#


Back

పరమ పురుషార్ధము - మోక్షము

ఆముష్మికంలో ధర్మ పురుషార్ధాన్ని ఇంతవరకూ విచారించాము. పోతే ఇక మిగిలింది నాలుగవది ఐన మోక్ష పురుషార్ధం. ఇది అన్నిటి కన్నా చివరిది. కనుక చరమమని - ఉత్తమమైనది గనుక పరమమని పేరు వచ్చింది. ధర్మం జనన - మరణాలనే రెండింటిని అలాగే ఉంచి జన్మాంతరాలు, అందులో మరల సుఖ దుఃఖానుభవాలు - వీటిని గురించే ఏకరవు పెడుతుంది. అంచేత సమస్య పూర్తిగా పరిష్కారం కావాలంటే మోక్ష పురుషార్ధమే చివరకు శరణ్యం. మోక్షమంటేనే పరిష్కారం. అది ఈ జీవభావం పోనంతవరకు లభించేది కాదు. తన స్వరూపాన్నిఉన్నదున్నట్టు గ్రహిస్తే కాని జీవభావం పోదు. తన స్వరూపాన్ని గుర్తించ గలిగినప్పుడే భగవత్తత్త్వం గూడా గుర్తించగలడు. బ్రహ్మ జ్ఞానానికి ఆత్మ జ్ఞానమనేది కుంచికలాగా పని చేస్తుందని పెద్దలమాట.

అసలు నీ కన్నా సన్నిహితమైన పదార్ధం ఈ సృష్టిలో వేరొకటి లేదు. అలాంటి నిన్నే నీవు తెలుసుకోలేకపోతే మరి ఏది తెలుసుకోగలవు. నన్ను తెలుసుకొనే ఉన్నాను గదా అని నీవనవచ్చు. నీవు తెలుసుకుంటున్నానని చెబుతూ ఉన్నది ఈ తల మొలా చేతులూ కాళ్ళూ మాంసమూ చర్మమూ - ఇంతకన్నా మరేది కాదు. పొతే నీ లోపల నీవు గుర్తిస్తూ ఉన్నది ఎంత వరకంటే ఆకలి వేస్తే అన్నం తినటం, కోపం వస్తే విరుచుకు పడటం, కామం చెలరేగితే పెండ్లి పేరంటాలు చేసుకోవటం ఇలాంటి వ్యవహారమే.

ఇంత మాత్రమే అయితే నీకున్న ఘనత ఏమిటి? నీ సోదరులైన జంతువులకు కూడా ఉన్నాయి గదా ఈ లక్షణాలు. వాటి కన్నా ఎక్కువ అనిపించు కోవాలంటే నీ తత్త్వాన్ని ఇదమిత్థమని గుర్తించాలి నీవు. నేనెవడను? నా స్వరూపమేమి? ఎక్కడ నుంచి వచ్చాను? ఎక్కడికి వెళతాను? ఇక్కడకు వచ్చి ఈ సత్రంలో నివసించటంలో గల ఆంతర్యమేమిటి? అసలు ఎవరు పంపారిక్కడికి? పంపిన వాడి ఉద్దేశమేమిటి? బంధ మోక్షాలనే మాటల కర్ధమేమిటి అని విచారణ సాగించాలి మానవుడు.

అసలింతకూ పశు మృగాదుల గుణాలు కూడా ఎందుకు నీలో జత చేసి సృష్టించాడో ఆ పరమాత్మ నీవు బాగా అర్ధం చేసుకోవలసి ఉంది. అవి అహర్నిశలు నిన్ను తమకు బానిసను చేసుకొని నీ మీద దౌడు చేయటమా? లేక నీవే వాటిని లొంగ దీసుకొని నీ సాధన మార్గంలో వాటిని పరికరాలుగా వాడుకోటమా ఏమిటి దీని తాత్పర్యం? అది నీవు తేల్చుకోవలసిన మొదటి విషయం. నీవీ సత్రంలో వచ్చి కాపురముండేదే నాలుగు రోజులు. తరువాత నీవెంతో చేయవలసి ఉంది ప్రయాణం. అలాంటప్పుడు వాటికి నీవు కాదు దాస్యం చేయవలసింది. వాటి చేతనే నీవు పనులు చేయించు కొనవలసి ఉంది. అది ఎలాగా అని అడగవచ్చు.

