#


Back

మహావాక్య విచారణ

వేదాంతంలో - ముఖ్యంగా అద్వైత వేదాంతంలో - నాలుగు మహావాక్యాల తాత్పర్యమేమిటో నిష్కర్షగా తెలుసుకోవటం చాలా ముఖ్యం. మహావాక్యమంటే అఖండార్థ బోధకమైన వాక్యమంటారు శాస్త్రజ్ఞులు. అఖండార్థ మేమిటి. జీవుడూ బ్రహ్మమూ ఇవి రెండూ ఒకదానికొకటి వేరు గావు. రెండూ కలసి ఒకేఒక తత్వమని గ్రహించడం. దాని మూలంగా జీవుడికి సంసార బంధమనే సమస్య తొలగిపోతుంది. కేవలం గ్రహిస్తేనే తొలగిపోతుందా అని అడుగుతారేమో. గ్రహించడమంటే మనసులో దానికి సంబంధించిన వృత్తి ఏర్పడటం. అందులో జీవుడూ జగత్తూ ఈశ్వరుడనే ముద్ర పడకుండా వాటి అస్తిత్వం మాత్రమే భాసిస్తుంది. అది నిరాకారం. వ్యాపకం. దాన్ని మన జ్ఞానం పట్టుకుంటే ఇదీ నిరాకారమూ వ్యాపకమే అవుతుంది. అది సత్తయితే ఇది చిత్తని అద్వైతుల పరిభాష. అప్పుడు రెండూ కలిసి ఏకంగా అనుభవానికి రాక తప్పదు. కనుకనే అఖండమైన ఈ జ్ఞానమే పరిష్కారమంటారు అద్వైతులు.

ఇంతకూ ఆ మహావాక్యాలేమిటి. వాటి అర్థాలేమిటి. నాలుగింటికీ నాలుగర్థాలా. నాలుగర్థాలు చెప్పుకుంటే అది అఖండార్థమెలా అవుతుందని ప్రశ్న. అవి ఏవో గావు.ఒకటి అయమాత్మా బ్రహ్మ . రెండు ప్రజ్ఞానం బ్రహ్మ . మూడు తత్వమసి . నాలుగు అహం బ్రహ్మాస్మి . వీటిలో మొదటి దానికి జీవుడు బ్రహ్మమేనని అర్థం. రెండవదానికా బ్రహ్మం కేవలం జ్ఞానస్వరూపమని అర్థం. మూడవ దానికి నీవా బ్రహ్మమేనని అర్థం. నాలుగవ దానికి నేనా బ్రహ్మమే మరేదీ గాదని అర్థం. ఇలా నాలుగూ నాలుగర్థాలు చెబుతున్నట్టు కనిపిస్తున్నా - అన్నిటికీ కలిసి ఒకే ఒక అర్థం. అది ఎలాగాంటే బ్రహ్మమనేది కేవల జ్ఞానస్వరూపం. అందులో జ్ఞాత అయిన జీవుడూ జ్ఞేయమైన జగత్తూ - ఈ రెండు కొసలూ లయమయ్యాయి కాబట్టి ఆ జ్ఞాన మఖండం. కనుకనే దాన్ని ప్రజ్ఞానమన్నారు. జీవజగత్తులనే రెండు ఖండాలూ వాస్తవం కావని చెప్పటమే - అయమాత్మా బ్రహ్మ అనే వాక్యమొకటి - తత్వమసి అనే వాక్యమరొకటీ - ఈ రెండింటి తాత్పర్యం. అయమత్మా అంటే ఈ కనిపించే జీవుడు బ్రహ్మ ఆ బ్రహ్మమేనని చెప్పటం వల్ల జీవభావం లేదని తెలుస్తున్నది. మరి తత్వమసి కూడా అదే గదా అంటే అది ఒక పెద్ద వాక్యంలో ముక్క. ఆ వాక్యమేమిటంటే - స య ఏషోణిమా ఐతదాత్మ్య మిదగ్ం సర్వం తత్సత్యం స ఆత్మా తత్వమసి. ఇందులో ఐతదాత్మ్య మిదగ్ం సర్వ మంటే ఈ సమస్త ప్రపంచమూ బ్రహ్మమేనని జగద్భావాన్ని కాదని త్రోసిపుచ్చుతున్నది . ఇలా జీవజగత్తులు రెండూ వాస్తవం కావు వాస్తవమైనది ప్రజ్ఞాన స్వరూపమైన బ్రహ్మమేనని మూడువాక్యాలూ అఖండ బ్రహ్మతత్వాన్ని ఎప్పుడు ప్రతిపాదించాయో అప్పుడా బ్రహ్మం మనకు పరోక్షమా అపరోక్షమా అని ప్రశ్న వచ్చింది. పరోక్షమైతే అది కేవలం సిద్ధాంతమే గాని అనుభవం కాదు గదా. అనుభవానికి రాకుంటే జీవిత సమస్యకు పరిష్కారమే లేదు. అంచేత అహంబ్రహ్మాస్మి - ఆ ప్రజ్ఞాన స్వరూపమైన బ్రహ్మం నాకు దూరంగా ఎక్కడో లేదు - నేనే ఆ ఆత్మ స్వరూపమని నాలుగవ వాక్యం చాటుతున్నది.

