#


Back

జననం - మరణం

మానవుడు పుట్టినప్పటి నుంచీ అతనికి ఎదురైన సమస్య ఇదే. అప్పటి నుంచి ఇప్పటి దాకా ఆలోచిస్తునే ఉన్నాడు దీన్ని. ఆలోచించేవాడీ సృష్టిలో ఒక్క మానవుడే. మనసున్న వాడు గదా మానవుడంటే. మనసుకుండే లక్షణం ఆలోచించటమే. ఎన్నో ఆలోచించాడు. అన్వేషించాడు. పరిష్కరించాడు మానవుడు. అయితే అన్నీ ఒక ఎత్తు. ఇది ఒక ఎత్తు. ఆలోచనకే అందనిదీ సమస్య. ఉపనిషత్తులే ఏకరువు పెడుతున్నాయి. నచికేతుడనే కుర్రవాడు యమలోకానికి వెళ్ళి యముణ్ణే నిలదీసి అడిగాడట - పుట్టుకేమిటి చావేమిటి చెప్పమని. కఠోపనిషత్తులో చర్చించిన విషయమంతా ఇదే. ఇది చాల దన్నట్టు భారతంలో సనత్సుజాతీయమంతా దీన్నే చిలువలు పలువలు పెట్టి వర్ణించింది. అసలు ఛాందోగ్యంలో, బృహదారణ్యకంలో మృత్యు విచారమెంతో దూరం చర్చించబడింది. ఆ మాటకు వస్తే భగవద్గీత ఈ సమస్యను పరిష్కరించటానికే గదా అవతరించింది.

ఇంతకూ ఎందరెన్ని విధాల విచారిస్తూ వచ్చినా సమస్య సమస్యే ఇప్పటికీ. మానవుడు జన్మించట మేమిటి? మరణించటమేమిటి? జనన మరణాలయినా మనకు కనిపిస్తున్నాయి. చూస్తున్నాము. కాని మరణించిన తరువాత ఏమి జరుగుతున్నదో, మనమేమయి పోతామో అసలే అంతు పట్టటం లేదు. మరి ఇంతేనా ఇది. దీనికి పరిష్కారమే లేదా అంటే నూటికి తొంభై తొమ్మిది మతాలు చేతులెత్తాయి. కాని ఒకే మతం మాత్రమలా కాక ధైర్యంగా ఎదుర్కొని తేల్చివేసిందీ విషయం. అదేదోగాదు. అద్వైత మతం. అద్వైతు లొక్కరే దీన్ని చాలా చమత్కారంగా పరిష్కరించ గలిగారు. వారు చేసిన పరిష్కారమేమంటే ఒక దృష్టిలో ఈ రెండూ ఉన్నాయి. మరొక దృష్టిలో ఏదీ లేదు. మొదటిది భేద దృష్టి. అయితే రెండవది అభేద దృష్టి. ఆత్మ అనాత్మ అని చూస్తే అది భేద దృష్టి, నేననే జ్ఞాన మొకటి - దానికి గోచరించే జ్ఞేయ మొకటి - ఇవే ఆత్మానాత్మలు. నీవు జగత్తను, జీవులను, ఆఖరుకు ఈశ్వరుడను, ఇదంతా జ్ఞానానికి గోచరిస్తున్నదే. కనుక అనాత్మ క్రిందికే వస్తుంది. కాగా వీటన్నిటినీ గమనించే జ్ఞానమే ఆత్మ అంటే.

