#


Back

పంచ భ్రమలు - వాటి నివృత్తి

భ్రమః పంచవిధో భాతి - స ఏ వేహ సముచ్యతే

జీవేశ్వరౌ భిన్నరూపా - వితి ప్రాధమికో భ్రమ:

ఆత్మ నిష్ఠం కర్తృ గుణం - వాస్తవం వా ద్వితీయకః

శరీరత్రయ సంయుక్తో - జీవస్సంగీ తృతీయకః

జగత్కారణ రూపస్య - వికారిత్వం చతుర్ధకః

కారణాద్భిన్న జగతః - సత్యత్వం పంచమో భ్రమః

పంచ భ్రమ నివృత్తిశ్చ - తదా స్ఫురతి చేతసి

బింబ ప్రతిబింబ దర్శనేన భేద భ్రమో నివృత్తః

స్ఫటిక లోహిత దర్శనేన పారమార్ధిక కర్తృత్వ భ్రమో నివృత్తః

ఘట మఠాకాశ దర్శనేన సంగీతి భ్రమో నివృత్తః

కనక రుచక దర్శనేన వికారిత్వ భ్రమో నివృత్తః

రజ్జు సర్ప దర్శనేన జగతః సత్యత్వ భ్రమో నివృత్తః

తదా ప్రభృతి మచ్చిత్తం - బ్రహ్మాకార మభూత్ స్వయం

నిదాఘ త్వమపీ త్థం హి - తత్త్వజ్ఞాన మవాప్నుహి

ఇది అన్నపూర్ణోపనిషత్తులో ఒకానొక సన్నివేశం. ఆష్టోత్తర శతోపనిషత్తులలోఅన్నపూర్ణోపనిషత్తనేది ఒకటి. అన్ని ఉపనిషత్తులలో మాదిరే ఇందులో కూడా విషయమొక్కటే. జీవ జగత్తులని ప్రవిలయం చేసుకోవటం ద్వారా ఏకైకమైన బ్రహ్మతత్త్వాన్నిఅనుభవానికి తెచ్చుకోవటం. అదే ఒక్కొక్క ఉపనిషత్తు మనకొక్కొక్కమార్గంలో బోధిస్తుంది. అందులో ఈ అన్నపూర్ణోపనిషత్తు బోధ మార్గమేమిటో చూతాము.

ఋభుడని ఒక గొప్ప బ్రహ్మవేత్త ఉండేవాడు. ఆయన దగ్గరకు నిదాఘుడనే మహర్షి వచ్చి నాకు బ్రహ్మవిద్య ఉపదేశించమని కోరుతాడు. అతడు యోగ్యుడని గుర్తించి ఋభుడాయనకు చాలా సులభమైన మార్గంలో ఇలా బోధ చేసాడు. నిదాఘా! బోధ అనేదెప్పుడూ మానవుడి కొక సమస్య అనేది ఉంటేనే జరుగుతుంది. మానవులందరికీ ఉన్న సమస్య ఒక్కటే. అది అనాది సిద్ధమైన అవిద్య లేదా భ్రమ. భ్రమ అంటే ఉన్నదొకటైతే దాన్ని మరొకలాగా భావించటం. ఇలాంటి భ్రాన్తి వల్లనే మనకీ సంసారబాధలన్నీ వచ్చి నెత్తినపడ్డాయి.

కాబట్టి బాధలన్నీ తొలగిపోవాలంటే మానవుడీ భ్రమ అనేదాన్ని తొలగించుకోవాలి. ఈ భ్రమ ఒకటి కాదు. ఆలోచిస్తే ఇది ఐదు శాఖలుగా గోచరిస్తుంది. ఐదు తలకాయల శిఖండి ఇది. ఈ ఐదింటిని రూపుమాపాలంటే ఐదు ఉపాయాలున్నాయి. ఆ ఐదు భ్రమ లేమిటో వాటిని పోగొట్టుకొనే ఈ ఉపాయాలేమిటో నీకు బోధ చేస్తాను సావధానంగా వినమన్నాడు ఋభుడు.

