#


Back

భక్తి - జ్ఞానం

భగవంతుని సాన్నిధ్యాన్ని చేరటాని కొకటి గాదు చాలా మార్గాలున్నాయని వర్ణిస్తారు. వాటన్నిటిలో భక్తి ఒకటి, జ్ఞాన మొకటి చాలా ప్రశస్తమైనవని కూడా పేర్కొంటారు. అయితే అవి రెండూ దేని పాటి కది స్వతంత్రమైన మార్గాలా లేక ఒకే మార్గంలో వచ్చే రెండు మజిలీలా. మజిలీలే అయిన నాడు ఏది ముందు ఏది వెనుక అని ప్రశ్న వస్తుంది.

దీనికి సమాధాన మివ్వాలంటే అసలు భక్తి అంటే ఏమిటో, జ్ఞానమంటే ఏమిటో ఆ రెండు మాటలకు నిర్వచనం చేయవలసి వస్తుంది. భక్తి అంటే భజించట మని అక్షరార్ధం. దీనికి వ్యతిరిక్తమైనమాట విభజించటం. విభజించట మంటే ఏమిటో తెలుసు మనకు. విడదీయటమని అర్ధం. దీన్ని బట్టి భజించట మంటే అప్పటికి కలుసుకోవటమని అర్ధమవుతున్నది.

ఈ కలుసుకోవసింది ఎవరు ఎవరిని. జీవుడు ఈశ్వరుణ్ణి. జీవుడనే వాడు ఈశ్వరుడిలాగా పరిపూర్ణుడు గాడు. శరీరాదులైన ఉపాధుల మూలంగా పరిచ్చిన్నుడయి కూచొన్నాడు. తన్నిమిత్తంగా సంసార బాధలకు గురై జనన మరణాల ననుభవిస్తున్నాడు. ఈ విష వలయం నుంచి తప్పించుకొని బయట పడాలంటే ఎప్పటికైనా ఏ జన్మకైనా ఆ ఈశ్వరుణ్ణీ భజించక తప్పదు. భజిస్తే అది పరిపూర్ణమైన తత్త్వం కాబట్టి దాని నంటిపెట్టుకొన్న ఈ జీవుడు కూడా భ్రమరకీట న్యాయంగా పరిపూర్ణుడే అవుతాడు. దానితో అపారమైన సంసారసాగరాన్ని ఈది మోక్షతీరాన్నిచేరగలడు.

కాని దీనిలో ఒక షరతున్నది.ఈశ్వరుడంటే ఎవడో ఫలానా అని తెలుసుకోకుండా గ్రుడ్డిగా భజిస్తే మాత్రం ప్రయోజనం లేదు. సింగన్న అద్దంకి పోయివచ్చాడన్న సామెత అవుతుంది. - తెలిసి రామచింతనతో - అని గొంతెత్తి చాటాడు త్యాగరాజు. మనం భజించవలసిన ఆ భగవత్తత్త్వమేదో ఇదమిత్ధమని తెలిసే భజించాలి మనం. లేకుంటే మన ప్రయాణనికొక గమ్యమనేది లేకుండా పోతుంది. మనం మన ఇంటి నుంచి కదలి బయటికి వెళ్ళుతున్నామంటే ఫలానాచోటికి వెళ్ళాలని ముందుగా మనస్సులో అనుకొని గదా బయలుదేరుతాము. దానికే గమ్యమని పేరు. ఇలాంటి గమ్యం ప్రస్తుతం మనకా భగవంతుడే. ఆయన సాన్నిధ్యాన్నేఅందుకోవాలని పయనిస్తున్నాము మనమంతా. దానికే భక్తి అని పేరు పెట్టాము. కాని ఈ భక్తి అనే ప్రయాణ మేగమ్యంవైపు సాగుతున్నదో, గమ్యమైన భగవత్స్వరూపమేమిటో మనసుకు రాకపోతే ఎలాగ. కాబట్టి తప్పకుండా దాన్ని అర్ధం చేసుకోవలసిన బాధ్యత మనకు ఉంది. అర్ధం చేసుకొనే ముందుకు సాగాలి మనం. అదీ షరతు.

