ఆయురుత్తమ మాసాద్య భోగా నపిచ రాఘవః
సన శోచ్యః పితా తాత స్వర్గస్సత్కృత స్సతామ్ - 20
ఇంతకూ మన తండ్రి దశరధ మహారాజు తత్త్వజ్ఞుడు కాకపోయినా ధర్మజ్ఞుడు. ఆయురుత్తమ మాసాద్య ఎంతోకాలం జీవించాడీ లోకంలో. షష్టిర్వర్ష సహస్రాణి - 60వేల ఏండ్లు రాజ్యమే చేశాడు దశరధుడని వాల్మీకి వాచా చెప్పాడంటే అప్పటికి దశరధుడి ఆయుర్దాయమెంతో మన మూహించుకోవచ్చు. సుమారు ఒక లక్ష సంవత్సరాలైనా జీవించి ఉంటాడు. భోగానపిచ రాఘవః - ఎంతకాలం జీవించాడో అంత కాలమూ ఐహిక భోగాలన్నీ నిరాఘాటంగా అనుభవిస్తూ వచ్చాడు. స్వర్గతః సత్కృత స్సతామ్ మరి కేవలం భోగలాలసమైన జీవితమే గాక జీవితాంతమూ ధర్మమార్గం తప్ప లేదాయన.
క్షత్రియోచితమైన సమస్త ధర్మాలూ శాస్త్రమెలా విధించిందో ఆ విధానం తప్పకుండా ఆచరిస్తూ వచ్చాడు. ధర్మజ్ఞులైన సత్పురుషులందరి ప్రశంసలూ అందుకొని చివరకు దేహత్యాగం చేసి తన ధర్మాచరణకు తగినట్టు స్వర్గలోకమే చేరి స్వర్గ సుఖాలను భవిస్తున్నాడు. సనశోచ్యః పితా తాత నాయనా భరతా అలాటి తండ్రిగారి కోసం నీవుగాని నేనుగాని పరిత పించటం మంచిది కాదు. శోచనీయుడు కాడాయన శ్లాఘనీయుడు. సరిగా ఇది అశోచ్యానన్వ శోచస్త్వమ్మనే గీతా శ్లోకాన్ని తలపిస్తున్నది. నాను శోచంతి పండితాః అని గదా కృష్ణ బ్రహ్మం మాట. రామబ్రహ్మం మాట కూడా అదే.
Page 54