సాంఖ్య యోగము
భగవద్గీత
అది ఒక హేతువు కాదు. ఎందుకంటే అవిక్రియమైన ఆత్మకూ జ్ఞానికీ ఏమిటి సంబంధం. ఆత్మ అలాంటిదని గుర్తిస్తున్నాడత డంత మాత్రమే. నహి అవిక్రియం స్థాణుం విదిత వతః కర్మ న సంభవతి. ఇప్పుడు మనమొక స్తంభాన్ని నిశ్చలంగా ఉందని చూస్తున్నా మనుకోండి. అంత మాత్రాన మనం నిశ్చలమైపోతామా. అని ఆక్షేపించి ఆయనే దానికిలా సమాధానమిస్తారు. ఏమని. న విదుషః ఆత్మత్వాత్. నిష్క్రియ మంటున్న ఆత్మ ఏదో గాదు. తానే. స్తంభంలాగా అది పరాయిది గాదు. జ్ఞాని స్వరూపమే ఆత్మఅంటే. ఆత్మాహి నామ స్వరూప మని సూత్ర భాష్యంలో వస్తుందీ వాక్యం. జ్ఞానీ ఆత్మా స్వరూపం అంతా ఒక్కటే.
అంచేత వేదా వినా శినం. ఎవడైతే అవినాశి నిత్యం అజం అవ్యయమని ఆత్మను గుర్తిస్తాడో కధం స పురుషః కంఘాతయతి హంతి కం - వాడెవరినైనా ఎలా చంపగలడు చంపించగలడు - అని ప్రశ్నిస్తున్నది గీత. ఇక్కడ వేద అనే శబ్దం చాలా సార్ధకమైనది. చాలా గంభీరమైనది. వేద అంటే ఊరక తెలుసుకోట మనే గాదు. దర్శించటం అనుభవించట మని కూడా అర్ధమే. అసలదే అర్ధం. సంస్కృతానికి సహోదర లాటిను భాషలో ఇప్పటికీ ఆ క్రియా పదానికి చూడటమనే అర్ధం. Ego Video అంటే నేను చూస్తున్నాని ఆ భాషలో అర్ధం. Audio-Video అనే మాటలీ రోజుల్లో తెలియని వారు లేరు. ఏమిటా మాటల కర్ధం. Audio అంటే నేను వింటున్నానని Video అంటే నేను కంటున్నానని.
Page 94