ఇదిగో ఇ అర్ధం చేసుకోటానికే జ్ఞానమని వ్యవహారం. జ్ఞానమనేది ఎన్నొవిధాల ఆర్జిస్తుంటాము మనం. లోక జ్ఞానముంది, కళాజ్ఞానముంది, ప్రతి ఒక్క రంగంలోనూ జ్ఞేయమైన విషయమొకటి ఉంటుంది. అది చక్షురాదులైన ఇంద్రియాల ద్వారాగాని సాక్షాత్తుగా గాని మన మనోనేపథ్యం మీద ప్రతిఫలిస్తుంది. అప్పుడు తదాకారమైన వృత్తి ఒకటి మనసులో ఏర్పడుతుంది. దీనినే జ్ఞానమని పేర్కొంటున్నాము మనం. అప్పటికొక జ్ఞానమనేది ఉదయించాలంటే దానికొక జ్ఞేయమైన విషయమూ ఆ విషయానికొక నామమనీ రూపమనీ ఇలాంటి విశేషాలు ఉండి తీరాలని బోధపడుతున్నది.

కాగా ప్రసుత మీ ఈశ్వర తత్త్వాన్ని గ్రహించాలన్నా అది మన జ్ఞానానికి విషయ మవుతుంది. విషయమైతే దానికీ నామరూపాది విశేషాలుండి తీరవలసిందే. కాని ఉపనిషత్తుల దగ్గరి నుంచీ ఘోషించట మేమంటే దానికిలాటి నామరూపాదు లేవీ లేవని. ఎందుకంటే ప్రపంచాని కంతటికి విలక్షణంగా వర్ణించారు దాన్ని. ప్రపంచమనేది నామరూపాత్మకమైనది. ఆది కూడా దీని మాదిరి నామరూపాత్మకమే అయితే ఇక విలక్షణమెలా కాగలదు. కాబట్టి అది సమస్త సంసార ధర్మాలకూ అతీతంగా నిర్గుణమూ నిరంజనమూ అయిన తత్త్వమే కావలసి ఉంది. అయితే అలాంటి ఈశ్వరుణ్ణి మన మనసు తెలుసుకోటమెలాగ, తెలుసుకోపోతే దాన్ని మనం భజించట మెలాగని ప్రశ్న.

దానికేమి రూపం లేకపోయినా కొన్ని అమూర్తమైన భావాలు మనసుకు రావటం లేదా. ఆ మాటకు వస్తే సుఖదుఃఖాది భావాలకొక విశిష్టమైన ఆకారమంటూ లేదు గదా. అయిన నేను సుఖపడుతున్నాను దుఃఖపడుతున్నాను అని జీవులనుభవానికి తెచ్చుకొంటున్నారు గదా. అలాగే నిరాకారమైన ఆ భగవత్తత్త్వాన్ని గూడా దర్శించటాని కభ్యంతర మేముందని జవాబు చెప్పవచ్చు. కానీ సుఖదుఃఖాదుల లాగా అదీ అనుభవానికి వస్తే మనకేమి ఆక్షేపణ లేదు. ఏదీ అలా ఎవరి అనుభవానికీ రావటం లేదు గదా. సుఖదుఃఖాదులన్ననో లోకంలో ప్రతి ఒక్కరి అనుభవానికీ వస్తాయి. ప్రత్యక్ష సిద్ధం కాబట్టి దాన్ని ఎవరూ కాదనలేరు. పోతే ఇలాంటి సార్వజనీనమైన అనుభవం భగవంతుడి విషయంలోనే ఎవరికీ కలగనిది. కలిగేట్టే అయితే ఈ నాడింత మంది హేతువాదులూ, నాస్తికులూ ఇంత పెద్ద సంఖ్యలో మనకు కనిపించేవారు కారు, కాబట్టి మూర్తమైన విషయాల మాదిరేగాక అమూర్తమైన సుఖాది భావాల మాదిరికూడా మనసుకు రావటంలేదది. తద్ జ్ఞానానికే నోచుకోకపోతే, ఇక తద్భజనమనేది మరీ దురాపాస్తం.