బుభుడు చేసాడానే నెపంతో నిజానికి మనకు బోధిస్తున్న దుపనిషత్తు. ఋభునిదాఘ సంవాదమనేది ఒక అర్ధవాదం. పరమార్ధాన్ని మానవులకు బోధ చేయటానికి శాస్త్రం కొన్ని కధలనూ పాత్రలనూ ఆలంబనంగా చేసుకొంటుంది ఈ ఆలంబనాలకే అర్ధవాదాలని పేరు. దీని ద్వారా మనబోటి మానవులకున్న సమస్య ఏమిటో - అది ఎన్ని విధాలో - వాటి నేయే పద్ధతులలో మనం పరిష్కరించుకోవాలో - సలహా ఇవ్వటమే ఇప్పుడుపనిషత్తు చేసే పని.

పోతే ఈ సలహా ఇవ్వటంలో కూడా ఈ ఉపనిషత్తు దీర్ఘమైన చర్చలూ హేతువాదాలూ పెంచుతూ పోలేదు. నలుగురికీ అందుబాటులో ఉండే చక్కని దృష్టాంతాల ద్వారానే అన్ని సమస్యలకూ పరిష్కారాలు సూచిస్తుంది. దృష్టాశ్చ అదృష్ట సిధ్ధిః అన్నారు భగవత్పాదులు. కనిపించిన దాన్ని బట్టే కనిపించని రహస్యాన్ని మనమెప్పుడూ భేదించవలసి ఉంది. లేకుంటే రెండూ మనకతీతమై ఎప్పటికీ మనకది దుర్భేద్యంగానే ఉండి పోతుంది. అంచేతనే శాస్త్రంలో ఎన్ని వాదోపవాదాలు సాగించినా చివరకు హేతువుతో పాటు దృష్టాంతాన్ని అవస్యంగా ఇవ్వవలసి వచ్చింది. ఇలాంటి దృష్టాంత బలంతోనే సాగుతున్నదిపుడీ ఉపనిషద్బోధ అంతా. ఐదు భ్రమలేమిటో చెప్పి ఐదింటినీ తొలగించుకోవటానికి క్రమంగా ఐదు ప్రసిధ్ధమైన దృష్టాంతాలిస్తుంది ఉపనిషత్తు. ఈ ఐదు దృష్టాంతాలనూ వాటి ద్వారా దార్ష్టాంతికాలతో సమన్వయించి చక్కగా మననం చేసిన సాధకుడి కవస్యంగా నిదిధ్యాసన సిద్ధిస్తుందనటంలోసందేహం లేదు.

ప్రస్తుతమా పంచభ్రమలేమిటో చూతాము. భ్రమః పంచ విధో భాతి - ఐదు భ్రమలున్నాయి మానవులకు. స ఏ వేహ సముచ్యతే - అవే మేమిక్కడ సంగ్రహించి చెబుతున్నాము. జీవేశ్వరౌ భిన్న రూపావితి ప్రాధమికో భ్రమః - జీవుడూ ఈశ్వరుడూ అని రెండు తత్త్వాలున్నాయి. ఒకటి మనకభవసిధ్ధం. మరొకటి మన అనుభవంలో లేనిది. లేకున్నా ఉన్నదనే విశ్వసించి తీరాలి మనం. అది మూఢ విశ్వాసం కావచ్చు కదా అంటే కాదు. ఎంచేతనంటే ఎంతో పరిమితమైన జ్ఞానమూ, శక్తి కలవాడీ జీవుడు. వీడి చుట్టూ పరచినట్టెంతో విశాలంగా వ్యాపించి ఉన్నదీ ప్రపంచం. ఈ రెండూ ఎలా సృష్టి అయినాయి. జడమైన జగత్తూ చేయలేదు. అల్పజ్ఞుడైన జీవుడూ చేయలేడు. కాబట్టి వీటి అస్తిత్వం కోసమైనా ఈశ్వరుడనే తత్త్వాన్ని మనమొప్పుకొనక తప్పదు. వాడు జగత్తులాగే అచేతనుడు కారాదు. అలాగని జీవుడిలాగా అల్పజ్ఞుడూ కారాదు. సర్వజ్ఞుడై ఉండాలి. అలాంటప్పుడల్పజ్ఞుడైన జీవుడూ సర్వజ్ఞుడైన ఈశ్వరుడూ ఒకటెలా అవుతారు. ఇద్దరూ భిన్నరూపులే కావలసి ఉంటుందని మనకు కలిగే మొట్ట మొదటి భ్రమ.