ఈ ఆత్మానాత్మ భేదం చూస్తున్నంతవరకూ నీవూ ఉన్నావు. నీ సమస్యలూ ఉంటాయి. జననమరణా లేమిటని నీవడుగుతున్నావంటేనే అవి నీ కంటే వేరుగా ఉన్నాయని భావించే అడుగుతున్నావు. భావించావు గనుక వేరుగానే కనపడుతుంటాయి. కనపడేకొద్దీ వాటికి పరిష్కార మేమిటా అని నీ అన్వేషణ. అన్వేషణ చేసే దెప్పుడూ నీ మనస్సే. అది నీ కొకడికే కాదు. ఎంతోమందికుంది. ఒక డూహించినట్టు వేరొక డూహించడు. ఒకడికే ఒకప్పుడున్న ఆలోచన మరొకప్పుడు లేదు. అసలూహించే శక్తి కూడా దానికి పరిమితమే. పరిపూర్ణం కాదు. కనుకనే కొందరు మరణానంతర మేదీ లేదు పొమ్మంటే - కొందరు లోకాంతరాలు, జన్మాంతరాలున్నాయంటే, మరి కొందరు లోకాంతరాలున్నవే గాని జన్మాంతరాలు లేవంటే, కొందరీ మానవుడి కంతకంతకు ఉత్కృష్టమైన జన్మలే వస్తాయి గాని నికృష్టమైనవి రావంటే - అలా కాదు చేసుకొన్న పుణ్యపాపాది కర్మల తారతమ్యాన్ని బట్టి పైకే గాక క్రింది స్ధాయికి కూడా దిగ జార వచ్చునంటే - ఇలా రకరకాల అభిప్రాయాలు వెలిబుచ్చుతున్నారు. మన పురాణేతిహాసాలలో స్వర్గ నరకాది లోకాలను - వాటిని చేరే అర్చిరాది మార్గాలను - ఆయా లోకాలలో కలిగే అనుభవాలను - తదనంతరం మరలా ఈ కర్మ భూమిలో ఏ ఏ జన్మలెత్తాలో అవి - వన్నె చిన్నెలు పెట్టి వర్ణించారంటే అదంతా ఈ భేద దృష్టిని బట్టి చేసిన వర్ణనే. పరిష్కారమే. ఇదే యధార్ధమని భావించామో మన కర్మ కాండ అంతా మన కనివార్యమే అవుతుంది. జాతాశౌచం దగ్గరి నుంచి మృతాశౌచం వరకు అంతా పాటించ వలసిందే. శరీరమే పోతుంది గాని జీవుడు పోడు. వాడీ దేహాన్ని వదిలేసి తన కర్మ కనుగుణమైన లోకాలకు ప్రయాణం కడతాడని - మరలా ఒక దేహం ధరించే లోపు అతనికి మనం చేయవలిసిన క్రతువులన్నీ ఇహంలో చేసితీరాలని - చేస్తే వాటి ఫలితమా జీవికి చెందుతుందని - ఇలాటి అనుష్ఠానమంతా పాటించక తప్పదు.

పోతే భేద దృష్టితో కాక రెండవదైన అభేద దృష్టితోనే చూడగలిగితే ఈ చెప్పుకొన్నదంతా ఏదీలేదు. అంతా వట్టి అబద్ధమని తేలిపోతుంది. కారణమేమంటే ఈ అభేద దృష్టికి అంతా ఆత్మ స్వరూపమే. అనాత్మ ప్రపంచమంటూ దానికి వేరుగా మరొకటి ఏదీ లేదు అంతా నేనని భావిస్తే ఇహ పరాలు లేవు. తోటి జీవులు లేరు. వీటికి నియామకుడని భావించే ఈశ్వరుడు లేడు. ఆత్మ చైతన్యంలోనే అన్నీ సమసి పోతాయి. అలాంటప్పుడుడిక జననమేమిటి, మరణమేమిటి. ఎక్కడ ఉన్నాయవి. అవీ నా స్వరూపమే. ఒక వేళ నాకు చెందిన వనుకున్నాపరవాలేదు. అవి దశలే అవుతాయి గాని నేను గాను. దశలు మారినా దశానాథుడు మారడు. ఇంతెందుకు. ఒక చెరువులో నీరు కదలకుండా నిశ్చలంగా ఉంటుంది. అందులో ఒక రాయి వేశావంటే కదలిక ఏర్పడుతుంది. కొంతసేపు అలాగే ఉండి అది మరలా నిశ్చలమైన స్ధితికి వస్తుంది. ఇప్పుడా నీరు కదలటం కదలక పోవటమనేవి నీటివి కావు. నీటి దశలు. అవి వస్తున్నా పోతున్నా నీటికి హాని లేదు. వాటివల్ల తరిగి పోదది పెరిగి పోదు.