మరి దీనికేమిటి పరిష్కారమని ప్రశ్న. ఇది బాగా ఆలోచించే మన పెద్దలు జ్ఞానాని కనంతరంగా కాక దానికి ముందే ప్రవేశపెట్టారు భక్తి అనే దాన్ని. భగవంతుడి స్వరూపాన్ని తెలుసుకొని భజించలేవు కాబట్టి మొదట దాన్ని భజిస్తూ ఉండు తరువాత దాని జ్ఞానం నీకు కలుగుతుందని మనకు సలహా ఇచ్చారు. స్వరూపజ్ఞానం లేకుండా భజిస్తే అది యధార్ధమైన అనుభవమెలా అవుతుందని సందేహించవచ్చు. స్వరూపం కాకపోయినా మన మాయన విభూతిని పట్టుకొంటున్నాము. నామరూపాత్మకమైన ఈ ప్రపంచమంతా ఆయన విభూతే. దీనిలో ప్రతి అణువూ శుద్ధచైతన్య రూపుడైన ఆ పరమాత్మ సృష్టించిందే ఆయన సృష్టి ఆయనకు విజాతీయ మెలా అవుతుంది. సువర్ణ నిర్మితమైన ఆభరణం సువర్ణానికెలా వ్యతిరిక్తం కాదో - మృత్తికాజన్యమైన ఘటశరావాదులు మృత్తిక కెలా వ్యతిరిక్తం కావో - అలాగే చైతన్య వివర్తమైన సమస్త ప్రపంచమూ కూడా ఆ చైతన్యానికి విలక్షణం కాదు.

అయితే ఎంతవరకంటే అది అవ్యక్తమైతే ఇది వ్యక్తం. అది అత్యంత సూక్షమైతే ఇది స్ధూలం. అది నిరాకారమైతే ఇది సాకారం. అది సర్వవ్యాపకమైతే ఇది ఏకదేశ నియంత్రితమై ఎక్కడికక్కడ సవిశేషంగా భాసిస్తుంది. అది భాసించే సరికి ఆ విశేష రూపాలలోనే నిమగ్నమైన వీటి కధిష్ఠానమైన మూల తత్త్వాన్ని విస్మరించారు నూటికి తొంభయి తొమ్మిది మంది. వీరే లౌకికులు. అలా కాక ఇవన్నీ ఆ చైతన్యం దాల్చిన రూపాలే దాని విభూతి శకలాలేనని భావిస్తూ వీటి ద్వారా ఆ తత్త్వాన్ని అందుకోవాలని ప్రయత్నిస్తాడెవడో ఒక మహనీయుడు. వాడే భక్తుడనేవాడు. అయితే వాడి భక్తి సగుణం. ఈశ్వర స్వరూపాన్ని ఉన్నదున్నట్ట్లు భావించటం లేదువాడు. నామరూపాదులను ఆలంబనం చేసుకొని తద్ద్వారా భావిస్తున్నాడు. అవి ఆ పరమాత్మ విభూతే అయినా ఆయన లాగా నిత్యసిద్ధం కావు. ఎప్పటికప్పుడు మారే స్వభావం వాటిది. మారటం మూలాన సర్వ వ్యాపకం కానేరవు. దేనిపాటికి కది వేరువేరయి అంతా కలిపి ఒకటిగా చూడటానికి కవరోధక మవుతాయి.

