#


Index

అహోరాత్రాణి గచ్ఛంతి -
సర్వేషాం ప్రాణినా మిహ
ఆయూంషి క్షపయంత్యాశు -
గ్రీష్మే జల మివాంశవః -7

  కాని ఆత్మారామ స్థితిని మనం గుర్తించనంత వరకూ ఈ కాలగతి మనందరి మీదా పనిచేస్తూనే ఉంటుంది. దాని ధాటి మన మనుభవించక తప్పదు. అర్థకామాలేమిటి ఆముష్మికమైన ధర్మమేమిటి. అవి మూడూ దీని రాజ్యంలోనివే. నిరంకుశమైన దాని పాలనకు తల ఒగ్గవలసిందే. తప్పదు. అహోరాత్రాణి గచ్చంతి - అహోరాత్రాల రూపంలో నడుస్తూ ఉంటుంది కాలమనేది. సర్వేషాం ప్రాణినామిహ అది ఈ లోకంలో బ్రతికే ప్రతి జీవికీ అనుభవగోచరమే. పగలు పనులు చేసుకొంటూనే ఉంటాము. రాత్రులు పడుకొని నిద్రపోతుంటాము. ఇది ప్రతిదినమూ అనుభవిస్తూనే ఉన్నాము. దీనికి భిన్నంగా ఎంత పామరుడైనా ఎంత మేధావంతుడైనా ఎవడు గాని జీవిస్తున్నాడేమో చెప్పు చూతాము. ఆ బాల గోపాలమూ ప్రతి ఒక్కడూ రాత్రులు నిద్రలో మునిగిపోవలసిందే. పగలు మేలుకొని లేచి ఆ పనీ ఈ పనీ చేస్తూ పోవలసిందే.

  అహోరాత్రాలు గడుస్తూ పోయే కొద్దీ వాటి ఆజ్ఞకు లోబడి నిద్రా జాగ్రత్తులు కూడా మనకు నడుస్తూ పోక తప్పటం లేదు. అంత మాత్రమే గాదు. అలా గడుస్తూ గడుస్తూ కాలం మనకు తెలియకుండా చాప క్రింద నీళ్లలాగా ఒక ఉపద్రవం తెచ్చి నెత్తిన పడేస్తున్నది. ఆయూంషి క్షపయంత్యాశు ఉన్నట్టు మన ఆయుర్దాయాన్నే హరిస్తున్నది. ఎప్పుడు గుండె ఆగి చస్తామో తెలియదు.

Page 28