#


Index



జ్ఞాన యోగము భగవద్గీత

తప్పకుండా వర్ణించి చెబుతానా విభూతి ఎలాంటిదో. అయితే ఒక్కమాట. అశేషేణ మిగులు లేకుండా ఉన్న విభూతి అంతా బయట పెట్టమని నీవు నన్నడిగావే గాని అది మాత్ర మెప్పటికీ సాధ్యం కాదు. ఎందుకని. నాస్త్యంతో విస్తరస్యమే. నా విస్తారమూ లేదా విభూతి అనే దానికి అంతమంటూ లేదు. అనంతమది. నేనెలా అనంతమో నా విభూతి కూడా అనంతమే. సాంతమైతే అది పరిపూర్ణం కాదు. సత్యం జ్ఞాన మనంత మన్నట్టు పరమాత్మ చైతన్యమూ అనంతమే. ఆయన శక్తే అనంతమే. సాకారమైతే గదా అది సాంతం కావటానికి. నిరాకారమైన దెప్పుడూ సాంతమనే ప్రశ్నే లేదు. ఆకాశంలాగా అనంతం గానే వ్యాపించి ఉంటుందది. అలాంటప్పు డర్జునుడు నీకున్న విభూతి అంతా బయట పెట్టి చూపమని అడగటం ఎంత చపలమైన ప్రశ్నో అర్థమయిందా. అసలు స్వరూప జ్ఞానం లేకుండా విభూతిని చూద్దా మనుకోటమే తప్పు. అందులో కూడా అది నిశ్శేషంగా చూపమని అడగటం అంతకన్నా తప్పు.

  అది కనిపెట్టే అర్జునుడి అమాయికత్వాన్ని బయటపెడుతూనే మాటాడుతున్నాడు పరమాత్మ. ఏమని. అలా నిశ్శేషంగా నా విభూతిని పేర్కొనట మసంభవ మది ఎంత పేర్కొన్నా ఇంకా పేర్కొన వలసింది ఉంటూనే ఉంటుంది. అనంతమది. పోతే నీవు బలాటపడుతున్నావు కాబట్టి నీకంతా కాకపోయినా కొంతయినా దాన్ని వర్ణించటం నా ధర్మం. అది కూడా ప్రాధాన్యతః ఏది ముఖ్యమో అది మాత్రమే చెబుతా నీకు.

Page 319

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు