#


Back

ప్రశ్నోపనిషత్ - 6వ ప్రశ్న

01. మొదటి ఐదు ప్రశ్నల విషయం ఆరవ ఫ్రశ్నలో కలిసి వస్తుందన్నారు. ఏమిటా విషయం. ఎలా కలిసి వస్తుంది?
జ. మొదటి ఐదింటిలో ప్రాణం, మనస్సుకు సంబంధించిన విషయమే ఉన్నది. అవి రెండూ విశేషాలు. ప్రాణం, మనస్సుగాదు. మనస్సు, ప్రాణంగాదు. అంతేగాక ఏ వ్యక్తి ప్రాణం ఆ వ్యక్తిదే. ఏ వ్యక్తి మనస్సు ఆ వ్యక్తిదే. ఒక దానినొకటి వ్యాపించలేదు. కనుకనే అవి విశేషాలు. పోతే 6వ ప్రశ్నలో చర్చించిన విషయం ఆత్మ. ఆత్మ అంటే ఉండటమనే స్ఫురణ. ఈ స్ఫురణ మనస్సునూ, ప్రాణంను గూడా వ్యాపిస్తుంది. ఇది మనస్సని, ఇది ప్రాణమని స్ఫురణలోనే తెలుసుకోగలుగుతున్నాము. స్ఫురణను తప్పించి వాటికి అస్తిత్వం లేదు. ఈ స్ఫురణ సామాన్యం. బంగారం నగలలాగా ఇది ఆ రెండింటిని వ్యాపించి తనలో కలుపుకోగలదు.

02. "పురుష కళ" ఈ మాటలకు అర్ధమేమిటి. పురుష తత్త్వం ఒక్కటే అయినప్పుడు అకల సకల అనే రెండూ ఎలా అయినది?
జ. పురుష అనగా పూర్ణమైన చైతన్యం. కళ అనగా అందులో ఒక భాగం. ఆ పరిపూర్ణమైనది తనపాటికి తాను వస్తు సిధ్ధంగా ఒక్కటే. అప్పుడది అకల. భాగములు లేనిదని అర్ధము. అదే నీ నా అనుభవంలో శరీరమని, ప్రాణమని, మనస్సని ఇలా విభక్తమై కనిపిస్తే దానికి సకలమని పేరు. మొదటిది వస్తుతంత్రమైతే ఆ రెండవది బుద్ధితత్రం.

03. అకల సకలగా మారటానికి ఏమి కారణం అలా మారినట్లు ఏమి నిదర్శనం?
జ. నా స్వరూపం అకలమని తెలియక పోవటమే కారణం. ఈ తెలియక పోవటానికే అవిద్య, అజ్ఞానమని పేరు. శరీరాన్ని, మనస్సుని, ప్రాణాన్ని ఈ మూడింటినీ నా స్వరూపమని మనమందరమూ జీవితాంతమూ అభిమానించటమే నిదర్శనం. ఒక్కమాటలో చెప్పాలంటే మిథ్యాత్మ భావం.

04. చైతన్యానికి కళలు సహజమా ఆగంతుకమా? ఆగంతుకమని ఎలా నిరూపించగలవు?
జ. చైతన్యం(జ్ఞానం,స్ఫురణ,ఆత్మ) పరిపూర్ణమైన జ్ఞానం. జ్ఞానస్వరూపమే సహజం. దానిలోపలికి వచ్చి దానివల్ల స్ఫురించే పదార్ధాలన్నీ ఆగంతుకమే. ఇవి స్ఫురణలో స్ఫురించ వలసిందేగానీ కేవలం స్ఫురణ గావు. స్ఫురణ స్పర్శ లేకపోతే ఇవి స్ఫురించవు. వీటి స్పర్శ లేకపోయినా స్ఫురణ తనపాటికి తాను స్ఫురణగా ఉండగలదు. కనుకనే అది సహజము. ఇవి అగంతుకములు.