కాని గ్రుడ్డికన్నా మెల్ల కొంత మేలన్నట్టు దీనిలో ఒక సుగుణమున్నది. అలా లేకపోతే మామూలు మానవుడి దృష్టికి ఒక భాగవతుడి దృష్టికి తేడా లేకుండా పోతుంది. మామూలు వాడు తత్త్వాన్ని మరచి కేవల నామరూపాలు మాత్రమే చూస్తూ వాటితోనే లావాదేవీ పెట్టుకొంటాడు. వాడికీ భౌతిక జగత్తే తప్ప ఈ అనేకత్వంలో అంతర్లీనమైన ఆ ఏకత్వం మనసుకు రాదు. పోతే భక్తుడి విషయ మలాకాదు. అతడీ కనిపించే దంతా భగద్విభూతే నని ఏకమైన ఆ సూత్రాన్ని వదలకుండా దాన్ని పట్టుకోటానికీ నామరూపాదులలో ఏదో ఒకటి ఆధారం చేసుకొని ప్రయాణం సాగిస్తాడు. నామానికి ప్రతీకగా మంత్రాన్ని - రూపానికి ప్రతీకగా విగ్రహాన్ని స్వీకరించి వాటిని తదేక దృష్టితో చూచే మానసిక ప్రయత్న మంతా క్రియకు మారుగా భావిస్తాడు. ఇలా ఈశ్వరసృష్టి అయిన నామరూప క్రియలనే ఈశ్వరతత్త్వాన్ని భజించటాని కాలంబనంగా చేసుకొని పయనించటమే భక్తి.

అయితే ఇది సగుణభక్తి అని పేర్కొన్నాము. యధార్ధమైన జ్ఞానంతో ఏర్పడింది కాదీ భక్తి. అలాంటి జ్ఞాన మేర్పడటానికి సాగించే ఒకానొక అభ్యాసం. అంచేత ఇది జ్ఞానాని కనంతర దశ కాదు. దానికి పూర్వ దశ. సగుణరూపం గనుక ఇందులో ఒక విగ్రహమనీ మంత్రమనీ ఆరాధన అనీ ఇలాంటి కలాపమంతా ఉండక తప్పదు. నామరూపాలనేవి నానా విధాలు కాబట్టి వాటిలో భక్తుడు తనకేది ఇష్టమైతే దానినే అభిమానిస్తాడు. ఆ రూపం వాడికిష్టదైవత మవుతుంది. శైవులకు లింగరూపుడైన శివుడయితే, వైష్ణవులకు శంఖ చక్ర వనమాలాది భూషితుదైన మహావిష్ణువు. ఇలా ఎన్నొ దేవతామూర్తులు. వాటి కనుగుణమైన పంచాక్షర్యాది మంత్రజపాలు. వాటికి సంబంధించి అర్చనాది క్రియాకలాపం. అంతా ఒక పెద్ద ప్రపంచం. మనం లోకంలో మామూలుగా వర్ణించే భక్తి ఇదే. శాస్త్రంలో వర్ణించే భక్తి మార్గం కూడా చాలావరకిదే. అయితే ఇదంతా కూడా జ్ఞానానికి పూర్వరంగమే.

పోతే ఇలాంటి భక్తిమార్గంలో పయనించే కొద్దీ కొంతకాలానికా భక్తుడి కొకవిధమైన చిత్త పరిపాక మేర్పడుతుంది. వ్యష్టిరూపమైన ఈ భావన క్రమంగా అతణ్ణి సమష్టి వైపు తీసుకెళ్ళుతుంది. అది సహజం కూడా. ఎందుకంటే సమష్టి చైతన్యమే అసలు సర్వత్రా ఉన్నది. అదే ఈ వ్యష్టి రూపాన్ని ధరించి మనకు కనిపిస్తున్నది. అంచేత ఈ నదిలో పడి ఈదుతూ పోతే ఎప్పటికైనా ఆ మహాసముద్రాన్ని చేర్చకపోదు. ఎటు వచ్చీ అటు వైపు సాగిపోయే సన్నధ్ధత ఉండాలి మనకు. అంటే ఏ మూర్తి విశేషాన్నిధ్యానిస్తున్నా అది ఈ సమష్టికి ప్రతీకేనని తద్ద్వారా ఆ సమష్టినే భజిస్తున్నాననేభావన ఉండాలి. అలాంటి భావన ఉంటేనే క్షేమం. లేకుంటే తనదే గొప్ప మిగతా వాళ్ళదంతా తక్కువ అనే భేదదృష్టికీ పరస్పర విద్వేషానికీ దారి తీస్తుంది. అప్పుడది భక్తికాదు. భక్త్యాభాస.