దీనికి పరిహారం చెబుతున్నదుపనిషత్తు. బింబ ప్రతిబింబ దర్శనేన భేద భ్రమో నివృత్తః - బింబ ప్రతిబింబ దృష్టాంతం మనసుకు తెచ్చుకొంటే జీవేశ్వర భేదం తొలగిపోతుందట. బింబ ప్రతిబింబాలేమిటో మనకందరికీ తెలుసు. అద్దంలో మన నీడ కన్పిస్తున్నది. మనం బింబమైతే అది ప్రతిబింబం. ఇప్పుడీ ప్రతిబింబమనేది ఉందా లేదా. కనిపిస్తున్నా నిజంగా లేదది. అది మన శరీరం కంటే భిన్నంగా ఎక్కడ ఉంది. వాస్తవానికి అక్కడ ఉన్నది మన శరీరమే. అదే అద్దమనే ఉపాధి మూలంగా అలా భాసిస్తున్నది. అలాగే ఈశ్వరతత్త్వమే ఉన్నది వాస్తవానికి. జీవుడనే మరొక పదార్ధం లేదు. అది అద్దంలో ప్రతిబింబం లాంటిది. శరీర మనఃప్రాణాదులనే ఉపాధుల సంపర్కం మూలంగా ఈశ్వరుడే అనేక జీవరూపాలుగా భాసిస్తున్నాడు. ఇది ఒట్టి ఆభాసేనని గ్రహిస్తే చాలు. బింబప్రతిబింబాలకు భేదం లేనట్లే జీవేశ్వరులకు కూడా భేదం లేదని తేట పడుతుంది.

ఆత్మనిష్ఠం కర్తృగుణం - వాస్తవం వా ద్వితీయకః - ఇది రెండవ భ్రమ. కర్తృత్వమనే గుణం జీవుడికి సహజంగా లేదు. నిజంలో అతడు నిస్సంగుడు. కేవలం శరీరాద్యుపాధుల మూలంగానే కర్తృత్వ భోక్తృత్వాలనే గుణాలు నిర్గుణుడైన జీవుడి మీద ఆరోపించబడుతున్నాయి. అవి ఆరోపితమని తెలియక యదార్థంగానే జీవుడికా గుణాలున్నాయని భావించటమొక భ్రాంతి.

ఈ భ్రాంతి తొలగాలంటే స్ఫటిక లోహిత దర్శనేన పారమార్ధిక కర్తృత్వ భ్రమోనివృత్తః - స్ఫటిక లోహిత దృష్టాంతాన్ని పరిశీలించాలి మనం. లోహితమంటే ఎఱ్ఱని పదార్ధం. ఏదైనా ఎఱ్ఱని వస్తువు - ఒక మంకేన పువ్వొ దాసాని పువ్వో - తెచ్చి ఒక స్ఫటికానికి దగ్గరగా పెట్టామనుకోండి. అప్పుడేమవుతుంది. ఆ మంకేనకుండే ఎఱ్ఱని రంగు స్ఫటికానికి సంక్రమించి అది కూడా ఎఱ్ఱగా మారి కనిపిస్తుంది. అలా కనిపించిందంటే ఆ ఎఱ్ఱ రంగు నిజంగానే ఆ స్ఫటికానికుందంటారా? స్ఫటికానికి జహజంగా ఉన్న రంగు ఎరుపు కాదు. తెల్లని తెలుపు. అది మనకందరికీ తెలిసినదే. అయితే ఎఱ్ఱగా ఎందుకు కనిపించటం. ఎఱ్ఱని పదార్ధం ప్రక్కన ఉండటం వల్ల తన్మూలంగా అది కూడా ఎఱ్ఱనిదని భ్రాంతి పడుతున్నాము.