అలాగే ప్రస్తుతమీ జననమరణాలనేవి కూడా జీవుడికి కలిగే దశలే గాని జీవ స్వరూపం కావు. స్వరూపం చైతన్యమే గదా జీవుడికి. అది రాదూ పోదూ. నిత్య సిధ్ధమది. పుట్టినప్పటి నుంచి గిట్టే దాకా అది అలాగే అనుస్యూతంగా వస్తూనే ఉంది. ఎలాటి మార్పూ లేదు. నా శరీరం చలిస్తున్నది. చక్షురాది ఇంద్రియాలు చలిస్తున్నాయి. మనస్సులో భావాలు వస్తూ పోతున్నాయి. కాని వాటి రాకపోకలు నిత్యమూ గమనిస్తూ ఉన్నదా నేననే స్ఫూర్తి. తాను మారకుండా ఈ మార్పులను గుర్తిస్తున్నదది. కనుక జనన మరణాలు వీటికే గాని దానికి లేవు. దీనిని బట్టి రేపు మరణం కూడా ఈ శరీరాది ఉపాధులకే గాని నిరుపాధికమైన నా స్వరూపానికి లేదని అర్ధం చేసుకోవచ్చు. దృష్టాన్ని బట్టే అదృష్టాన్ని నిర్ణయించమని చెప్పారు పెద్దలు. దృష్టం శరీరాదుల రాకపోకలు. వీటిని గమనించే చైతన్యం కూటస్థంగా నిలిచి ఉండడం. అంచేత జననమైనా మరణమైనా నా ఈ కలాపానికే గాని నాకు గాదు. జనన మరణాలంటే చలనమే గదా. చలనమే మార్పు. మార్పులను గమనించే దెలా మారగలదు - మారకుంటే అది ఎలా మరణించగలదు.

అందుకే నిజానికి జననానికి పూర్వమూ ఉన్నాము మనం. మరణానంతరమూ ఉంటాము. నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః - లని చాటుతున్నది భగవద్గీత. లేనిది రాదెప్పుడూ - ఉన్నది పోదూ. మహా అయితే అవ్యక్తం వ్యక్తమయి కనిపిస్తున్నది. వ్యక్తమే మరలా అవ్యక్తమై పోతున్నది. ఆకాశంలో సూర్యమండల మిప్పుడు ప్రకాశిస్తున్నది. అది సాయంకాలమయ్యే సరికి అస్తమిస్తుంది. కంటికి కనపడకుండా పోతున్నది. అది మనం మరణమనుకొంటే ఎలాగా. మనకు కనిపించకున్నా మరొక దేశవాసులకు గోచరిస్తుంటుంది. తెల్లవారితే మరలా మనకే దృగ్గోచరమవుతుంది. అప్పుడది క్రొత్తగా ఉదయించిందనుకొంటే ఎలాగా. ఉదయాస్తమయాలన గూడదు వీటిని. వ్యక్తావ్యక్తాలనాలి. అవ్యక్తంగా ఉందది మొదట. అదే వ్యక్తమయి గోచరించింది. మరలా అవ్యక్తంగా మారిపోతున్నది. మూడు దశలలో ఉండటమేమో ఉంది. ఎప్పుడూ లేకుండా పోలేదు. అయితే ఆద్యంతాలలో కనపడకుండా ఉన్నది. అదే అవ్యక్తం. మధ్యలో కనపడుతూ ఉంది. అదే వ్యక్తం. అవ్యక్తాదీని భూతాని - వ్యక్తమధ్యాని భారత -అవ్యక్త నిధనాన్యేవ - అని భగవద్గీత చాటిన మాటలలోని అంతరార్థమిదే.

