#


Index

  అది నా స్వరూపమేనని పరిమితమైన తన మనస్సును పరిపూర్ణంగా మార్చుకోవటమే మార్గం. 'మహాంతం విభు మాత్మానం మత్వా' అని మహర్షులెప్పుడో సెలవిచ్చారీ లోకానికి.

నకాలస్యాస్తి బంధుత్వం నహేతు ర్నపరాక్రమః
న మిత్ర జ్ఞాతి సంబంధః కారణం నాత్మనో వశః - 30

  ఈ పూర్ణ భావన లేనంతవరకూ కాలం కాలమని ఎంత వాపోయినా సుఖం లేదు. ఎంత దాన్ని ద్వేషించినా ప్రయోజనం లేదు. నకాలస్యాస్తి బంధుత్వం – దానికొకడు కావలసిన వాళ్లని లేదు. ఇంకొకరు పరాయివాళ్లని లేదు. మిత్రత్వం శత్రుత్వ మనే తేడా పరిమితమైన మానవుడి మనస్సుకే. పరిపూర్ణమైన భగవచ్ఛక్తి కేదీ లేదు. నహేతు ర్న పరాక్రమః హేతు పరాక్రమాలు కూడా లేవు దానికి. ఎందుకిలా జరుగుతుందనేది హేతువైతే ఈ జీవులనెలాగైనా పట్టి చూడాలనేది పరాక్రమం. సర్వవ్యాపకమైన ఈశ్వరశక్తి అంతా సమానమే. ద్వంద్వాల ప్రసక్తే లేదక్కడ. వైషమ్యముంటే గదా ద్వంద్వం. సర్వమూ సామ్యావస్థే అయినప్పుడు వైషమ్యమెక్కడిది.

  అంతేకాదు. నమిత్రజ్ఞాతి సంబంధః వీడు మిత్రుడని. వీడు మన చుట్టమని ఇలాటి సంబంధ బాంధవ్యాలు దానికి లేవు. అలాటి సంబంధమే ఉంటే అయినవాణ్ణి రక్షించాలి కాని వాణ్ణి శిక్షించాలనే భేద భావ మేర్పడుతుంది. కారణం నాత్మనోవశః మరేమిటి కారణమంటారా. ఏదీగాదు. నీవశంలో లేదేదీ.

Page 64