05. జ్ఞానమొక్కటే వాస్తవం, జ్ఞేయ ప్రపంచం వాస్తవంకాదని చెప్పటానికి అద్వైతులు చూపే ఉపపత్తి ఏమిటి?
జ. జ్ఞానం స్వతఃప్రమాణం. తాను ఉన్నట్టు తనకే తెలిసినది. అంతేగాక తన చుట్టూ ఉన్నది గూడా తెలుసుకోగలదు. ప్రమాణం పని చేసినప్పుడే ఏదైనా ఉందని చెప్పగలం. ప్రమాణ స్పర్శ లేకుంటే ఉందని చెప్పటానికి ఆధారం లేదు. నేను ఉన్నానని చెప్పటానికి నా జ్ఞానమే నాకు ఆధారం. కనుక నేను వాస్తవం. జ్ఞానానికి గోచరిస్తేనే ప్రపంచం ఉంది గనుక తనపాటికి వాస్తవం గాదు. అంటే ప్రతి ఒక్కటి జ్ఞేయంగానే వాస్తవంగాని కేవలం పదార్ధంగా వాస్తవంగాదు. కాని నాకు ఉన్నట్లే దానికి కూడా జ్ఞానం ఉండవచ్చు గదా అని అంటే కాదనము. నా జ్ఞానానికి నా శరీరమనఃప్రాణాదులు జ్ఞేయమైనట్లే, దానిలో ఉన్న జ్ఞానానికి బాహ్యమైన దాని ఉపాధి జ్ఞేయమే. అసలు విషయ మేమనగా ఒకానొక శరీరమనే ఉపాధిని నాది అని భావించక మనకు గోచరించే ప్రతి ఉపాధిని వ్యాపించి అదంతా జ్ఞేయంగానే చూడ గలిగితే ఈ జీవుడి జ్ఞానం ఈశ్వరజ్ఞానమే. జ్ఞానం సంకుచిత మయ్యే కొద్దీ దానికి జీవుడని పేరు. వ్యాకోచం చెందే కొద్దీ అదే ఈశ్వరుడు.

06. ప్రపంచం వాస్తవంగా లేదని విజ్ఞానవాదులూ చెప్పారు కదా, వారి జ్ఞానానికి అద్వైతుల జ్ఞానానికి తేడా యేమిటి?
జ. ఇద్దరూ ప్రపంచం లేదని చెప్పారు. అంతవరకూ తేడా లేదు. వస్తువులో కాకపొయినా ఇద్దరి దృష్టిలో ఉన్నది పెద్ద తేడా. విజ్ఞానవాదులు జ్ఞానం విశేషజ్ఞానం. దానికి కన్పించే ప్రపంచం విశేషప్రపంచం. విశేషం ఉంటే, విశేషజ్ఞానం ఉంది - విశేషజ్ఞానానికి కన్పిస్తే, విశేషప్రపంచం ఉంది. ఇది విత్తు ముందా, చెట్టు ముందా లాంటి విషయం. ఆ పరిస్థితులలో జ్ఞానం మాత్రం ఉంది జ్ఞేయప్రపంచం లేదని చెప్పగూడదు. పోతే అద్వైతులది అలాంటి విశేషజ్ఞానంగాదు. సర్వవ్యాపకమైన సామాన్యజ్ఞానం. సామాన్యజ్ఞానం వ్యాపకం గనుక విశేషాలన్నింటినీ వ్యాపిస్తుంది. అపుడా విశేషప్రపంచం సామాన్యంగా వాస్తవంగాని విశేషంగా కాదు. కాకున్నా కన్పడుతుంది గనుక అది దాని విభూతి అని చెప్పాలి.

07. జ్ఞానం లేకుంటే జ్ఞేయం లేదన్నప్పుడు, జ్ఞేయంఉన్నా జ్ఞానం సుషిప్తి, మూర్ఛ మరణాదులలో లేదు కదా. ఏమిటి సమాధానం?
జ. దేనికైనా జ్ఞానమే ప్రమాణం. ఒకటి ఉందన్నా, లేదన్నా జ్ఞానమే చెప్పవలసివుంది. ఒకటి ఉందిగాని, నాకు మాత్రం జ్ఞానం లేదు అని చెప్పటంకన్నా తెలివితక్కువ లేదు. కారణం. ప్రమాణం పని చేయకుండానే ప్రమేయం ఉందని చెప్పటానికి అధికారం లేదు. అలాంటప్పుడు జ్ఞేయంలాగా జ్ఞానం కూడా ఎప్పటికప్పుడు తొలగిపోవటం ఎలా సంభవం అని ప్రశ్న. తొలగినట్లు సుషిప్తి, మూర్ఛామరణాదులే మనకు నిదర్శనం. దీనికి సమాధానమేమనగా ఆ దశలలో జ్ఞానం తొలగి పోయినట్లు చెప్పవలసిందెవరు? వాటిని అనుభవించే పురుషుడా లేక మరి ఒకడా? ఒకడికి అనుభవం ఉందో లేదోనని అనుభవించే వాడే చెప్పాలిగాని అనుభవం లేనివాడు చెప్పరాదు అని సాంఖ్యులకు అద్వైతులు ఇచ్చే సమాధానం. అయితే అనుభవించేవాడు మాత్రం తన అనుభవాన్ని ఎందుకు చెప్ప కూడదు అని ప్రశ్నిస్తే, దానికి కారణం అనుభవం లేక కాదు. దాన్ని బయటబెట్టే సాధన సామాగ్రి లేక. ఆ సాధనములే జ్ఞానేంద్రియ పంచకమూ, అంతరింద్రియమైన మనస్సు. మూర్ఛామారణాదులలో అవి క్రియాశూన్యమై వుండటంవల్ల ఒకరికి చెప్పటమనే క్రియ జరగటం లేదు. అయినా అంతమాత్రాన అనుభవమే లేకపోదు. అవస్థ అవస్థనే అనుభవించదు. అది అచేతనం. దానికి విజాతీయమైన చైతన్యమే దాన్ని అనుభవించ వలసియుంది. లేకుంటే ఆ అవస్థకు అర్ధం లేదు. కనుక జ్ఞానం సర్వకాల, సర్వావస్థలలో ఉండి తీరాలి. అలాంటి జ్ఞానమే వస్తుసిద్ధం. సామాన్యజ్ఞానం. అది మన దగ్గర ప్రస్తుతం దేహాత్మాభిమానంతో విశేషజ్ఞానంగా పరిచ్ఛిన్నమై పోయింది. కనుకనే మూర్ఛామరణాదులలో అది వృత్తిరూపంగా తొలగిపోయి, వాసనారూపంగా నిలచి ఉంటుంది. దానిని గ్రహించే వృత్తి లేదు గనుక అసలు అదే లేదని మనం భ్రమ పడుతున్నాము. ఇదే అద్వైతులు ఇచ్చే సమాధానం.

08. అనవస్థ అంటే ఏమిటి? అది బౌద్దుల జ్ఞానానికే గాని అద్వైతుల జ్ఞానానికి ఎందుకు వర్తించదు?
జ. అవస్థ అంటే నిలకడ. నిలకడ లేకపోతే అది అనవస్థ. ఒక్కటి కంటె మించి పదార్ధాలుంటే దీనికేమిటి అని ప్రశ్న వస్తుంది గనుక అది అనవస్థాదోషం. బౌద్దుల జ్ఞానం ఒకటి కాదు. క్షణక్షణం మారే వృత్తులనే వారు జ్ఞానమని భావించారు. ఈ వృత్తులు అనేకం గనుక అనవస్థ తప్పదు. పోతే అద్వైతులు అంగీకరించిన జ్ఞానం విశేషజ్ఞానం కాదు. అది సర్వవ్యాపకమైన సామాన్యజ్ఞానం. సర్వవ్యాపకం కనుకనే దీనికేమిటి దానికేమిటి అనే ప్రశ్న రాదు. అన్ని విశేషాలు అందులో చేరి పోవలిసిందే. ఆఖరుకు జీవితం, మరణం కూడా విశేషాలే గనుక వాటిని కూడా ఈ జ్ఞానమే వ్యాపిస్తుంది. వ్యాపిస్తే, జీవితంలో ఎలాగో, మరణంలో కూడా జ్ఞానం ఉండి తీరాలని అర్ధం అవుతుంది. అలా ఉంటే అది మరణమే కాదు.

09. ప్రకృతి కర్త, పురుషుడు భోక్త అనే సాంఖ్యుల వాదాన్ని అద్వైతులు ఎందుకు ఖండించారు. అలా ఖండించడంలో ఏమిటి ఉపపత్తి?
జ. ప్రకృతి అచేతనం అని సాంఖ్యులే ఒప్పుకొన్నారు. అచేతనమైన దానికి సంకల్పం కలగదు. సంకల్పం లేకుంటే క్రియ లేదు. కనుక అది క్రియకు కర్త కాదు. అలాగే పురుషుడు చేతనుడైనా వాడు అసంగుడు అని సాంఖ్యులు ఒప్పుకొన్నారు. ప్రకృతి గుణాలతో సంబంధం లేనిది చైతన్యం. అలాంటప్పుడు పురుషుడు భోక్త అని చెప్పరాదు. భోక్తృత్వమనగా అనుభవం. అనుభవం అసంగమైన జ్ఞానానికి సోకదు. సోకకుంటే భోక్త అనే మాటకు అర్ధం లేదు. అంతేగాక కర్తృత్వభోక్తృత్వాలు రెండూ ఒక పురుషుడికే చెప్పాలిగాని, ఒకటి ప్రకృతికి, మరొకటి పురుషుడికి చెప్పరాదు. పోనీ రెండూ రెండింటికీ చెపుదామంటే పురుషుడు స్వార్ధం, ప్రకృతి పరార్ధం అని చెప్పటం పొసగదు. కాని సాంఖ్యులు అచేతనమైనా ప్రకృతిలో కదలిక లేర్పడుతున్నవి గదా అది కర్తృత్వం కాదా అని ప్రశ్నించవచ్చు. ఏ కదలికకైనా ముందు జ్ఞానమే ఉండాలి అని సిద్ధాంతం. అది మన శరీరంలోనే కాదు, విశ్వశరీరంలో కూడా ఉండి తీరాలి. అదే అంతర్యామి. కనుక సాంఖ్యులు చెప్పిన సిద్ధాంతం నిలవదు.

10. ప్రపంచ సృష్టికి ఈశ్వరుడు కర్త అని అద్వైతులు చెబుతున్నారు కదా. అలా చెబితే చైతన్యం మార్పు చెందదా. ఏమిటి జవాబు?
జ. సృష్టి మూడు మార్గాలలో ఏ మార్గంలోనైనా జరగవచ్చు. ఒకటి - అంతకు ముందు లేనిది తయారవటం. అది ఆరంభవాదం. రెండు- అంతకుముందు ఉన్నదే మార్పు చెందటం. ఇది పరిణామవాదం. ఈ వాదాలు మనం నమ్మేటట్లైతే, ఈశ్వరుడు నిజంగా కర్త కావలిసి వస్తుంది. అయితే ప్రమాదం. వాడు తనపాటికి తాను నిరంకుశంగా జీవులను బాధించినవాడు అవుతాడు. అలాంటప్పుడు ఈశ్వరుడు ఒకడు ఉన్నా వాడు మామూలు జీవుడికంటే గొప్ప అనిపించుకోలేడు. అంతేగాక ఆ పక్షంలో చైతన్యం మార్పు చెందవలసి ఉంటుంది. చైతన్యం నిరాకారం గదా ఎలా మార్పు చెందుతుంది. కనుక ముందు చెప్పిన రెండు మార్గాలలో సృష్టి జరగలేదు. మరి ఏమిటి మార్గం. మూడవ మార్గంలో జరగ వలసినదే. దానికే వివర్తమని పేరు. అందులో ఈశ్వర చైతన్యం ఏమాత్రం మార్పు చెందకుండా అలాగే ఉంటూ జీవజగత్తులగా కూడా అదే భాసిస్తున్నది. ఇలా చెప్పటం మూలంగా ఎప్పటికైనా ఈ జీవుడు మార్పులేని చైతన్యమే తన స్వరూపమని చూడగలిగితే, జగత్తు వాడికి సంసారంగా గాక విభూతిగా దర్శనమిస్తుంది. అదే మరణ సమస్యకు పరిష్కారం.

11. జ్ఞానం తన్నుతాను తెలుసుకోకపోతే అది ఉన్నట్టు దాఖలా ఏమిటి. తెలుసుకొన్నా ఉందని ఎలా సమర్ధించడం?
జ. జ్ఞానం రెండు విధాలు. ఒకటి విశేషజ్ఞానం రెండు సామాన్యజ్ఞానం. మనకిప్పుడు ఉన్నది విశేషజ్ఞానం. సామాన్యజ్ఞాన స్పర్శే లేదు. ఈ విశేషదృష్టితో వేస్తున్న ప్రశ్న ఇది. తన్నుతాను తెలుసుకోక పోవటమనే ప్రశ్న. సామాన్యజ్ఞానంలో తన్ను, తానూ అనే తేడా లేదు. తనపాటికి తాను అని చెప్పాలి. తనపాటికి తానైనా తెలుసుకోవాలిగదా. తెలుసుకోకున్నా ఉందని ఎలా చెప్పటం. ఇది నీవు విశేషదృష్టితో అడుగుతున్నావు. సామాన్యదృష్టితో చూస్తే తెలుసుకోవటమనే కర్తృత్వం చెప్పరాదు. ఎందుకనగా అపుడది తనకు తాను కర్త కావలసి వస్తుంది. అయితే సామాన్యస్థాయి నుంచి విశేషస్థాయికి దిగజారక తప్పదు. అంచేత తెలుసుకోకున్నా అది తెలివే గనుక తనకు తాను ఉన్నట్టు తానే ప్రమాణం. క్రొత్తగా తెలుసుకోవలసిన అవసరం లేదు.

