#


Index

  పారమేశ్వరమైన శక్తే గదా ప్రకృతి అంటే. ఈశ్వరుడికి లేని సౌందర్యం పరాశక్తికుంది. ఆయన సత్యస్వరూపుడైతే ఆయన మాయాశక్తి సౌందర్య రూపిణి. త్రిపుర సుందరి అని గదా పేరు. క్షణే క్షణే యన్నవతా ముపైతి-తదేవ రూపం రమణీయ తాయాః అన్నాడు మాఘుడు, ప్రతి క్షణమూ క్రొత్తగా కనపడే దేదో అదే సౌందర్యమంటే. శక్తికే ఉంది అలాటి శక్తి. నిర్వికల్పమైన పరమాత్మ చైతన్యాన్ని సవికల్పంగా చూపగలదది. నిర్వికల్పంగా ఉంటే అందం లేదు. సవికల్పంగా మారితేనే అందచందాలు, మాయాకల్పిత దేశ కాలకలనా వైచిత్ర చిత్రీకృతమైతేనే అది నవనవంగా క్షణక్షణ రమణీయంగా కనిపిస్తూ మనసు నాకర్షిస్తుంది. వివేచనా రహితుడైతే మానవుడలాటి ఆకర్షణకు లోనయి తన కర్తవ్యాన్నే మరచిపోతాడు.

  దేశకాల వైచిత్ర్యాన్ని చూచి మురిసి పోతుంటాడే గాని అది తన కొంప ముంచుతుం దెప్పటికైనా అనే సత్యాన్ని గుర్తించటం లేదు మానవుడు. 'ఋతూనాం పరివర్తేన ప్రాణి నాం ప్రాణ సంక్షయః - గుర్తించక పోతే నష్టమేమి టంటారా ఎంత నష్టమో చెప్పులే మంటున్నాడు. ఏమిటది. ఒక ఋతువు పోయి మరొకటి వస్తున్నదంటే ఏమిటర్ధం. కాలం కదలిపోతున్నదని గదా. కాలం ముందుకు పోయే కొద్దీ ప్రాణినాం ప్రాణ సంక్షయః - ప్రాణుల ప్రాణం కూడా దానితోపాటు గడచిపోక తప్పదు. ప్రాణమంటే క్రియాశక్తి అయిన కాలమే గదా. అప్పటికి కాలం పోతున్నదంటే అర్థం ప్రాణం పోతున్నదనే.

Page 41