అలాగే ప్రస్తుతమీ జీవుడికే గుణమూ లేదు. స్ఫటికంలాగాస్వచ్ఛమైన చైతన్యమే అతని స్వరూపం. అలాంటి దానికి మనఃప్రాణాదులనే ఉపాధులు చుట్టూ చేరాయి. చేరేసరికి వాటికున్న కర్తృత్వాది గుణాలు పుష్ప గుణాలు స్ఫటికంలో లాగా జీవుడిలో ప్రవేశించాయి. తన్నిమిత్తంగా ఇతడికి కర్త భోక్త అనే పేరు వచ్చింది. అలా భాసిస్తున్నా అది అకర్తే అభోక్తే. స్ఫటికమెలా తెల్లగానే ఉందో అలాగే అది గుణసాంగత్యం లేకుండా నిస్సంగంగానే నిలిచి ఉంది.

పోతే ఇక మూడవ భ్రమ. శరీరత్రయ సంయుక్తో - జీవస్సంగీ తృతీయకః - శరీర త్రయమంటే స్ధూల సూక్ష్మ కారణ శరీరాలు. ఇందులో స్ధూలశరీరమే మనకు తెలుసు. ఇది గాక సూక్ష్మమూ కారణమూ అని రెండు శరీరాలున్నాయి. అయితే అవి దీనిలాగా కరచరణాద్యవయవాలతో ప్రత్యక్షంగా కనిపించేవి కావు. మన శరీరంలో ఉండే ప్రాణమూ మనస్సే సూక్ష్మశరీరం. అలాగే చలనాత్మకమైన ఈ మనఃప్రాణాలకు కూడా అతీతంగా ఉండి తరుచుగా మన కనుభవానికి వచ్చే ఒక అయోమయావస్ధ కారణ శరీరం. ఏమీ తోచటం లేదు నాకని ప్రతివాడూ పేర్కొంటాడు. ఆ ఏమీ తోచని స్తబ్ధతే అది. సుషుప్తి మూర్ఛాదులలో దర్శనమిస్తుంది. కాబట్టి శరీరత్రయమనేది శాస్త్రం చెప్పటమే కాదు మన అనుభవంలోనే కనిపిస్తుంది.

