అలాగే సంయోగా విప్రయోగాంతాః పండగా పబ్బానికీ నలుగురూ కలుసుకొని ఎంత ఆలజాలంగా ఉన్నామని ఆనందించినా చివరకందరూ విడిపోవలసిందే. యోగం వియోగంతో అంతమైపోక తప్పదు - అంతేగాదు. ఇదంతా ఒక ఎత్తు. జీవితాంతమూ ఎంత భోగభాగ్యాలతో తులతూగినా చివరకేనాడో ఒకనాడు కన్నుమూయ వలసిందే. అప్పుడిదంతా వదలిపెట్టి పోవలసిందే. అదే చెబుతున్నాడు రాముడు. మరణాంతంచ జీవితమని. ఎంత గొప్ప జీవితమైనా మరణంతో సమాప్తం.
వ్యావహారిక దృష్టితో చూచినా ఇది ఎంతో అద్భుతమైన బోధ. సర్వేక్షయాంతా అనేది లోకంలో కోట్లకు పడగలెత్తిన పెద్ద పెద్ద ధనవంతులనూ వ్యాపారస్థులనూ దృష్టిలో పెట్టుకొని చేసిన హెచ్చరిక. మీరు మీ జీవితంలో అనుక్షణమూ అవీ ఇవీ పోగు చేసుకోవాలనే ప్రాకులాడు తున్నారు. మీరెంత తాపత్రయపడ్డా అది ఎంతో కాలం నిలవదు. ప్రాప్తమున్నంత వరకే సుమా మీకది దక్కేది. అనుభవించే యోగం లేదో ఉన్నట్టుండి రెక్కలు వచ్చి ఎక్కడికి ఎగిరిపోతుందో చెప్పలేము. కరి మ్రింగిన వెలగ పండులాగా చూస్తూ చూస్తుండగానే మాయమైపోగలదు. కనుక మీరది గుర్తుంచుకొని ఉన్నవాళ్లు లేనివాళ్లకు సహాయం చేసివారికి కూడా మీలాటి అనుభవాన్నే కలిగించండి. వారికీ మీకూ అది తృప్తి. అలాగే పతనాంతాః సముచ్ఛయాః అని పెద్ద పెద్ద పదవులలో ఉన్నాం మనకేమని విఱ్ఱవీగే పాలక వర్గాన్ని హెచ్చరిస్తున్నాడు. మీరు గడ్డి దిగి కంపదిగి తిమ్మిని బ్రహ్మిని చేసి ఎంత గొప్ప స్థాయి కెదిగామని సంతోషించినా లాభం లేదు.
Page 17