బాధ పడుతూ ఇస్తున్నాడు దానమంత మాత్రమే. ఇక్కడ అది కూడా కాదు. ఆదేశకాలే. అపాత్రేభ్యశ్చ. దేశకాలాలూ సరియైనవి కావు. పాత్ర యోగ్యమైనది కాదు. మ్లేచ్ఛులూ శుచీ శుభ్రతా లేని వారు. ప్రదేశం కాలమో. పుణ్య హేతువుగా ప్రఖ్యాతం కానిదీ గ్రహణ సంక్రమణాది విశేషమేమీ లేనిదీ. పోతే ఇక పాత్ర అంటారా. ఏమాత్రమూ చదువూ సంస్కారం లేని మూర్ఖులూ దొంగలూ ఇలాటి వారు. అలాటి వారికి నీవెంత దానం చేసినా అది దుర్వినియోగమే. అపాత్రదానం పనికిరాదు. అయినా చేస్తున్నాడంటే ఆ దాత ఎంత వివేకవంతుడో ఆలోచిచండి. ప్రతిగ్రహీతకు తోడు పోయిన వాడే దాత కూడా.
అంతేకాదు. ఒకవేళ దేశకాల సంపత్తి ఉన్నప్పటికీ అసత్కృత మవజ్ఞాతం – ఏమాత్రమూ గౌరవం లేకుండా అవమానకరంగా ప్రవర్తించి ఇచ్చినా ప్రయోజనం లేదు. మంచి మాటలతో పాదప్రక్షాళనార్చనా దికం చేయకుండా పోతే అది అసత్కృమనీ - పాత్రుడైన వాడిని పరిభవిస్తూ చేస్తే అది అవజ్ఞాత మనీ వ్యాఖ్యానిస్తారు భాష్యకారులు. ఇలాటి పనికి మాలిన దానానికి తామస దానమని పేరు. మరి ఇలాటి రాజస తామసాది యజ్ఞాలు గాని తపస్సులు గాని దానాలు గాని - వాటి సంగతేమిటి. అంతేనా వాటి గతి. వాటిని కూడా దారికి తెచ్చుకొనే ఉపాయమేదైనా ఉందా అని ప్రశ్న వస్తే పరిహారం చెబుతున్నాడిప్పుడు మహర్షి. పనికిరాని