#


Index

  బ్రహ్మసాయుజ్యం కాకపోయినా దేవతా సాయుజ్యమైనా ప్రాప్తించగలదు. అలాంటి మంచి మార్గంలో పయనిస్తున్నావు నీవు భరతా ఎందుకిలా శోకిస్తున్నావు. యస్యనాస్తి వ్యతి క్రమః శోకించినా కాలగతిని దాటిపోలేము గదా. గడచిపోయిన కాలాన్ని వెనక్కు మళ్లించటం సాధ్యం కానప్పుడెంత వగచి ఏమి సుఖం.

వయసః పతమానస్య- స్రోతసోవా నివర్తినః
ఆత్మాసుఖే నియోక్తవ్యః సుఖభాజః ప్రజాః స్మృతాః - 19

  కాకపోయినా వయసః పతమానస్య - మానవుడి వయస్సు నిలకడగా ఉండేది కాదు. క్షణ క్షణమూ పడిపోతుంటుంది. ఆయుః పరిస్రవతి భిన్నఘటా దివాంభః ఓటికుండలో నీరు కారినట్టు కారిపోతున్న దాయుస్సు మానవులకు, అలాంటప్పుడు మన తండ్రులు పోయారే తాతలు పోయారే అని వాపోతావేమిటి. పోక ఏమవుతారు. ఒక మానవుడేమిటి. నిరంతర ప్రవాహశీలమీ ప్రపంచమంతా. స్రోతసోవా అనివర్తినః ఇంతెందుకు. ఒక నదీ ప్రవాహానికి జవాబు చెప్పు చూతాము. ఏ కొండ శిఖరం మీదనో పడుతుంది వర్షం. అక్కడ నుంచి వర్షం ధారాపాతంగా నేలమీద జాలువారుతుంది. అది అక్కడ నిలవక మరలా అతివేగంగా ప్రయాణం చేస్తూ పోయి చివరకు సముద్రంలో కలుస్తుంది. ఇందులో ఏ ఒక్క దశలో కూడా దానికి ముందు చూపేగాని వెనక్కు తిరిగే ప్రశ్నే లేదు.

Page 52