ఇదుగో ఈ వ్యక్తావ్యక్తాలనే జనన మరణాలని మనం వ్యవహరిస్తున్నాము. ఒక జీవి జన్మించాడంటే వాడంతకుముందు ఎక్కడా లేక అప్పటికప్పుడు ఆవిర్భవించాడని కాదు. అలాగే మరణించాడంటున్నామంటే ఎక్కడా లేకుండా సర్వనాశనమై పోతున్నాడని కాదు. అంతకు ముందు అసలే లేని ఆ జీవి ఎలా వచ్చాడు. ఉన్నాడప్పుడూ. అయితే అతి సూక్ష్మంగా ఉన్నాడు. అలాగే పోయాడంటే మరలా ఆ సూక్ష్మావస్ధలోనే ఉన్నాడనుకోవాలి మనం అంతేగాని అసలే లేకపోవడం కాదు. జీవాపేతం వావ కిలేదం మ్రియతే - నజీవో మ్రియతే అని ఉపనిషద్వాణి, జీవుడు నిష్క్రమిస్తే శరీరం మరణిస్తున్నదే గాని జీవుదు కాదట మరణించటం.

జీవుడే మరణించడం లేదంటే ఇక ఆత్మ ఎలా మరణించగలదు. మనస్సు ప్రాణమనే ఉపాధులతో చేయి కలిపిన చైతన్యమే జీవుడంటే. చేయి కలిపిన నేరానికవి తొలగిపోతే ఇదీ వాటితో పోవలసి వస్తున్నది. అవి లోకాంతరాలకు వెళ్ళుతుంటే తానూ వెళ్ళవలసి వస్తున్నది. అవి మరలా ఒక స్ధూలశరీరంలో వచ్చి ప్రవేశిస్తే తాను ప్రవేశించ వలసి వస్తున్నది. కారణం వాటి ద్వారా తాను చేసుకొన్న పుణ్యపాపాది కర్మలే. ఒక కర్మ చేసావంటే దానికి ప్రతిఫలం ఉండి తీరుతుంది. అది నేను చేశాను - నా కోసమని చెప్పి దానిని జీవుడు అభిమానించాడు. కాబట్టి తప్పకుండా అది వీడి మెడకు చుట్టుకొంటుంది. అభిమానించిన నేరానికి ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఉపాధిలో చేరి దానినీ మనఃప్రాణాల ద్వారానే అనుభవించి తీరాలి. ఆ అనుభవించటానికి ఈ ఉపాధిలోకి రావడమే జీవుడి జన్మ. చేసిన కర్మలో ప్రారబ్ధం తీరే వరకు అనుభవిస్తూ కూచోటమే జీవనం. అది తీరటమే మరణం. అది తీరినా మరలా సంచిత కర్మ ఫలాన్ని అనుభవించటానికే లోకాంతర గమనం. దానిలో నుంచి మరలా ప్రారబ్ధమైన కర్మ ఫలాన్ని చవిచూడటనికే జన్మాంతరం. ఇలా ఒక విషవలయమిది జీవుడి పాలిటికి.

ఇలాటి జీవుణ్ణి మనస్సులో పెట్టుకొని చెప్పినప్పుడు కూడా జనన మరణాలు లేవు వాస్తవానికి. కర్మ చేయటానికి, ఫల మనుభవించటానికి జీవుడుండ వలసిందే గదా. చేయటానికి శరీరంలో ప్రవేశిస్తాడు. అనుభవించటానికి కొంత కాలమందులో జీవిస్తాడు. అనుభవం తీరగానే మరలా ఒక అనుభవం కోసం ఈ శరీరాన్ని విడిచి వెళ్ళుతాడు. కాబట్టి ప్రవేశించక ముందూ వెనుకా అతడు ఉండక తప్పదు. కాబట్టి జనన మరణాలు అతనికి చెప్పరాదు. అప్పటికి మనం చెప్పుకొనే జనన మరణాలు జీవుడివి గావు జీవుడి ఉపాధివి. అయినా ఉపాధితో తాదాత్మ్యం చెందిన చైతన్యం గనుక ఈ స్ధూల శరీరం పట్టు వదిలినా మరొక సూక్ష్మ శరీరం దానికి తగులుకొని ఉంటుంది. మనః ప్రాణాలే ఈ సూక్ష్మ శరీరం. రక్త మాంస చర్మాస్థి మయమైన స్ధూలం లాగా ఇది కంటికి గోచరం కాదు గనుక దీన్ని సూక్ష్మమన్నారు. జీవుడి అస్తిత్వాన్ని ఇది మనకు పట్టి ఇస్తుంది. కాబట్టి లింగమని కూడా పేర్కొన్నారు. స్ధూలం రేపు పడిపోగానే ఇది బయటికి వస్తుంది. దీనితో పాటు దీని నభిమానించే జీవుడు కూడా బయటికి వస్తాడు.