ఇలా నిజమైన భక్తి గలిగి వ్యష్టి ద్వారా సమష్టి నెప్పుడు భావిస్తామో అప్పుడు అది బాగా వెంటనే జ్ఞానంగా మారిపోతుంది. కారణమేమంటే సమష్టి మీద కూడ దృష్టి ఉంది వాడికి. సమష్టి అనేది పరిచ్ఛిన్నం కాదు. సర్వవ్యాపకం. వ్యాపకమయ్యే కొద్దీ దానికి నామరూపా లంతకంతకు దూరమవుతాయి. దూరమైతే చివర కాకాశంలాగా అది పూర్తిగా అమూర్తమైన భావన అవుతుంది. అప్పుడు ఒక శివుడా విష్ణువా అని మూర్తిభేదం గాని, పంచాక్షరా అష్టాక్షరా అని నామభేదంగాని, షోడశోపచారక్రియాకలాపంగాని ఉండబోదు. పైగా ఆకాశంలాగా వ్యాపించినా అది జడం గాదు. సాధకుడి భావనతో కూడుకొన్నది. కాబట్టి జ్ఞానస్వరూపం. జ్ఞానమనే సరికి దానికి జ్ఞేయమైన పదార్ధముంటుంది. మరి దీని కలాంటి జ్ఞేయపదార్ధ స్పర్శకూడా లేదు. ఉంటే నామరూపాత్మకమైన జ్ఞేయ ప్రపంచమంతా దానిలో కరిగిపోయి తదాత్మకంగా భాసించవలసిందే. అసలీ ప్రపంచమంతా తద్భిన్నంగా ఎప్పుడూ లేదనే గదా సిధ్ధాంతం. కేవలమూ మన అవిద్యాదోషం వల్లనే కనిపిస్తుందాయె. సమష్టి భావనా బలంతో అవిద్యాగ్రంథి ఎపుడు సడలిపోతుందో అప్పుడీ జ్ఞేయ జగత్తు కూడా జ్ఞానంగానే భాసిస్తుంది. అలా భాసించిన నాడిక మనకు బాహ్యంగా ప్రపంచమూ లేదు. మన ఈ శరీరాది సంఘాతమూ లేదు.

అంతేకాదు. ఈశ్వరుడు కూడా మనకు బాహ్యంగా ఎక్కడో ఉండబోడు. అంటే ప్రపంచంలాగా మన జ్ఞానానికి జ్ఞేయం కావలిసివస్తుంది. జ్ఞేయమైతే నామరూపాది విశేషాలు వచ్చిపడతాయి. అప్పుడా ఈశ్వరుడు కూడా ప్రపంచంలో ఒక భాగమే నని చెప్పవలసివస్తుంది. మరి ప్రపంచానికి విలక్షణుడు కదా ఈశ్వరుడు. ప్రపంచమే ఎలా అవుతాడు. ప్రపంచ మాయన విభూతి కావలసిందే గాని స్వరూపం కానేరదు. స్వరూపం పరిశుద్ధమైన చైతన్యమే. కనుకనే ప్రజ్ఞానమ్ బ్రహ్మ అని వర్ణించిందుపనిషత్తు. ఆ ప్రజ్ఞానం మన మీ ప్రపంచాన్ని చూస్తున్నంత సేపూ పరిచ్ఛిన్నమై మనకతీతంగా ఎక్కడో ఉన్నట్టు కనిపిస్తుంది. మరలా ఇదంతా మన జ్ఞానంలో లయమై జ్ఞానైక రసంగా ఎప్పుడనుభవానికి వచ్చిందో అప్పుడీ జీవచైతన్యాని కుపాధులనే ఆనకట్టలు తెగిపోయి అదే మనకఖండమైన చైతన్యంగా సాక్షాత్కరిస్తుంది. అంటే సర్వత్రా సర్వదా సర్వమూ వ్యాపించి సచ్చిద్రూపంగా నాకు నేను ఉన్నాను - మరేది లేదనే ఒక అద్వితీయాత్మ చైతన్య స్ఫూర్తి ఏర్పడుతుందని అర్థం.