12. అకలమైన చైతన్యం సర్వత్రా ఉంది కదా, అది శరీరంలోనే ఉందని ఉపనిషత్తు చెప్పటంలో ఆంతర్యమేమిటి?
జ. ఆత్మ అనగా సామాన్య చైతన్యం. దానికే అకలమని ఉపనిషత్తు పెట్టిన పేరు. సామాన్యం గనుక అది సర్వత్రా ఉన్న మాట వాస్తవమే. కాని ఇది నీ నా అనుభవానికి రావలసియుంది కదా. దానికి సాధన మేమిటి. దానికదే కాదు సాధనం. మరి ఏది? సామాన్యం కానిది ఒకటి ఉంది. అది విశేషం. ఎప్పటికైనా ఈ విశేషం ద్వారానే దానిని పట్టుకోవలసి ఉంది. శరీరమనటంలో అది ఈ స్థూల శరీరం కాదు. కారణ శరీరం అంతకన్నా కాదు. కాగా సూక్షశరీరం ఒక్కటే మిగిలిపోయినది. అందులో కూడా ప్రాణం అచేతనం. ఆది ఆత్మ చైతన్యానికి సజాతీయం కాదు. దానికి సజాతీయమైనది ఒక్క మనస్సే. అందులో సవికల్పమైన మనస్సు నిర్వికల్పమైన చైతన్యాన్ని పట్టుకోవటం అసాధ్యం. కనుక 99 సవికల్పవృత్తులు వదలివేసి ఒకే ఒక నిర్వికల్పవృత్తిని అవలంబిస్తే, ఆ మనస్సుకు తప్పకుండా ఆత్మ అనుభవానికి వచ్చి తీరుతుంది. అందుకే ఈ శరీరంలోనే ఆత్మ చైతన్యం ఉందని ఉపనిషత్తు చెప్పటం. శరీరంలోనే అంటే శరీరంలో ఉండే బుద్ధి ద్వారానే అనుభవానికి వస్తుందని ఉపనిషత్తు ఋషి ఆంతర్యం.

13. "కళ, ఉపాధి" రెండూ ఒకటే కదా, అయినా కళ అని పేరు పెట్టి పదహారు కళలు పురుష చైతన్యం లోనుండి వచ్చాయని ఎందుకు చెప్పవలసి వచ్చింది?
జ. పురుష చైతన్యమనేది సామాన్యం. కళలన్ని దాని విశేషాలు. మనకు ఈ విశేషాలే జీవితాంతము అనుభవంలో ఉన్నాయి. ఒక విశేషం ఈ జీవుడు. మరొక విశేషం వీడికి కన్ఫించే జగత్తు. ఈ రెండూ చూస్తున్నంత వరకూ ఈ విశేషాలకు ఏది సామాన్యమో అది గుర్తు రాదు, కనుక దీని మీది నుంచి దృష్టి దాని వైపు మళ్ళించటానికి అందులో నుంచే ఇవి వచ్చాయని చెప్పటం. అందులో నుంచి అన్నపుడు అది కారణం, వచ్చాయన్నపుడు ఇది కార్యం. ఆ కారణాన్ని చూడాలంటే ఈ కార్యం నుంచి వేరుచేసి ఆ కారణాన్ని చూపవలసి ఉంది. అందు కోసమే కళా సృష్టి చెప్పవలసి వచ్చింది. అయితే కళలు పదహారు అని చెప్పటంలో ఏమిటి ఉపపత్తి అని అడగవచ్చు. ప్రాణం దగ్గర నుంచి నామం వరకూ ఈ ప్రపంచం ఒక వరుసలో వచ్చింది. ఆ వరుసకు ఒక హేతువు ఉంది. ఒక దాని తరువాత ఒకటి అవరోహణ క్రమంలో రావటం వల్ల మొత్తం ప్రపంచాన్ని చెప్పినట్లు అవుతుంది. అది కూడా మరలా ఆరోహణ మార్గంలో మనం సాధన చేయటానికి తోడ్పుతుంది.