పోతే మన అనుభవంలో ఉన్న ఈ శరీరత్రయానికీ మన స్వరూపమైన జీవుడికీ ఏమిటి సంబంధం? ఏమీ లేదు వాస్తవానికి. జీవుడంటే శుద్ద చైతన్యం. శరీరమనేది జడం. జడానికి తానున్నానే ప్రజ్ఞ లేదు. కాబట్టి దాని అస్తిత్వానికొక సాక్షి కావాలి. ఆ సాక్షి చేతనుడైన జీవుడే. అలాంటప్పుడు జీవుడు జడమైన శరీరమెలా అవుతాడు. ఆతడు సాక్షి . ఇది సాక్ష్యం. సాక్ష్యమైన పదార్ధం సాక్షి కానేరదు. సాక్షి అయినది సాక్ష్యం కాజాలదు. ఒకదానితో ఒకటి కలసి ఉన్నా ఒకటి కాలేవు. దేనిపాటికదే. తిలలూ బియ్యమూ కలగాపులగం చేసినా తిలలు తిలలే బియ్యం బియ్యమే. అలాగే జీవుడీ శరీరంతో పెనవేసుకొని ఉన్నట్టు కనిపించినా శరీర సాంగత్యం వాస్తవానికి లేదు. లేకున్నా ఉందనుకోవటం భ్రాంతి. ఘటమఠాకాశ దర్శనేన సంగీతి భ్రమో నివృత్తః ఒక విశాలమైన మఠంలో ఒక ఘటముంది. అవి రెండూ తప్ప అక్కడ మరేవి లేవు. లేవంటే వస్తు సామగ్రి లేదనే గాని కావలసినంత ఖాళీ ఉంది. ఖాళీకే ఆకాశమని పేరు. అది మఠంలో ఉంది. ఘటంలోనూ ఉంది. రెండింటి మేరకే అది పరిమితమైన దానిలా కనిపిస్తుంది. అవి రెండూ దాన్ని తమ గుప్పిట్లో పెట్టుకొన్నట్టు భాసిస్తుంది. కాని అది యధార్థం కాదు గదా. ఆకాశమనేది ఒక అమూర్తమైన పదార్ధం. అమూర్తమైనదెపుడూ వ్యాపిస్తుంది. వ్యాపకమైన పదార్ధాన్ని ఎక్కడో ఒక మూలపడి ఉన్న ఘటాది పదార్ధాలు తమలో ఎలాఇముడ్చుకోగలవు. మీదు మిక్కిలి ఇవే దానిలో ఇమిడి ఉంటాయి. అలా ఉన్నా ఒకటి నిరాకారం మరొకటి సాకారం గనుక రెంటికీ సంసర్గమేర్పడటం కల్ల. ఏర్పడిందనుకోవటం మన భ్రాంతి.

అలాగే ప్రస్తుతమీ ఆత్మ అనేది శుధ్ధ చైతన్యం. చైతన్యాని కాకాశంలాగా రూపంలేదు. కనుక సర్వవ్యాపకం. శరీరమో అది స్ధూలమే కావచ్చు. సూక్ష్మమే కావచ్చు. అలా వ్యాపకం కావు. మనః ప్రాణాలు కూడా స్ధూలాన్నిఅంటి పెట్టుకొనే ఉంటాయి. ఆఖరుకు ఆవరణ రూపమైన కారణ శరీరం కూడా స్వప్రకాశం కాదు గనుక అదీ పరిచ్ఛిన్నమే. కాబట్టి చైతన్యానికీ శరీరాలకూ ఎలాంటిపొత్తూ కలగపోదు. కలిగినట్టు చేసినట్టు మన భ్రమే. ఘట మఠాదులున్నాసరే వాటి వెలుపలా లోపలా సర్వత్ర వ్యాపించినట్టు ఆకాశాన్ని ఎలా దర్శిస్తామో అలాగే శరీరత్రయమనేది త్రిపురాసురలలాగా ఆవరించి ఉన్నా మన ఆత్మ చైతన్య మాకాశంలాగా అండ పిండ బ్రహ్మాండాలన్నింటినీ వ్యాపించి అంతటా ప్రసరిస్తున్నట్టు దర్శించాలి మనం.