మానవుడు తన స్వరూపాన్ని తాను గుర్తించటమే కదా జీవిత లక్ష్యం. మానవుడికున్నవి రెండే రెండు పదార్ధాలు. ఒకటి ఈ శరీరం. మరి ఒకటి ఇందులో దాగి ఉన్న ఒక విలువైన నిక్షేపం. దానికే ఆత్మ అని పేరు పెట్టారు. శరీరం లాగా అది పైకి కనిపించదు. మనో నేత్రంతో మాత్రమే దర్శించగలం. వాస్తవంలో అదే నీవనే పదార్ధం. పోతే దానికి విలక్షణంగా కనిపించే దంతా ఇక దాని పరివారమే. ఆత్మ స్వరూపాన్నిఅర్ధం చేసుకోవాలంటే అందరికీ సాధ్యమయ్యేది కాదు. ప్రజ్ఞావంతుడైన వాడు ఉపాయంతో దాన్ని పట్టుకోవలసి ఉంది. నీవు ఒక గదిలో ఒంటరిగా కూర్చొని కనులు మూసికొని లోపల ఏ ఆలోచనా పెట్టుకోకుండా తుదకు నీకొక శరీరముందని గూడా మనస్సుకు తెచ్చుకోక శరీరం వెలపల ఏదో ఉందనే భావం కూడా తాత్కాలికంగా దూరం చేసుకొని కూచుంటే చాలు. తప్పకుండా ఆ సమయంలో నీకు నీ స్వరూప మేమిటొ గోచరించి తీరుతుంది. ఈ స్ఫురణే అసలైన నీ స్వరూపం. మిగతా మనః ప్రాణ శరీరేంద్రియాదులన్నీ దాని ఉపాధులు. ఈ సాధన ద్వారా మానవుడికి తన ఆత్మ స్వరూపమే గాక మోక్ష స్వరూపం కూడా అర్ధమౌతుంది. శరీర స్పృహ లేకున్నా నేనున్నాననే అవస్థే కదా మోక్షమంటే.

శరీరమనేది ఆత్మకు సంబంధించిన ఒక రాజ్యం. ఈ రజ్యంలో ఆత్మ రాజైతే దాని కెంతో మంది సైనికులున్నారు. అది ఈ ప్రపంచంలోని కసలు వచ్చిందంటే మరల తన స్వస్థానికి పోయి చేరటానికే వచ్చింది. అంచేత దాని కర్తవ్య మెప్పటికీ ఆయా భూమికల నారోహించి పైకి పోవటమే. బ్రహ్మ జ్ఞానాన్ని ఆర్జిస్తూ పోవటమే ఆరోహణ . ఆ జ్ఞానం బ్రహ్మ వివర్తమైన ఈ విశాల ప్రపంచాన్నితిలకిస్తే గాని కలగదు. ప్రపంచంలోని లోతు పాతులన్నీ గ్రహించాలంటే మానవుడు తన పంచేద్రియాల ద్వారా తప్ప గ్రహించలేడు. పంచేద్రియాల కాధార మీ శరీరమే. దానిని బట్టి ఆత్మ జ్ఞానమనేది మనం వల వేసి పట్టవలసిన ఒక పెద్ద చేప. ఇంద్రియాలు దానిని పట్టుకునే వల. శరీరం ఆ వలను మోసుకొని పోయే జాలరి.