14. జ్ఞాన, జ్ఞేయాలు రెండూ ఒప్పుకొన్నప్పుడుఅది దైతం ఎలా అయింది?
జ. జ్ఞానమనేది రెండు విధాలు. 99 వృత్తిజ్ఞానాలు. అలాటి జ్ఞానానికి జ్ఞేయం అన్యంగా, విజాతీయంగానే ఉంటుంది. జ్ఞేయం జ్ఞానంగా మారదు. కనుక అది ద్వైతమే గాని అద్వైత మనిపించుకోదు. అసలు జ్ఞానంలో నుంచే జ్ఞేయ ప్రపంచం వచ్చింది. రావటం వాస్తవంగానైతే, రెండూ వాస్తవమే గనుక అద్వైత మెప్పటికీ కాదు. మరి ఎప్పుడు అది అద్వైతం. జ్ఞేయం వచ్చినట్టు భాసిస్తే అప్పుడది వాస్తవం కాదు. ఆభాస. ఆభాస అంటే జ్ఞేయమనేది ఒకటి ఉండి భాసించటం కాదు. ఉన్నది జ్ఞానమే. అదే జ్ఞానంగా ఉంటూ, జ్ఞేయంగా కూడా కన్పిస్తుంటుంది. బంగారం, బంగారంగా ఉంటూనే నగలుగా కన్పించినట్టు. అక్కడ రెండు లేవు. బంగారం ఒకటి, నగలు ఒకటి రెండు వస్తువులు గావు. వస్తువు ఒక్కటే. అది బంగారమే. నగలైనా బంగారమే. అలాగే జ్ఞానమైనా జ్ఞానమే, జ్ఞేయమైనా జ్ఞానమే. దీనికే విభూతి అని పేరు. విభూతి వస్తువుకు సజాతీయం. విజాతీయం కాదు. కనుక చెప్పుకోవటానికి ద్వైతమైనా, అనుభవంలో అద్వైతమే.

15. వస్తువుకూ, ఆభాసకూ ఏమిటి సంబధం. ఆత్మ అనాత్మలలో ఏది వస్తువు. ఏది ఆభస. రెండూ సజాతీయమే అయినప్పుడు వస్తువును ఆభాసగా ఎందుకు భావించరాదు?
జ. తనపాటికి తాను ఏది ఉండగలదో (స్వతఃప్రమాణం) అది వస్తువు. అదే మరొక రూపంలో కూడా కన్పిస్తుంటే దానికి ఆభాస అని పేరు. ఆత్మ అనాత్మలలో, ఆత్మ వస్తువు. అనాత్మ ఆభాస. ఆత్మ అంటే నేను ఉన్నాననే స్ఫురణ. అనాత్మ అంటే ఆ స్ఫురణలో స్ఫురించే పదార్ధాలు. స్ఫురణ లేకుండా ఏ పదార్ధమూ స్ఫురించదు గాబట్టి స్ఫురణాత్మకమైనది ఆత్మ. అదే వస్తువు. అందులో స్ఫురిస్తున్న అనాత్మ ప్రపంచం దాని ఆభాస. రెండూ ఒకటే అయినా, ఆభాసను వస్తువని భావించాలిగాని, వస్తువును ఆభాస కాదు. ఎందుకంటే వస్తువు ఆభాస అయితే వస్తువు శూన్యమై పోతుంది. అపుడు ఈ ఆభాసకు ఆధారం లేదు. ప్రమాణం అంత కన్నా లేదు. ఇది దేని ఆభాస అని అడిగితే జవాబు లేదు. అంచేత వస్తువు ఎప్పటికి లేకుండా పోగూడదు. మారకూడదు. దాని బదులు ఆభాసే వస్తువులో ప్రవిలాపనం అవ్వాలి. ఆభాస అనాత్మ ప్రపంచం గనుక అది లయమయితే మనకు సమస్య లేదు. అలాగాక వస్తువు ఆభాస అయితే ఆత్మ అనాత్మగా మారుతుంది గనుక అదే మనకు జననమరణాది సమస్యలకు కారణ మవుతుంది.