ఇక్కడికి పంచ భ్రమలలో మూడు భ్రమలూ వాటి నివారణలు నిరూపించాము. ఈ మూడూ జీవుడికి సంబంధించిన భ్రమలు. పోతే ఇక మిగతా రెండూ జగత్తుకు చెందినవి. జీవజగత్తులు రెండూ ఈశ్వరుడికి వేరని భావించటమే గదా వచ్చిన ఇబ్బంది. అలా భావించకుండా అంతా ఈశ్వర తత్త్వమే - అది నా స్వరూపమేనని దర్శించటమే సకల సమస్యలకూ నివృత్తి. ఇందులో జీవుడి తాలూకు సమస్యలూ వాటి నివృత్తి జరిగిపోయింది. పోతే ప్రస్తుతం జగత్తుకు చెందిన సమస్యలూ వాటి నివృత్తి జరగవలసి ఉంది. అందులో మొదటిది అంటే పెద్ద వరసలో నాలగవది జగత్కారణ రూపస్య వికారిత్వం చతుర్ధకః జగత్తుకంతా కారణం ఈశ్వరుడని పేర్కొన్నామింతకుముందు. ఈశ్వరుడు కారణమైతే జగత్తు దానికి కార్యమవుతుంది. రెంటికీ కార్యకారణ సంబంధమెపుడు చెప్పామో అప్పుడొక చిక్కు వస్తుంది. కారణమనేది మార్పు చెందితే గాని కార్యంగా పరణమించలేదు. ఒక ఘటమే ఉంది. ఘటమనేసరికది మృత్తిక నుంచి రావలసిందే. అలా వచ్చిందంటే అర్ధమేమిటి. మృత్తిక అనేది అలాగే రావటానికి లేదు. తన రూపం మార్చుకొని ఒక లావుపాటి గుండ్రని పదార్ధంగా తయారు కావాలి. అయితేనే దాన్ని మనం ఘటమని పేర్కొనగలుగుతున్నాము. అప్పుడూ ఇప్పుడూ మృత్తుకే అయితే ఇక కార్యకారణ సంబంధమనే మాటకర్ధం ఏముంది. కాబట్టి కార్యమనేదొకటి ఏర్పడాలంటే కారణద్రవ్యం మార్పుచెందవలసిందే. ఈ మార్పుకే వికారమని పేరు.

ప్రస్తుతం చైతన్య స్వరూపుడైన ఈశ్వరుడే జగత్కారణమని వాదించినపుడా ఈశ్వరుడు కూడా ఒక మృత్తిక లాగా వికారిత్వానికి గురికావలసిందే కదా అని అంటే అది కూడా ఒక భ్రాంతే నని చాటుతున్నది ఈ మాట. దీనికి కనకరుచక దర్శనేన వికారిత్వ భ్రమో నివృత్తః అని దృష్టాంతంతో నివృత్తి చేసింది ఉపనిషత్తు. కనకమంటే బంగారం. రుచకమంటే దానితో తయారైన ఒక పాత్ర. ఇప్పుడా పాత్ర కార్యమనుకొంటే బంగారం దానికి కారణం. కార్యం తయారు కావాలంటే కారణ ద్రవ్యం మారాలని కదా వాదిస్తున్నావు. మంచిదే. మారటమంటే ఏమని అర్ధం. అంతకుమున్న రూపం నష్టమయి దానిస్ధానంలో మరి ఒక రూపం రావటమే కదా. ఇప్పుడు నష్టమయిపోయిందేమిటి. క్రొత్తగా వచ్చిందేమిటి. అప్పుడున్న బంగారమే ఇప్పుడూ ఉంది. ఆభరణం తయారయ్యేసరికది కనబడకుండా పోవటం లేదు. దాని మోతాదు దాని తూకం అప్పుడూ ఇప్పుడూ సమానమే. అలాంటప్పుడు మారిందేమిటి. అయితే ముద్దగానో కడ్డీగానో ఉన్న బంగారమిప్పుడు గిన్నె ఆకారంగా మారలేదా అదే వికారత్వమని వాదించవచ్చు. గిన్నె ఆకారంలో కూడా ఉన్నది బంగారమే. దానిలో ప్రతి అణువూ బంగారమే. పాత్ర అంతా బంగారమే. అయినప్పుడిక పాత్ర అనేదెక్కడ ఉంది. వాస్తవానికది ఒక పాత్ర అని పేరే గాని సువర్ణ ఆభాసే అది. సువర్ణమే ఆ రూపంలో అలా భాసిస్తున్నది. అది దాని తాలూకు విశేషమేగాని మరి ఒక పదార్ధమేదో అక్కడ ఉందని కాదు. ఇలాంటి విశేషమూ లేదా ఆభాసకే శాస్త్రంలో వివర్తమని పేరు.

