అది ఒక్కటీ సామాన్యం. అంతే కాదు. వినశ్య త్స్వవి నశ్యంతం. ఇవి ఎక్కడికక్కడ ఎప్పటి కప్పుడు తెగిపోతుంటే అది వీటిలాగా తెగేది కాదు. నశించేది గాదు.
అసలు విశేషాలకున్న అవలక్షణమే అది. ఏదో ఉన్నాయి గదా ఉండనీ లెమ్మని ఏమరటానికి వీలు లేదు. ఉన్నంత కాలముంటాయి పోయే కాలం వస్తే ఒక్క క్షణముండవు. మటు మాయమయి పోతాయి. మళ్లీ చూస్తామన్నా కనిపించవు. మన జీవితమే దీనికి నిదర్శనం. బాల్యం నుంచీ చూస్తూనే ఉన్నాము గదా ఈ ప్రపంచాన్ని. దీనితో వ్యవహరిస్తూనే ఉన్నాము గదా. ఎప్పటికీ ఉన్న పదార్ధమేమిటో చెప్పండి. ఎప్పటికప్పుడవి పోతున్నాయి. ఒకవేళ కొన్ని మారకుండా అలాగే ఉన్నట్టు కనిపించినా ఒకచోట చూస్తే మరొక చోట చూడలేము వాటిని. కొంతకాలం గడిస్తే అదే రూపంలో కనిపిస్తాయని కూడా నమ్మకం లేదు. పోతే దృశ్య ప్రపంచం మాట ఇలా ఉంటే దీన్ని దర్శించే మనదృష్టి మాత్రం నిలబడుతున్నదా. అదీ మారిపోతూనే ఉంది. మనసులో భావాలెప్పుడూ మారేవే. జాగ్రద్వృత్తులు స్వప్నంలో లేవు. స్వప్న వృత్తులు సుషుప్తిలో లేవు. రేపు కన్ను మూస్తే ఏదీ లేదు. దృక్కు లేదు. దృశ్యమూ లేదు. అంతా హుళక్కే. ఇదే వినశ్యత్సు అంటే. కనుకనే మానవుడెంతో భయపడాలీ విషయంలో. అన్నీ పోయేవేనే. మనం గూడా పోక తప్పటం లేదే. అలాగే గదా మన పూర్వీకులంతా