ఏతావతా శరీరంతో ఆత్మకు సంబంధం ఇందు మూలంగా ఏర్పడింది. ఈ శరీరం కూడా పృధివి, జలము, తేజస్సు, వాయువు - ఈనాలిగింటి సామాహారం. అంచేతనే చాల సున్నితమైనది, ఎప్పుడు ఏ ప్రమాదానికి గురి అయినా కావచ్చు. అంచేత తన్ని వారణార్ధం తన కున్న పరివారాన్నే తాను చక్కగా ఉపయోగించుకో గలిగి ఉండాలి. ఒక మహా రాజెలాగైతే పరిపాలనా భారమంతా చాలా వరకు యుగధంరుడి లాంటి అమాత్యుడికి అప్పజెపుతాదో అలాగే జీవుడనే పాదుషా కూడా తన రాజ్య పాలన బుద్ధి అనే అమాత్యుడికే అప్పజెప్పటం మంచిది. అది కామ క్రోధాదులైన నౌకరుల నందరిని అదుపులో పెట్టి అవసరమైన చాకిరీ చేయించు కోగలదు. బుద్ధికి వాటిని వశం చేయాలే గాని బుద్ధిని వాటి కధీనం చేయరాదు. "బుద్ధింతు సారధిం" అన్నారు. బుద్ధే శరీరమనే రధానికి సారధి. ఇంద్రియాలనే అశ్వాలు ఈ సారధికి లోబడి సరియైన మార్గంలో పయనించినప్పుడే మోక్షమార్గంలో మన ప్రయాణం నిర్విఘ్నంగా సాగిపోతుంది. కనుక ఇంద్రియాలు బుద్ధికి దాసులైతే, బుద్ధి ఆత్మకు పరిచర్య చేయవలసి ఉంది. అది ఒక కరదీపిక లాంటిది. దీన్ని దీపిక లాగే ఉపయోగించుకొని గమ్యం చేరమని చెప్పటానికే ఈశ్వరుడు ఈ సామగ్రిని మనకు సరఫరా చేశాడు. దీని కంతటికే ధ్యేయం భగవత్సాన్నిధ్యమే.

ఇంతకూ ఆముష్మికాన్ని తనకు స్వస్ధానంగాను, ఐహికాన్నిఒక సత్రంగాను శరీరాన్ని ఒక వాహనంగాను, ఇంద్రియాలను పరిచారకులు గాను, బుద్ధిని తన కమాత్యుడి గానూ చేసుకోవాలి మానవుడు. అప్పుడే ఇహం మీద నుంచి పరానికి మళ్ళుతుంది మానవుడి దృష్టి. మానవుడు సృష్టిలో ఎంతో విశిష్టుడైనా ఆ విశిష్టతను అతడు కాపాడుకొన్నప్పుడే. లేకుంటే అతడిలో గుప్తంగాఉన్న పశు, మృగ లక్షణాలు పైకి వచ్చి సాధన మార్గం నుంచి ప్రక్కకు తప్పిస్తాయి. మనలో ఉన్న పశు మృగ లక్షణాలన్నారే అవి ఎక్కడ ఉన్నాయని అడగ నక్కరలేదు. ఉపేక్షిస్తే ఆ గుణాలే పైకి వచ్చి మనకు దర్శన మిస్తాయి. అవి మనలో ఉన్నా వాటి కంటే అదనంగా విచారణా శక్తిని ఇచ్చి సృష్టించాడా ఈశ్వరుడు. ఎవరికేది అతిశయంగా ఇచ్చి ఉంటాడో అదే దానికి పరిపూర్ణత. అందుకోసమే అది ఏర్పడి ఉంటుంది. దీనికొక ఉదాహరణ ఇస్తాను వినండి. గుర్రం గాడిద కన్నా ఉత్కృష్టమైనది. ఎందుకంటే గాడిద బరువులు మోయటానికే సృష్టి అయింది.గుర్రమలా కాదు. అది పరుగెత్త గలదు. బండికి కడితే లాగ గలదు. ఆట నేర్పితే ఆడగలదు. యుద్ధరంగంలో సైనికుడికి తోడ్పడగలదు. ఇంతేగాక గాడిద లాగా బరువు కూడా మోయగలదు. ఎప్పుడైనా ముందు చెప్పిన విశేష గుణాలు దానిలో లోపించాయో, అప్పుడది కేవలం బరువు మోసే గాడిద స్ధాయికే దిగజారుతుంది. అది దాని వ్యక్తిత్వానికే ఒక గొడ్డలి పెట్టు. అలాగే ఆహార నిద్రాభయమైధునాదులనే జంతు లక్షణాలు మానవుడిలో ఉంటే ఉండవచ్చు. వాటికంటే విశేషంగా ఆలోచనా గుణ మొకటుంది. దానికి పనిచెప్పినప్పుడే అతడు మానవుడని పించుకోగలడు. లేకుంటే మెత్తబడ్డ గుర్రంలాగా తానూ సంసార భారం మోయటానికే తప్ప మరి దేనికీ పనికిరాడు.