ఇదిగో అలాటి నిష్ప్రపంచ బ్రహ్మాత్మ భావన ఏదైతే ఉన్నదో అదే యధార్ధమైన అద్వైతజ్ఞానం. ఈ జ్ఞాన మావర్భవించటానికి ముందున్న జ్ఞానం కేవల మాభాస రూపమైన జ్ఞానం మాత్రమే. అయితే ఆ ఆభాస జ్ఞానాన్ని పురస్కరించుకొనే భక్తి అనేది ఏర్పడింది. ఆ భక్తి ముదిరి పాకానబడి క్రమంగా ఈ వాస్తవిక జ్ఞాన మవతరించింది. అంచేత ఈ యధార్ధజ్ఞానోదయానికి తోడ్పడిన ఆ భక్తి దీనికి కేవలం పూర్వరూపమేనని చెప్పవలసి ఉంది.

పోతే ఈ జ్ఞానమని పేర్కొంటున్నామే అది కూడా కేవల ముదయించినంత మాత్రాన మరలా సుఖం లేదు. ఉదయించిన తరువాత ఒక మెరుపులాగా మెరసి పోగూడదు. ఎప్పటికీ అలాగే నిలిచి ఉండాలది. దానిపాటికి అది నిలవదు. మనం దాన్ని నిలుపుకోవటానికి మరలా ప్రయత్నం చేస్తూపోవాలి. ఇది కేవల జ్ఞానం గాదు. జ్ఞాననిష్ఠ అంటారు దీన్ని. నిష్ఠ అనగానే ఇది ఆ కలిగిన జ్ఞానం కన్నా భిన్నమైన మరొక ప్రక్రియ అని మరలా భ్రాన్తి పడరాదు. జ్ఞానమే ధారావాహికంగా ప్రవహిస్తూ పొతే అది జ్ఞాననిష్ఠ. కనుకనే జ్ఞానసంతాన కరణమని దీనికొక సార్ధకమైన నామధేయం కల్పించారు భగవత్పాదులు. నిదిధ్యాసనమని కూడా దీనికొక పేరు. విజాతీయ భావానంతరితమైన సజాతీయ భావప్రవాహ మేదున్నదో అది నిదిధ్యాసన. అద్వితీయాత్మ చైతన్యానికి విజాతీయం అనాత్మరూపమైన ఈ నామరూపాలే. చీకటి లాగా ఎప్పుడూ పొంచి ఉంటాయవి. జ్ఞానమనే వెలుగు తగ్గిందంటే మరలా వచ్చి నెత్తినపడతాయి. అపుడది మరలా సంసారమే. అంచేత ప్రపంచస్ధాయికి దిగజారకుండా పోవాలంటే దానినలాగే ఏమరకుండా పట్టుకొని నిలుపుకొంటూ రావాలి.

అంటే లౌకిక వ్యాపారాలకు జలాంజలి ఇవ్వాలని గాదు మరలా. ఆవశ్యకమైన క్రియలు సాగిస్తూ ఉండవలసిందే. ఏ క్రియ సాగించినా అదంతా శుద్ధమైన ఆత్మ చైతన్యంలోకి ఎప్పటికప్పుడు ప్రవిలయం చేసుకొంటూ తన ఏకాత్మ భావాన్ని సడలకుండా చూసుకోవాలని భావం. ప్రహ్లాదాదులైన భాగవతుల జీవిత మిలాటిదే. పానీయాదులు సేవిస్తున్నా - సంభాషణలు సాగిస్తున్నా సంతత నారాయణచింత వదలలేదు వారు. చివర కా అనుసంధాన బలంతో ఈ విశ్వప్రపంచాన్నే విస్మరించేవారట. అంటే విశ్వాన్ని విశ్వమనే దృష్టితో గాక బ్రహ్మమనే భావనతో దర్శించేవారని తాత్పర్యం.