కాబట్టి పైకి నాలుగుగా కనిపిస్తున్నా నాలుగు మహావాక్యాలూ కలిసి చెబుతున్నదొకే ఒక అఖండమైన భావం. ద్వైత జగత్తుతో వ్యవహరిస్తున్న మానవుడి బుద్ధి కొక్కసారిగా అద్వైత భావం పట్టుబడటం కష్టం. కాబట్టి మన స్థాయికి దిగివచ్చి శాస్త్రం రెండు వాక్యాలలో క్రమంగా జీవజగత్తులు వాస్తవమనే అపోహ తొలగించి - మూడవ దానిలో వాస్తవమైన బ్రహ్మమెలాంటిదో నిరూపించి - నాలుగవ దానిలో ఆ బ్రహ్మమేదో గాదు - మన ఆత్మ స్వరూపమేననే రహస్యం బయటపెడుతున్నది. శాస్త్రీయమైన భాషలో చెబితే దీని కపవాద సామానాధి కరణ్యమని పేరు. అపవాదమంటే మనం సత్యమని భావిస్తున్న దాన్ని ఇది సత్యం కాదు. అసత్యమని త్రోసిపుచ్చటం. సామానాధికరణ్యమంటే సత్యమైన దేదో దానితో దీన్ని ముడిపెట్టి ఇది వాస్తవంలో అదే సుమా అని మనకు గుర్తుచేయటం. ’అయం సర్పః రజ్జు రేవ- ఈ సర్పం సర్పం కాదు. రజ్జువే సుమా అని మనకు ఎవరైనా గుర్తు చేశారంటే ఏమని అర్ధం. మసక చీకట్లో నీవది సర్పమని భ్రమపడుతున్నావే గాని నీవనుకొన్నట్లది సర్పం కాదు. వాస్తవంలో అది రజ్జువేనని గదా. ఇక్కడ సర్పం కాదని చెప్పటమపవాదం. దానివల్ల సర్పమనే భ్రాంతి తొలగుతుంది. అయితే ఇది ఏమిటనే ప్రశ్న ఇంకా ఉన్నది. దానికి సమాధానమది రజ్జువేనని రజ్జువుతో సామానాధికరణ్యం చేసి చెప్పట్టం. దానితో రజ్జువుకు భిన్నంగా ఏదీ లేదు ఉన్నదొక రజ్జువేనని రజ్జు స్ఫూర్తి కలుగుతుంది మానవుడికి. సర్పమనే సమస్య తొలగిపోతుంది.

అలాగే ప్రస్తుత మీ శరీరమే నేను దీనికి భిన్నంగా నేనెక్కడా లేననే జీవభావమొకటి మనలను బాధిస్తున్నది. తద్వారా ఈ శరీరంలో బందీ అయి దానికి సంబంధించిన జననమరణాలను అనుభవించవలసి వస్తున్నది. ఇలా ఈ శరీరం మేరకే ఉన్నాననే యీ విశేష ఙ్ఞానం వాస్తవం కాదు - వాస్తవంలో నీవు సర్వవ్యాపకమైన సామాన్య ఙ్ఞానమేనని మానవుడి దేహాత్మాభిమానాన్ని అపవదించి ప్రఙ్ఞాన స్వరూపమైన బ్రహ్మమే నీ అసలైన స్వరూపమని దానితో జీవుణ్ణి ఏకం చేసి చూపుతుంది వాక్యం. దీనివల్ల పరిచ్ఛిన్నమైన జీవభావం తొలగిపోయి పరిపూర్ణమైన బ్రహ్మభావం కలుగుతుంది మనకు. అయినా జగత్తనే భావమొకటి ఇంకా వేధిస్తూనే ఉంది గదా అది ఎలా తొలగుతుందని అడిగితే ఐతదాత్మ్య మిదగ్ం సర్వమని చెప్పి తత్వమసి వాక్యం దాన్ని కూడా అపవాదం చేసి ఆ బ్రహ్మంతో నన్నూ నిన్నూ కలిపి ఏకం చేసి అఖండమైన స్ఫూర్తినిస్తుంది. అంతేగాక తత్సత్యం స ఆత్మా అని ఆ బ్రహ్మాన్ని అపరోక్షంగా స్వరూపమేననే పూర్ణానుభవాన్ని ప్రసాదిస్తున్నది. అహం బ్రహ్మాస్మి అనే ఆఖరి వాక్యంలో అలాటి పూర్ణానుభవం ఈ అపవాద సామానాధి కరణ్యం ద్వారా కలిగి తీరుతుందని అద్వైతుల హామీ.