ఉత్ర్కమణ మంటే ఇదే. మనసు దారి చూపుతుంటే ప్రాణం కదలి పోతుంటుంది. అది జీవుణ్ణి ఆయా లోకాలకు తీసుకెళ్ళుతుంది. కర్మణా పితృలోకః కేవల కర్మాచరణులు ధూమ మార్గంలో పితృలోకం చేరితే, విద్యయా దేవలోకః ఆయా దేవతల నుపాసించిన వారు జ్యోతిర్మార్గంలో ఆయా దేవలోకాలకు చేరుతారు. రెండూ గాక నిషిధ్ధ కర్మలు చేసిన వారైతే సరాసరి యమలోకానికి పోయి రౌరవాది నరకాలనుభవిస్తారు. దేవలోకాలలో వారికి భోగ శరీరమైతే - నరకంలో యాతనా శరీర మొకటి సంక్రమిస్తుంది వారికి. వారికా అనుభవాలన్నీ పూర్తి అయి మరలా జన్మ ఎత్తేవరకూ వారికీ, ఈ కర్మ భూమిలొ ఉండే మనకూ, కానరాని సంబంధ మొకటి ఉంటుంది. అది మనః ప్రాణాల వల్ల ఏర్పడింది. కనుక ఆ వంశంలో వారి రక్తం పంచుకొని పుట్టిన మనమంతా వారికి ఋణపడి ఉన్నాము. మనఃప్రాణాల వల్ల వారికి క్షుత్పిపాస లేర్పడుతాయి కాబట్టి అవి నివారించటానికి పిండప్రదానమూ జల తర్పణమూ చేయవలసి ఉంది మనం. స్ధూలదేహం లేక వాయురూపంగా నగ్నమై ఉంటారు. కాబట్టి వస్త్రదానం కూడా చేయాలని మన భావన.

ఇదంతా ధర్మపురుషార్ధం క్రిందికి వస్తుంది. చైతన్యం మనఃప్రాణాలనే ఉపాధులమేరకే ఉందనేంతవరకు అది ధర్మ క్షేత్రం. ధర్మమంటే పట్టుకొని కూచున్నదని అర్ధం. కర్మ, కర్మఫలం, అనుభవం పట్టుకొనే ఉంటాయి మనలను. అవి ఉన్నంతవరకూ జీవ భావం తప్పదు. జీవ భావం ఉన్నంతవరకూ జనన మరణాలు జీవుడికి చెప్పరాదు. జీవుడే మరణిస్తే లోకాంతరాలకు వెళ్ళవలసిన వాడెవడు. సుఖదుఃఖాలు అనుభవించ వలసిన వాడెవడు. మరలాజన్మించ వలసిన వాడెవడు. యోని మన్యే ప్రపద్యంతే - శరీరత్వాయ దేహినః - స్తాణ్దుమన్యే ప్రపద్యంతే యధా కర్మ యధాశ్రుతం - అని శాస్త్రమే ఘోషిస్తున్నది. కాబట్టి ప్రారబ్ధం తీరగానే శరీరం పోవలిసిందే గాని శరీరధారి అయిన జీవుడు పోడు. ఇది కాకుంటే మరొకటి ధరించి ఉంటాడు. ఏ శరీరమూ లేనప్పుడే జీవ భావం తొలగి పోయేది. శరీరమంటే అది స్ధూలమే గాదు సూక్ష్మం కూడా అని చెప్పాము. స్ధూలం పోయినా సూక్ష్మముంటుంది. సూక్ష్మం కూడా పోవాలంటే దానికి నిమిత్తమైన కారణ శరీరమొకటుంది. అది పోవాలి. అదేదోగాదు మానవుడి అజ్ఞానమే. జ్ఞానం లేకపోవటమే అజ్ఞానం. ఆత్మానాత్మలు రెండూ ఆత్మ స్వరూపమే అని భావించటమే జ్ఞానం. ఇది లేనందువల్లనే ఆత్మ అనాత్మ అనే భేద దృష్టి ఏర్పడింది. అదే జీవభావానికి జననమరణాదులకు దారి తీస్తున్నది.