ఇదే నిదిధ్యాసన అన్నా జ్ఞాననిష్ఠ అన్నా. దీనినే భక్తి అని కూడా వ్యవహరించారు మన పెద్దలు. భక్తి అంటే ఇది ఇంతకుముందు వర్ణించిన భక్తిలాంటిది గాదు. అది జ్ఞానానికి పూర్వమైతే ఇది జ్ఞానాని కనంతరం కలిగేది. జ్ఞాన నిష్ఠారూప మైనది. రెంటికీ భక్తి అని పేరు పెట్టటం వల్ల ఇవి రెండూ ఒకటేనని అపోహపడతారు చాలామంది. ఏమీ తెలియని పామరులే కాదు, అన్నీ తెలిసిన పండితులు కూడా. కనుకనే దాని నుంచి దీనిని వేరు చేసి చూపటానికి భగవద్గీత దీనిని పరా భక్తి అని అనన్య భక్తి అనిఏక భక్తి అని విశేషంగా నిర్దేశిస్తుంది. "భక్తిమ్ మయి పరామ్ కృత్వా భక్త్యా త్వనన్యయాఏక భక్తి ర్విశిష్యతే". ఇలాంటి వెన్నో ఉదాహరణలు. దీని కనుగుణంగా భాగవతాది పురాణాలు కూడా ఇరుదెరుగుల భక్తులనూ వారి చరిత్రలనూ వేర్వేరు లక్షణాలతో వర్ణిస్తూపోతాయి. అంబరీషాదుల భక్తి ప్రహ్లాద కుచేలాదుల భక్తి లాంటిది కాదు. వారిది జ్ఞానార్జన కోసం దానికి పూర్వ మభ్యసించిందయితే వీరిది జ్ఞానానంతరం తన్నిష్ఠా రూపమైన భక్తి కనుకనే వారి కున్న ఆచార వ్యవహారనియమాలు వీరికి లేవు. మరి గజేంద్రుడి విషయంలో నైతే ఒక భాగవతుడి పూర్వాపర జీవితాలు రెండూ వర్ణించాడు మహర్షి. ఇంద్రద్యుమ్న జన్మలో జ్ఞాన హితమైన సగుణ భక్తి అయితే గజేంద్రుడి జన్మలో జ్ఞానపూర్వకమైన నిర్గుణ భక్తి. కనుకనే ఇంద్రద్యుమ్నుడు శాపఫల మనుభవిస్తే గజేంద్రుడు మోక్షఫల మను భవించాడు. శాపం సగుణం నుంచి నిర్గుణాన్ని చేరేందుకొక వ్యాజమే.

మొత్తానికి భక్తి మొదట జ్ఞానానికి దారితీస్తే ఆ జ్ఞానం మరలా భక్తి చేత పరిపూర్ణమవుతుంది. భక్తి - జ్ఞానం - భక్తి ఇదీ వరుస. ఇందులో మొదటి భక్తి సగుణం. రెండవది నిర్గుణం. సగుణం నిర్గుణ స్ధాయికి వస్తేనే ముక్తి. అది జ్ఞానం ద్వారానే తప్ప వేరొక మార్గం లేదు. ఇ రహస్యం భాగవతారంభంలోనే గొంతెత్తి చాటాడు మహాకవి. "ఇంచుక మాయలేక మది నెప్పుడు బాయని భక్తితోడ ... వర్తించుచు" మాయ లేకపోవట మంటే అజ్ఞానం తొలిగిపోవటం. అంటే యదార్ధమైన జ్ఞాన ముదయించట మని అర్ధం. అలాంటి జ్ఞాన ముదయిస్తేనే మది నెప్పుడూ పాయని భక్తి ఏర్పడుతుంది. పాయని భక్తి అంటున్నాడు గమనించండి. ఇది అనన్య భక్తి మామూలు భక్తి కాదు. జ్ఞానానంతరమే కలుగుతుందది. అప్పుడు ఒక మదిలోనే గాదు, జీవితంలో కూడా ప్రవేశిస్తుంది. పానీయంబువులు ద్రావుచున్ అన్నట్లు వాక్శరీరాలతో ఏ పని చేస్తున్నా భయం లేదు. వర్తించట మంటే ఇదే. జీవించట మని అర్ధం.

