లేక ప్రకృతి జన్యమైన సుఖదుఃఖాలకు లొంగిపోయి ఆక్రందన చేస్తున్న తమ్ముణ్ణి సమాశ్వాసయత్ - ఓదార్చవలసి వచ్చింది. సర్వజ్ఞుడైన ఆచార్యుడే అల్పజ్ఞానంతో సతమతమయ్యే శిష్యుడికి తత్త్వోపదేశం చేసివాడికి శోకో పశమనం చేయగలడని మహర్షి హృదయం. దీనికి ప్రతిధ్వనే భగవద్గీతలోని అశోచ్యానన్వశోచస్త్వం అనే శ్లోకభావం. రాముడే కృష్ణుడికి దారి చూపాడని చమత్కారంగా చెప్పుకోవచ్చు.
నాత్మనః కామకారోస్తి పురుషోయ మనీశ్వరః
ఇత శ్చేతరత శ్చైనం కృతాంతః పరికర్షతి -2
ఆత్మజ్ఞానం లేకనే నీవిలా విలపిస్తున్నావని భరతుణ్ణి ఊరడిస్తూ రాముడొక మాట అంటాడు. భరతా నీకొక రహస్యం తెలియదు. అదేమిటంటే లోకంలో ఏ మానవుడికీ తన ఇష్టానుసారంగా ప్రవర్తించే శక్తి లేదు. కామకారమంటే ఇష్టానుసారమని అర్థం. పురుషుడంటే మానవుడు. పూర్ణత్వ మున్నవాడు గదా పురుషుడంటే. కావచ్చు. అది క్రిమి కీటక పశుపక్ష్యాదుల దృష్ట్యా చెప్పిన మాట. వాటిలో దేనికీ లేని ఆలోచనా శక్తి వివేచనా శక్తి ఉన్నవాడు గనుక పూర్ణుడయ్యాడు గాని మిగతా విషయాలలో వీడూ జంతువులతో సమానుడే. వాటిలాగే వీడికీ ఆహార నిద్రా భయ మైధునాదులూ ఆధివ్యాధి జనన మరణాది భయాలూ ఎప్పుడూ ఉంటూనే ఉన్నాయి. కనుక పురుష అనే మాట ఆపేక్షికమే. Relative పూర్ణ పురుషుడు కాడు. అనీశ్వరుడు. సామర్థ్యం లేదు ఏ విషయంలోనూ.
Page 12