నీ చెప్పు చేతలలో లేదు నీ జీవితయాత్ర. నీవొక విధంగా బ్రతకాలని సంకల్పిస్తే మరొక విధంగా బ్రతకాలిసిన వికల్ప మేర్పడుతుంది.
శరీరమూ ప్రాణమూ మనస్సూ - మూడే మనకున్న పరికరాలు, మూడూ చలనాత్మకమే. శరీరం తమోగుణాత్మకం. ప్రాణమూ మనస్సూ రజో గుణాత్మకం. సత్త్వగుణ మెక్కడ ఉంది మరి. ఆ మనసులోనే ఉంది దాని కవకాశం. ప్రాణానికి లేదా అవకాశం. అది కేవల చలనాత్మకమే. మనసు చలించినా దానికి ఆలోచించే జ్ఞానముంది. అయితే అది ఎప్పటి కప్పుడు మారుతుంటుంది. నిలకడలేదు. దానికి కారణం అది నామ రూపాలకు చెందిన విశేషజ్ఞానం కావటమే. దానివల్ల అనీశ్వరః - అసమర్ధు డవుతున్నాడు మానవుడు. అసమర్థుడు గనుకనే ఇతశ్చేతరతశ్చ- ఇటూ అటూ వాణ్ణి లాగి పారేస్తుంటాడు. పరికర్షతి - ఎవడా పరికర్షణ చేస్తున్నది. కృతాంతః - దైవశక్తి. విధి అని కూడా దానికే పేరు. ఏది విధిస్తుందో అది విధి. సుఖమో దుఃఖమో ఎప్పుడేది వీడను భవించాలో అది వీడి అనుభవానికి తెస్తుంది. దానికేమిటంత కచ్చె ఈ మానవుడి మీద నంటావా. వీడింతకు ముందు చేసుకొన్నాడు గనుకనే దాని కనుగుణమైన ఫల మందిస్తుంది. కర్తృత్వం వీడిదే.
అసలు కర్తృత్వం భోక్తృత్వం ఈ రెండు లక్షణాలున్న వాడే మానవుడు. ఒక పని చేస్తాడు. అప్పుడు వీడు కర్త. దాని ఫలితం సుఖమో దుఃఖమో అనుభవిస్తాడు. అప్పుడు వీడే భోక్త. ఇది ఒక పరంపర.
Page 13