ప్రస్తుత మిలాంటి వివర్తమే ఈ జగత్తు కూడా. బంగారంలాగా శుద్ధమైన చైతన్యమే ఇలా నామరూపాత్మకమైన ప్రపంచంలాగా భాసిస్తున్నది. వన నదీ పర్వతాదులూ . జరాయుజాది శరీరాలూ అన్నీ సువర్ణాభరణాలలాగా చైతన్యంతో నిర్మితమైన పదార్ధాలే. నిర్మితమంటే అది ఒక వికారమని పరిణామమనీ మరలా భ్రాంతి పడరాదు. ఎప్పుడూ ఉన్న ఒకే ఒక ఈశ్వర చైతన్యమే తన రూపంలోనూ జగద్రూపంలోనూ కూడా భాసిస్తున్నదని గుర్తించి దీన్ని కూడా ఈశ్వర రూపంగానే మనమెప్పుడూ దర్శిస్తూ పోవాలని భావం.

పోతే ఇక కడపటి భ్రమ ఒక్కటే ఒకటుంది. అది ఈ జగత్తంతా వాస్తవంగానే ఉందనే భ్రమ. కారణాద్భిన్న జగతః సత్యత్వం పంచమో భ్రమః - కారణమంటే సమస్త ప్రపంచానికీ మూలమైన పదార్ధం. ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడనేదొక్కటే సత్యమని చెబుతూ వచ్చాము. దానితో పాటు ఈ ప్రపంచం కూడా సత్యమేమోనని భ్రాంతి. ఇది లౌకికులకే కాదు. శాస్త్రజ్ఞులకు కూడా చాలామందికున్న భ్రమ. వీరి వాదమేమంటే జగత్తనేది ఈశ్వరకార్యమనికదా పేర్కొన్నారు మీరు. కారణమైన ఈశ్వరుడు సత్యమైనప్పుడు తత్కార్యమైన జగత్తు మాత్రం సత్యం ఎందుకు కాదు. కారణ గుణాలే కార్యంలోనూ ప్రవేశిస్తాయనేది సర్వ సమ్మతం. మృత్తికలో ఉండే శ్యామత్వం ఘటంలో కనిపించటంలేదా. సువర్ణంలో ఉన్న పసిమీ మిసిమీ తజ్జన్యమైన ఆభరణాలలో గోచరించటం లేదా. అలాగే ఈశ్వర లక్షణమైన సత్వమే ప్రపంచంలోనూ ఉండవచ్చుకదా. అలాంటప్పుడు కనిపించే ప్రపంచాన్ని అసత్యమని తోసిపుచ్చటం దేనికి.

రజ్జు సర్ప దర్శనేన సత్యత్వ భ్రమో నివృత్తః - దీనికి పరిహారమే రజ్జు సర్ప దృష్టాంతం. మనం చీకట్లో నడచిపోతుంటే దారిలో తెల్లగా పొడవుగా వంకరగా గాలికి కదులుతూ ఒక వస్తువు కనిపిస్తుంది. అదాటుగా చూచి అది ఏపామోనని భయపడతాము. నిజానికది పాము కాదు. ఒక తెల్లని నూలు పగ్గం. పగ్గాన్ని చూచి పామని భ్రాంతి పడ్డాము. పగ్గంలో ఉండే గుణాలు కొన్ని పాములో కూడా ఉండటమే. అందుకే దీన్ని చూచేసరికది జ్ఞాపకం వచ్చింది. అలా వచ్చినా అది వాస్తవమైన సర్పం కాదు. వాస్తవమైన సర్పం అక్కడ లేదు. ఎక్కడో దూరంగా పుట్టలో ఉంది. ఇక్కడ ఉన్నది త్రాడే. తాడైనా అదే పామైనా అదే. అయితే తాడు గానే అది సత్యం. పాముగా అయితే సత్యం కాదు. అనృతం. అనృతమెలా అవుతుందని ప్రశ్నే లేదు. ఎండమావులలో పుష్కలంగా నీళ్ళు కనిపిస్తుంటాయి. ఆకాశంలో చూచినంత దూరం నల్లని వర్ణం కనిపిస్తూనే ఉంటుంది. అంత మాత్రాన ఆ నీళ్ళుగాని ఆ నైల్యంగాని వాస్తవ మనలేము కదా.