ఇదంతా మనసులో పెట్టుకొనే భగవత్పాదులు తన సూత్రభాష్యంలో -వాక్యార్ధ విచారణా ధ్యవసాన నిర్వృత్తాహి బ్రహ్మావగతిః - అని సెలవిచ్చారు. వాక్యార్ధమంటే ఈ నాలుగు మహావాక్యాల అర్థం - ఆ నాలుగింటి అర్థాన్ని మనం బాగా విచారణ చేయాలట. అలా విచారణ చేసే కొద్దీ జీవజగత్తులు రెండు వాస్తవంగా ఉన్నాయనే ఖండఙ్ఞానం తొలగిపోయి అఖండ ఙ్ఞానమైన బ్రహ్మమే మన స్వరూపమనే అధ్యవసాన మంటే నిశ్చయ ఙ్ఞానం కలిగి తీరుతుంది. కలిగితే దానివల్ల నిర్వృత్తాహి బ్రహ్మావగతిః బ్రహ్మానుభవం మనకు సిద్ధించినట్టే. దానికిక ప్రయత్నమేదీ లేదంటారాయన. ఎటువచ్చీ ఆ సర్వవ్యాపకమైన బ్రహ్మం నేనేనని నిశ్చయ మేర్పడాలి మనస్సుకు. దీనికే బ్రహ్మాకార వృత్తి అని పేరు. బ్రహ్మమెలా ఉందో అలాగే తయారవుతుందీ వృత్తి కూడా. అది నిరాకారం వ్యాపకమైనట్టే ఇదీ నిరాకారమూ వ్యాపకమూ కావాలి. వ్యాప్తి అనేది మూడు విధాలు. ఒకటి అంతర్వాప్తి. రెండు బహిర్వ్యాప్తి. మూడు స్వరూప వ్యాప్తి. అప్పుడే అది పరిపూర్ణం. సువర్ణాభరణ దృష్టాంతమే తీసుకుని చూడండి తెలిసిపోతుంది. బంగార మాభరణం పైభాగమెలా వ్యాపించిందో కొట్టి చూస్తే దాని లోపలా అదే వ్యాపించి ఉంటుంది. అంతేకాదు. దాని స్వరూపం ప్రతి అణువూ బంగారంతోనే నిండిపోయింది. అలాంటప్పుడిక ఆభరణానికి చోటేది. లేదు వాస్తవంలో. లేకుంటే మరి ఎలా కనిపిస్తున్నదా ఆభరణం. బంగారమే బంగారంగా ఉంటూ ఆభరణాలుగా కూడా భాసిస్తున్నది. అప్పటికున్నదొకే ఒక పదార్ధం. అది బంగారం. బంగారంగా అది స్వరూపం. ఆభరణాలుగా అది దాని విభూతి.

అలాగే ప్రస్తుత మీ ఆత్మ చైతన్యం కూడా చైతన్యంగా స్వరూపం. అదే జీవజగదీశ్వరులుగా విభూతి. కాకపోయినా జీవుణ్ణి బట్టి జగత్తూ జగత్తును బట్టి జీవుడూ - ఈ రెండింటినీ బట్టి ఈశ్వరుడూ. బీజావృక్షన్యాయంగా ఒకదాని మీద ఒకటి ఆధారపడి బతికే ఇవి వాస్తవమెలా అవుతాయి. అక్కడ బీజ వృక్షాలు రెండూ వాస్తవం గాక రెంటికీ ఆధారమైన నేల ఎలా వాస్తవమో దాని విభూతే ఈ బీజ వృక్షాలో - తద్రూపంగానే ఇవి సత్యమో - అలాగే ఇక్కడ జీవజగదీశ్వరులు కూడా స్వతహాగా వాస్తవం కావు. బ్రహ్మం గానే వాస్తవం. వాస్తవమైన మన ఆత్మ మన అఙ్ఞానవసాత్తూ ఈ జీవజగదీశ్వరులనే అనాత్మ రూపంగా భాసిస్తున్నది. మరలా అఖండార్థ బోధకమైన ఈ మహావాక్యాలను శ్రవణం చేసి వాటి అర్థాన్ని మననం చేసి అఖండమైన మన ఆత్మ స్వరూపాన్నే సర్వత్రా చూడగలిగితే - అప్పుడఖండమూ సర్వవ్యాపకమైన మన చైతన్యమే మన స్వరూపంగానూ ఈ జీవ జగదీశ్వరులనే అనాత్మ భావమంతా మన విభూతిగానూ దర్శనమిస్తాయి. దానికి తోడ్పడేవే ఈ మహావాక్యాలు. వీటి ద్వారా అలాటి సర్వాత్మా భావాన్ని స్వానుభవానికి తెచ్చుకోటమే అన్ని సమస్యలకూ పరిష్కారం. అదే మానవ జీవితానికంతటికీ పరమార్ధం కూడా.

***