ఇంతకూ మానవుడంటే బుద్ధి జీవుడని అర్ధం. ఈ బుద్ధి అనేదే పశు పక్ష్యాదుల కంటె అతనికి అదనంగా ఉన్న లక్షణం. అది లేనిది గనుకనే మిగతా జీవ జాలమంతా జ్ఞానానికి నోచుకోలేదు. బుద్ధికి చెందినదే జ్ఞానం. ఈ జ్ఞానంలో కూడా రెండతస్తులున్నాయి. మొదటిది లోకులందరికి అవగాహనకు వచ్చేది. రెండవది కొందరికి మాత్రమే అనుభవానికి వచ్చేది. మనం లోకంలో నేర్చే సమస్త విద్యలు, కళలు, వృత్తులు మొదటి శ్రేణికి చెందినవి. పుస్తుకాలలో ఉండే విషయాలన్నీ గ్రహించగలం. గణిత వైద్య జ్యౌతిషాదులేమిటి, వేద శాస్త్ర పురాణాదులేమిటి, అన్నీ గ్రహించగలం. పరమాణువుకన్న చిన్నదైనా మానవుడి మనస్సులో ఎంత విజ్ఞానమైనా ఇముడ్చుకొనే శక్తి ఉంది. ఎన్ని ప్రపంచాలైనా అందులో ఇమిడిపోతాయి. అది ఒక పుష్పక విమానం. ఒకసారి సంకల్పించిందంటే పాతాళం నుంచి పరమేష్టి లోకం దాకా పరుగెత్తగలదు. తూర్పు నుంచి పడమర దాకా చుట్టబెట్టుకొని రాగలదు. మర్త్యమైన ఈ జగత్తులో ఉండి కూడా అమర్త్యత్వాన్ని గూర్చి ఆలోచించగలదు. సాగర గర్భంలో దాగి ఉన్న తిమింగిలాన్ని గూడా గాలం వేసి పైకి లాగ గలదు. అంతరిక్షంలో పారిపోయే పక్షిని గూడా భూమి మీద పడగొట్టగలదు. మరి సింహ శరభ శార్దూలాది ఘాతుక మృగాలను గూడా ఉపాయంతో పట్టుకొని స్వారి చేయగలదు. ఇదంతా జ్ఞాన ప్రభావమే. ఈ విద్యలన్నీ మానవుడు సాధించ గలిగినవే.

