#


Index

  ప్రేయస్సువల్ల కలిగే దుష్పరిణామ మెలాంటిదో నిత్యమూ మనం చూచే పరిస్థితులే మనకు గుర్తు చేస్తున్నాయి. ఇంకా మనం తెలివి తెచ్చుకొని జీవితాలు చక్కదిద్దు కోకపోతే ఎంత వెట్టితనం.

సంస్కార్యో హరిరాజస్తు - అంగద శ్చాభిషిచ్యతామ్
సింహాసన గతం పుత్రం పశ్యం తీ శాంతి మేష్యసి - 27

  అంచేత అంతటి గొప్ప ఆత్మజ్ఞానానికి నీవు నోచుకోక పోయినా ఇహంలో నీవు పాటించవలసిన కర్తవ్యమైనా పాటించు. సంస్కార్యోహరి రాజస్తు వానర రాజైన వాలికి దహన సంస్కారాలు యధావిధిగా చేయించు. అంగదశ్భాభిషిచ్యతాం - నీకుమారు డంగదుణ్ణి పట్టాభిషిక్తుణ్ణి గావించు, సింహాసన గతం పుత్రం పశ్యంతీ శాంతి మేష్యసి అలా చేస్తే కనీసం సింహాసనాధిష్ఠితుడైన కుమారుణ్ణి చూస్తూనైనా నీకు శోకోప శమనమూ మనశ్శాంతీ లభించగలదు.

  అని ఈ విధంగా తన భక్తుడు ఆంజనేయుడు ముక్తసరిగా చేసిన ఉపదేశం విని ఎంతో సంతోషించి భగవానుడైన రామచంద్రుడే ఇప్పుడు మరలా రంగంలో దిగి ఆ రెండింటికీ ముక్తాయింపుగా కొన్ని గొప్ప సుభాషితాలు సెలవిచ్చి భరత వాక్యం పలుకుతున్నాడు.

Page 61