అలాగే ప్రస్తుత మీ ప్రపంచమంతా పైకీ క్రిందికీ ప్రక్కలకూ ఎంతగానో విస్తరించి కనిపించవచ్చు. మన లోపలా వెలుపలా కూడా కమ్ముకొని మనల నుక్కిరి బిక్కిరి చేయవచ్చు. ఎంత దాడి చేస్తున్నా ఇది అసత్కల్పమే. ప్రతి దినమూ స్వప్నంలో మనమెన్నెన్నో దృశ్యాలు కళ్ళకు కట్టినట్టు చూస్తూంటాము. అయితే అందులో ఏ ఒక్కటీ సత్యం కాదు. తెల్లవారే సరికి ఎక్కడివక్కడ పొగమంచులాగా విరిసిపోతాయి. విరిసిపోకుండా నిలిచేది వాటి కాధారమైన మనజ్ఞానమే. ఆ జ్ఞానంలో నుంచి ముందుకు దూసుకువచ్చి మరలా ఆ జ్ఞానంలోకే దూసుకుపోతుంది స్వప్న జగత్తు. అంటే ఆరోపితమనేది అధిష్ఠానికి వేరుగా ఉండబోదు. ఎందుకంటే అధిష్ఠానమే మన అజ్ఞాన వశత్తు ఆరోపితంగా మారి కనిపిస్తుంది. అప్పుడా రెండవదానికిక అస్తిత్వం లేదు. ప్రస్తుత మీ ప్రపంచం కూడా ఏదోగాదు. ఇలాంటి ఒక ఆరోపితమే. అంటే ఎక్కడినుంచొ వచ్చి ఆరోపించబడినది కాదు అర్ధం. దాని కధిష్ఠానమైన ఏ ఈశ్వరచైతన్యముందో అదే అనాది సిద్ధమైన అజ్ఞానదోషంవల్ల ఇలా ప్రపంచ రూపంగా భాసిస్తున్నది. మరలా ఇది అదేనని ఎప్పుడు గ్రహిస్తామో అప్పుడు ఇది అభావమై పోతుంది. అప్పుడే దు. ఆ మాటకు వస్తే ఇప్పుడూ ఇది అబద్ధమేనని చాటుతుంది శాస్త్రం. చైతన్యరూపంగానే ఇది సత్యం గాని దానికి బాహ్యంగా చూస్తే మాత్రం అసత్యమే. బాహ్యంగానే కదా చూస్తున్నాము మనమిప్పుడు. కనుక రజ్జుసర్పంలాగా అక్షరాలా ఇది అసత్యమేనని సిద్ధాంతం. దీనితో ఐదవ భ్రమ కూడా తొలగిపోయింది.

ఈవిధంగా మొదటి మూడింటి వల్లా జీవ భేద భ్రమా - చివరి రెండింటి వల్లా జగద్భేద భ్రమా - నివృత్తి కావటం మూలాన జీవజగదభిన్నమైన సచ్చిద్రూపమైన ఆత్మాకార మైన కేవల బ్రహ్మ తత్త్వమొక్కటే ఏకైక సత్యమని అనుభవానికి వస్తుంది. ఇలాంటి కేవల పరోక్ష రూపమైన అనుభవాన్ని ఋభు నిదాఘ సంవాదమనే నెపంతో మనకు ప్రసాదిస్తున్నదీ ఉపనిషత్తు. మనం మన జీవితాలన్నీ దానికి భాజనం చేసుకోగలిగితే చాలు. మానవజన్మ ఎత్తినందుకు దాన్ని చరితార్ధం చేసుకోగలుగుతాము.

ఓం తత్ సత్

***