ఇక్కడికి భక్తి ఏమిటో జ్ఞానమేమిటో రెంటికీ ఉన్న సంబంధ మేమిటో మనకు బోధపడింది. భక్తి అయినా - జ్ఞానమైనా -ఏదైనా సరే స్వతంత్రంగా రెండూ మోక్షానికి మార్గాలనే మాట వట్టిమాట. జ్ఞానమనేది ఒక్కటే మోక్షానికి మార్గం. భక్తి కాశక్తి లేదు. ఎందుకంటే అది నామరూపాది గుణాల నాలంబనం చేసుకొన్నది. నామరూపాదుల వాసన ఉన్నంతవరకూ అది సంసారమే, సాయుజ్యం కాదు. పోతే జ్ఞానానికి దోహదం జేసి - ఆ జ్ఞానం క్రమంగా నిష్ఠగా మారి ఆ నిష్ఠారూపమైన భక్తి ఏదున్నదో అది మనకు మోక్షదాయకం. అయితే భక్తి అని పేరే గాని అది సగుణంగాదు. నిర్గుణ రూపమైన జ్ఞానమే. "మోక్షసాధన సామ గ్ర్యామ్ భక్తి రేవ గరీయసీ" - అని అన్నారంటే ఈ దృష్టితో అన్నారు స్వామివారు. ఇది భక్తి జ్ఞాన సమన్వయం.

ఈ సమన్వయ సూత్రాన్ని పట్టుకోలేక చాలామంది పండితులూ, పామరులూ సాధన మార్గంలో చిక్కుపడుతున్నారు. తాము నమ్మిందే మార్గమని అపోహ పడుతున్నారు. ఆధ్యాత్మవిద్య శాస్త్రీయంగా అభ్యసించక పోవటమే దీనికంతటికీ మూలం. కనుకనే "తస్మాచ్ఛాస్త్రమ్ ప్రమాణం తే కార్యాకార్య వ్యవస్థితౌ" అన్నాడు భగవానుడు. సత్యాసత్యాలు తెలుసుకోవటానికి శాస్త్రమే కరదీపిక మనకు. "అశ్శాస్త్ర విధి ముత్సృజ్య వర్తతే కామకారతః సన సిద్ధి మవాప్నోతి" శాస్త్రోక్తమైన మార్గంలో కాక తన ఇచ్ఛానుసారంగా ప్రవర్తిస్తే ఏ మానవుడికీ సిద్ధిలేదు - అని కూడా హెచ్చరించాడు. నిశ్చిత ఫలవద్విజ్ఞానం మనకు శాస్త్రం వల్లనే లభిస్తుందన్నారు భగవత్పాదులు. అంచేత శాస్త్ర ప్రామాణ్యాన్నిబట్టి చూచే వారికి సగుణభక్తి జ్ఞానానికి - జ్ఞాన మనన్య భక్తికీ - అది మోక్షానికి చేర్చే సాధనాలనీ - మూడూ మోక్ష మార్గంలో మూడు మజిలీలనీ - మూడూ ఒకదాని కొకటి సహకరిస్తూ చివరకు ప్రసాదించే సమష్టి ఫలం మోక్షమనీ - స్పష్టంగా బోధపడుతుంది.

ఓం తత్సత్

***