పోతే ఇప్పుడీ భేద దృష్టికి స్వస్తి చెప్పి అంతా ఆత్మేనని అభేద దృష్టి నలవరుచుకో గలిగితే అది జ్ఞానం. అజ్ఞానావస్ధలో జీవుడికి జనన మరణాలు అన్నీ ఉంటే - జ్ఞానావస్ధలో ఏ ఒక్కటి లేదు. అక్కడ శరీర మనఃప్రాణాలనే ఉపాధులతో సంబంధముంది కాబట్టి వాటి వల్ల కలిగే జనన మరణాదులు కూడా ఉన్నాయి. పరమార్ధంలో కాకపొయినా వ్యావహారింకగా నైనా ఉండి తీరుతాయి. మరి ఇక్కడ ఆ ఉపాధులు కూడా స్వరూపంగానే భాసిస్తాయి. కాబట్టి తన్నిమిత్తమైన జనన మరణాదుల ఊసే లేదు. అవి కూడా ఆత్మ స్వరూపమే. దీనికే అశరీర మమృతమని పేరు పెట్టింది శాస్త్రం. అశరీర మన్నప్పుడిక మరణం లేదు. నతస్య ప్రాణా ఉత్ర్కమంతి. వాడి ప్రాణాలు ఉత్ర్కమణ చెందవు. సముద్రంలో తరంగాలలాగా వాడి చైతన్య సాగరంలోనే అణిగి పోతాయట. మరణ మనేది అందరికీ సంభవిస్తున్నట్టు కనిపిస్తుంది మనకు. అయితే అది ఒక్కొరికి కొక్కొక్క విధం. చివరకు ప్రయాణమనేది అందరికీ సమానమే. ఉపాధి ఉన్నప్పుడు అది పోవలసిందే గదా. అయితే అది ఒక హనుమాన్ జంక్షను లాటిది. నాలుగు దారులున్నాయి అక్కడ.

అందరూ ఒక దారిలో కాక నలుగురూ నాలుగు దారులలో ప్రయణమై పోతారు. అతి నికృష్టంగా బ్రతికి పోయిన వారు యమలోకానికి. సత్కర్మలు చేసిన వారు పితృలోకానికి. ఆయా దేవతోపాసకులు దేవలోకాలకు. పోతే సగుణబ్రహ్మోపాసకులు నేరుగా సత్యలోకానికి. ఈ నాలుగవ వారు మాత్రం వెనక్కు రారు మరలా. బ్రహ్మదేవుడితో పాటు నిర్గుణ జ్ఞానాన్ని అభ్యసించి క్రమంగాముక్తులయిపోతారు. దీన్నే క్రమముక్తి అని పేర్కొంటారు. మిగతా ముగ్గురికి మాత్రం పునరావృత్తి తప్పదు.

పోతే ఈ నలుగురు కాక ఇంకొక రున్నారు. వారే జ్ఞానులు. వారు. తమ ఆత్మ చైతన్యాన్నే సర్వత్రా దర్శిస్తుంటారు. సర్వమూ నేనేనని చూస్తుంటారు. వారికి జీవుడైనా నేనే, జగత్తయినా నేనే, ఈశ్వరుడైనా నేనే - అంతా నేనే - నాదంటూ లేదు వారికి. అలాంటప్పుడు మరణ మేముంది. జనన మేముంది. కదలికనేది ఉంటే గదా అవి రెండూ. కదలికంటే ఒకటి వదిలేసి వేరొకటి పట్టుకోవడం. అంతా స్వరూపమే అయినప్పుడు ఒకటి వదిలేయటమే లేదు. సముద్రంలో తరంగాల లాగా సర్వమూ వారి చైతన్యం లోనే కరిగి పోతాయి. కనుకనే వారి ప్రాణాలు ఉత్ర్కమణ చెందవని చెప్పటం. స్థితే గాని గతి లేదు జ్ఞానుల విషయంలో.

