కర్మసన్యాస యోగము
భగవద్గీత
ఇప్పుడు మళ్లీ కొంచెం దారిలోకి వచ్చినట్టు కనిపిస్తున్నాడతని మాటలు వింటుంటే. త్వమక్షరం పరమం వేదితవ్యం. క్షరం కాని దక్షరం. ఎప్పటికీ మార్పులేని తత్త్వం నీవు. గుణాలుంటేనే మార్పు. నిర్గుణమైతే మారదేదీ. నిర్గుణమంటే నామరూప రహితం కావాలది. అలాటిదే విశ్వస్య పరం నిధానం. ఈ విశ్వానికంతా ఆధారం. నిధీయతే అస్మిన్నతి నిధానం. విశ్వమంతా ఎందులో గుప్తమయి ఉందో అది. అంతేకాదు. త్వమవ్యయః శాశ్వత ధర్మగోప్తా - నీకు వ్యయం లేదు. అంటే జననమరణా దులనే ప్రశ్నే లేదు. అంటే గుణాతీతుడైన పరమాత్మవు. అయి కూడా శాశ్వతమైన ప్రవృత్తి నివృత్తి రూపమైన ధర్మ ద్వయాన్ని కాపాడుతున్నావు. సాక్షివయి కూడా కర్తగా కనిపిస్తున్నావు. సనాతన స్త్వం పురుషం అనాది కాలం నుంచీ ఉంటున్న పురుషోత్తముడవు. దీన్ని బట్టి గుణాతీతుడవైన నీవే సగుణమైన ఈశ్వరుడుగా కూడా ప్రపంచస్థితి గతులు చూస్తున్నావని అర్థమవుతున్నది. అప్పటికర్జునుడికి పరమాత్మ సగుణ నిర్గుణ రూపాలు రెండూ తెలుసునను కోవాలా మనం. అనుకోనక్కర లేదు. సగుణమే తెలుసు. నిర్గుణం తెలియదు. నిర్గుణమే తెలిస్తే సగుణమైన రూపాన్ని ఆయన చూపితే చూడాలని చాపల్యం చూపేవాడు కాదు. చూస్తూ చూస్తూ బెదిరిపోయే వాడూ కాదు. అయితే ఎలా అనగలిగాడా మాట. శ్రుత పాండిత్యమది. అనుభవపూర్వకమైన మాటగాదు. మనలో కూడా ఉన్నారిప్పుడెంతో మంది
Page 407