అజ్ఞానం వల్ల ఏర్పడింది వాస్తవం కాదు గనుక వాస్తవమైన జ్ఞానముదయిస్తే చాలు. అంతా మటుమాయం. ఏతావతా అలాంటి ఆత్మజ్ఞానం సంపాదించు నీవు కూడా ఓ భరతా. అప్పుడే విషాదమూ నీమీద పనిచేయదని ఆత్మారాముని బోధ.
సర్వే క్షయాంతా నిచయాః - పతనాంతా స్సముచ్ఛయాః
సంయోగా విప్రయోగాంతా- మరణాంతంచ జీవితమ్ - 3
పోతే అలాటి ఆత్మజ్ఞానం కలగాలంటే అది నూటికి కోటికే ఒక్కడికో. మిగతా తొంభయి తొమ్మిదిమందీ అజ్ఞానులే. ఆత్మలోగాక వారందరూ దాని ఆభాస అయిన ప్రపంచ వ్యవహారంలోనే మునిగి తేలుతుంటారు. ఆ భాసనే వాస్తవమని నమ్మి ఇది ఎప్పటికీ ఉంటుందని చెప్పి ఇందులో తాము కోరినదంతా పోగు చేసుకోవాలని అనుభవించాలని ఉబలాటపడతారు. నిచయాః ధనకనకాదులూ వస్తువాహనాదులూ గుహారామక్షేత్రాదులూ ఇలాటివన్నీ పోగు చేసుకొంటూపోతారు. కాని క్షయాంతాః - ఎప్పటికైనా అవి క్షీణించి పోయేవే అని తెలియదు వాళ్లకు. ఎంతెంత పోగు చేసుకొన్నా అదంతా చివరకు నశించిపోయేదే. అలాగే పతనాంతాః సముచ్ఛయాః సముచ్ఛయమంటే ఉన్నతమైన స్థితి. ఎంతెంత ఎత్తుల కెదిగామని సంతోషిస్తారో అంతగా చివరకు పడిపోవలసిందే. పెరుగుట విరుగట కొఱకే అన్నట్టు ఉత్పతనం పతనానికే ఎప్పటికైనా.
Page 16