16. ఆత్మ అనాత్మగా అంటే అకల సకలగా మారటనికి ఏమి కారణం. అది మరలా అకలగా మారాలంటే ఏమిటి మార్గం. అది గురువుగారు ఎలా సూచిస్తారు?
జ. ఉన్నది సర్వవ్యాపకమైన అకలమే. అది శుద్ధచైతన్యం, నిర్వికల్పం. వికల్పం లేదు కనుక అది సకలగా మారటానికి వీలు లేదు. అయినా సకలగా కన్పడటమనేది ప్రస్తుతం మన అనుభవం. దీనికి కారణం అది అకలమనే దృష్టి లేక, దానిని సకలమనే దృష్టితో చూడటమే. దీనికే అవిద్య అని పేరు. మనం చూచినంత మాత్రాన అది సకలగా ఎందుకు కనపడాలి. అలా కనపడే శక్తి దానికి ఉంది. ఉన్నప్పటికి తనపాటికి తాను అలా కనపడదు. జీవుడు చూస్తేనే అలా భాసిస్తుంది. కనుక బాధ్యత జీవుడిదే. ఈ బాధ్యతను గుర్తించి ఈ జీవుడు సకలమైన దృష్టిని వదలివేసి దాని బదులు అకలమైన దృష్టిని అలవరచుకోవాలి. దానికే విద్య అని పేదు. అంటే జ్ఞానం. ఈ జ్ఞానం సకలజ్ఞానం కాదు. సకలజ్ఞానం ఆరోపిత జ్ఞానం. అది అకలజ్ఞానం. అనగా అధిష్టానజ్ఞానం. అది సామాన్యం గనుక అందులో ఈ సకలజ్ఞానం కూడా కలసి పోతుంది. మనమిప్పుడు వస్తుతః దృగ్రూపులమై కూడా దృశ్యమైన శరీరమనఃప్రాణాదులనే మన స్వరూపంగా అభిమానిస్తూ జీవిస్తున్నాము. అలాగే దృశ్యమైన కళత్రపుత్రాదులను, వస్తువాహనాదులను ఈ దృష్టితోనే అభిమానిస్తున్నాము. ఇది దృశ్యదృశ్యములు రెండూ పెట్టుకొన్న సంబంధం. దీనికి గురూపదేశం అవసరం లేదు. ఇది మనకు సహజమే. దీనివల్ల మరణ సమస్య మనకు తప్పదు. అది అతిక్రమించాలంటే దృశ్యమైన నేను దృక్కుగా మారాలి. ఆ దృష్టితో దృశ్యమైన బాహ్య ప్రపంచాన్ని సద్రూపంగా చూడాలి. ఈ దృక్కు కేవలం చిత్ అయితే, అది కేవలం సత్. అపుడు ఆ రెండూ అదృశ్యమైతాయి. సమస్య తప్పుతుంది. అది ఎలాగ సాధించడమని మధన పడరాదు. ఈ దృశ్యమున్న చోటనే అదృశ్యరూపంగా అవి రెండూ సమానాధికరణమై ఉన్నవి. దూరంగా లేవు. వాటిని అందివ్వటానికి ఈ దృశ్యములు రెండే తోడ్పడతాయి. ఎటువచ్చీ తదాకారంగా దానిని మార్చుకొని చూడగలిగి ఉండాలి. ఇక్కడ మారినది చిత్, అక్కడ మారినది సత్. క్రొత్తగా మారటం కాదు మరలా. మారే ఉన్నవి. కాని మారిన మనకు అధిష్ఠానరూపంగా ఇపుడు కూడా ఉంటూనే ఉన్నవి. దానినే మనం ఆరోపితంగా చూస్తున్నాము. అపుడది ప్రత్యక్కుగా గాక పరాక్కై కన్పిస్తుంది. మరలా ఈ ఆరోపితం వెనుక నున్న అధిష్ఠానాన్ని గుర్తిస్తే ఈ పరాక్కు ప్రత్యక్కై దర్శనమిస్తుంది. ఇదే గురూపదేశం వల్ల సాధకులమైన మనం గ్రహించ వలసిన విషయం.

ఓం తత్ సత్