అయితే జ్ఞానులు కూడా నలుగురితో పాటు మరణిస్తారని చెప్పారే. ఆ మాటకర్ధం మేమిటి. అది జాగ్రత్తగా అర్ధం చేసుకోవాలి మనం. మరణించట మనేది వాస్తవమే కాని ఆ మరణించేది జ్ఞాని కాదు. అతని ఉపాధి. ఉపాధి అంటే శరీర మనః ప్రాణ కర్తృత్వ భోక్తృత్వాది సంఘాతం. ఇదెక్కడిది. ఇది ఆ జ్ఞాని చైతన్యం తాలూకు ఆభాస. చైతన్యం వెలుగైతే ఇది ఆ వెలుగు చిమ్మిన నీడ. నీడకు వేరే అస్తిత్వం లేదు. వెలుగు ప్రసరిస్తే అది వెలుగే అయిపోతుంది ప్రసరించనంత వరకే అది దానికి విజాతీయంగా కనిపిస్తుంది. జ్ఞాని జీవితాంతమూ తన చైతన్య జ్యోతినే తన స్వరూపమని భావిస్తూ దానికేది గోచరిస్తున్నా అది ఆ జ్యోతిశ్చక్రంలోఒక కిరణం లాగా దర్శిస్తుంటాడు. కాబట్టి అంతా జ్యోతిస్సే. తమస్సు లేదా దృష్టికి. అంటే ఆత్మే గాని అనాత్మ స్పర్శే లేదని అర్ధం. లోకుల దృష్టికే వాడు, వాడి శరీరమూ వేరుగా కనిపిస్తాయి. వాడి దృష్టికంతా స్వరూపమే. ఇంతెందుకు ఒక మహాసాగరానికి కెదురుగా నిల్చొని చూస్తుంటే ఎలా కనిపిస్తుంది. జలంగానే కాక తరంగాలుగా, బుద్బుదాలుగా, ఫేనంగా, తుషారంగా భిన్న భిన్నంగా గోచరిస్తుంది. కాని అది చూచే మనబోటి వారి దృష్టికే. మరి దాని దృష్టికో. ఇవి ఏవీలేవు. అన్నీ కలసి ఏకంగా జలమే.

ఒక వేళ భిన్నమని చూచినా వాటికి ప్రత్యేకమైన ఉనికి లేదుగదా భయమేమి. మన స్వప్నమే మనకిక్కడ మంచి నిదర్శనం. స్వప్నంలో చిత్రవిచిత్రమైన ప్రపంచం కనిపిస్తుంది మనకు. ఎక్కడ ఉందది. ఏమిటది. ఎక్కడా లేదు. ఏమీ గాదు. అంతా మన స్వరూపమే. స్వరూపమే నని తెలియక చూస్తే, జ్ఞానమే జ్ఞేయమై కనిపిస్తుంది. భిన్నంగా భాసిస్తుంది. సుఖదుఃఖాలను ఆపాదిస్తుంది. అదే తెలిసి చూస్తే జ్ఞేయమంతా జ్ఞానంగా మారి అఖండమైన ఆత్మానుభవాన్ని ప్రసాదిస్తుంది. ప్రస్తుత మీ జనన మరణాది భావాలన్నీ జ్ఞాన దృష్టికి ఒక స్వప్నంలాగా ఆభాస. స్వతంత్రమైన ఉనికి లేదు దానికి. మన ఉనికే దాని ఉనికి. పోతే అజ్ఞాని దృష్టిని దృష్టిని అనుసరించే ధర్మాధర్మాలు లోకాంతరాలు, జన్మాంతరాలు, సుఖదుఃఖాది అనుభవాలు అన్నీ వర్ణించింది. అదే జ్ఞాని దృష్టి ననుసరించి ఏది లేదని మరలా త్రోసి పుచ్చింది. భేధం దృష్టిలో కాని సృష్టిలో లేదు. ఇది చక్కగా గ్రహించి సాధకుడైన వాడు శాస్త్రాచార్య సహాయంతో శ్రవణ మననాదులు చేసి సర్వమూ ఆత్మాకారంగా దర్శించి జనన మరణాలకతీతుడైతే అనాసక్తుడు - ముక్తుడు - ధన్యుడు - త్రిలోక మాన్యుడు కాగలడు.

ఓం తత్సత్

***