ఇవన్నీ మానవుడికి లభించేది పంచేద్రియాల ద్వారానే. పాంచ భౌతికమైన జగత్తు నంతా గ్రహించటానికి పంచేద్రియాలే దారులు. పోతే ఈ ఐదూగాక ఆరవ మార్గం ఒకటి ఉంది మానవుడి అంతరంగంలో. అది ఆ దివ్య జగత్తులోకి తెరుచుకొని ఉన్న ఒక అద్భుతమైన ద్వారం. అవి భౌతిక జగత్తు వైపు అయితే ఇది అభౌతికం వైపు తిరిగి ఉంటుంది. నూటికి తొంబది మందికి ఇది అంతుపట్టదు. జ్ఞాన శక్తిలో ఇది రెండవ అంతస్తు. దీని ద్వారా ప్రయాణం చేసి చేరవలసిన గమ్యం ఒక్కటే. అది బ్రహ్మాత్మ భావం. దానికే మోక్షమని మరి ఒక నామధేయం. ఇది ప్రత్యక్ష, అనుమానాలనే రెండు ప్రమాణాలకు అగోచరమైన దశ. అలాంటప్పుడు ఇది ఒకటి ఉందో లేదో అనే సందేహం కలగటం సహజమే. ఏ ఒకరి ఇద్దరి అనుభవమో అందుకు ప్రమాణ మంటే లోకం నమ్మకపోవచ్చు. అందుకేనేమో పండిత పామరుల ఇద్దరి అనుభవంలోను ఉన్న ఒకా నొక అవస్ధను దీనికి నిదర్శనంగా పేర్కొన్నారు మన పెద్దలు. అదే నిద్రావస్ధ. సుషుప్తి అని కూడా వ్యవహరిస్తారు. ఇంద్రియ ద్వారాలన్నీ మూతబడి పోతాయి. అప్పుడు మనకు తెలియకుండానే ఆరవ ఇంద్రియం అయిన మనస్సు ఈ భౌతికానికి దూరం అవుతూ అభౌతికమైన మరొక దానికి దగ్గర పడుతుంటుంది. వృత్తి రహితమైన మనస్సు ఒక అద్దంలాగా పరిశుద్ధమయ్యే అవకాశముంది అక్కడ. అప్పుడే అది తన స్వరూపమైన బ్రహ్మ చైతన్యంలో అప్రయత్నంగాపోయి తలదాచుకొంటుంది. ఐతే వృత్తులు లేకున్నా వాసనలనేవి వదలిపోవు. దానితో తాత్కాలికంగా మోక్ష సుఖాన్ని అనుభవించినా అది నిలబడదు. ప్రారబ్ధం కొద్దీ వాసనలు మరల వృత్తులుగా మారి జాగ్రదవస్ధలోనికి తెచ్చి పడవేస్తాయి. అది మరలా బంధమే.

అంచేత సుషుప్తిని మోక్షానికి దగ్గర దశ అనుకోవలసిందే గాని మోక్షమని చెప్పరాదు. మోక్షమే అయితే మరల జాగ్రత్ లోనికి రాకూడదు. ఎంత వరకంటే ప్రతి దినమూ సర్వులకూ వస్తూ పోతూ ఉన్న ఈ దశను లోతుకు దిగి పరిశీలించటమే మన కర్తవ్యం. పరిశీలిస్తే దృశ్య ప్రపంచం కనిపించకుండా పోవటమే గాదు మోక్షం. దృక్కు నిలవటం. దృక్కు నిలవటమే గాదు. అది నేనేనని భావింటం. భావించకుండా ప్రాపంచికమైన ఆయా వాసనలు మనస్సుకు అడ్డు తగులుతున్నాయి. అవి క్షాళితమై పోవాలి. అవి కూడా నా స్వరూపమేననే దృష్టితో దర్శించటమే సాధన. ఆత్మాకార వృత్తే ఆ దర్శించే మార్గం. దీనికే బ్రహ్మ విద్య లేదా పరా విద్య అని పేరు. ఇంతకు ముందు వర్ణించింది అపర ఐతే ఇది పర. అది ప్రపంచాభిముఖమైతే ఇది పరమాత్మాభి ముఖం. దానికి ప్రపంచమే వేద్యం. దీనికి వేద్యం పరమాత్మ. అక్కడ విద్యకు భిన్నమైనది వేద్యం. ఇక్కడ అలా కాదు అభిన్నమైనది. విద్యా వేద్యం ఒక్కటే ఈ వేద్యం దేశ కాల వస్తువులన్నింటిని వ్యాపించినది గనుక తదా కార వృత్తి అయిన విద్యతో దీన్ని గ్రహిస్తే చాలు. ఇక ఏ సాధన అక్కర లేదు. దేశ కాలాదులన్నీ స్వరూపంగానే అనుభవానికి వస్తాయి కాబట్టి లోకాంతర జన్మాంతర దేహాంతర ప్రసక్తి లేదు. అది లేకుంటే ఇక సంసార గంధమే లేదు గనుక సకల బంధ నిర్ముక్తుడై మానవుడు బ్రహ్మ భావాన్ని అందుకోగలడు. ఇదే పరమ పురుషార్ధమైన మోక్షం.

ఓం తత్సత్

***