైః అని కృష్ణబ్రహ్మం చెప్పింది ఈ రామబ్రహ్మం చెప్పిన మాటే.

  ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. మన జీవితమంతా ఆ ఈశ్వరశక్తికే వశమై నడుస్తుంటే ఇక మన ప్రయత్నమేమిటి. పురుష ప్రయత్నమే లేకుంటే పురుషార్ధమనేది ఎవరికి చెప్పినట్టు, పురుషుడర్ధించేది అనుభవానికి తెచ్చుకోవలసిందిగదా పురుషార్ధమన్నారు.

Page 65