#


Index

సాంఖ్య యోగము భగవద్గీత

ఇది ఇంకొక ఋఙ్మంత్రం. గీత ఉదాహరిస్తున్నది. ఉభౌతౌన విజానీతః ఇద్దరూ మూఢులే. అసలైన ఆత్మ స్వరూపమేదో తెలియక శరీరా ద్యుపాధులే ఆత్మ అనుకొని ఒకానొక క్రియకు కర్తనని భోక్తనని ఎవడికి వాడు భావిస్తున్నాడని గదా ముందు వర్ణించారు. ప్రస్తుతమా అసలైన ఆత్మ పదార్ధమేమిటి - అది ఎలాంటిది. దానికీ కర్మ కలాపంతో సంపర్క మెలా లేదనే సత్యం బయట పెడుతున్నదీ శ్లోకం.

  నజాయతే మ్రియతే వా కదాచిత్ అది జన్మించదు. మరణించదు. ఏదైనా జన్మించిందంటే అది మరణించి తీరాలి. ఏదైనా మరణిస్తున్న దంటే అది అంతకు ముందు జన్మించి ఉండాలి. జన్మించకనే పోతే మరణించలేదు. మరణించాలంటే జన్మించక తప్పదు. షడ్భావ వికారాలని పరిగణించాడు యాస్కుడనే మహర్షి లోకంలో మనం చూచే ప్రతి పదార్థానికీ ఆరు వికారాలు లేదా మార్పులనేవి అవశ్యంగా ఉండి తీరుతాయి. జాయతే మొదట జన్మించాలది. అస్తి - జన్మించిన తరువాత ఉంటుంది. వర్ధతే - ఉండటం వరకే గాక పెరుగుతూ పోతుంది. విపరిణమతే పెరిగి పెరిగి మారిపోతుంది. అపక్షీయతే - మారుతూ మారుతూ తరిగిపోతుంది. కృశించి పోతుంది. వినశ్యతి - కృశించి చివరకు నశించి మన కంటికి కనపడకుండా పోతుంది.

  ఇప్పుడీ వికారాలనేవి లేని పదార్ధమంటూ లేదు సృష్టిలో. పోతే ఆత్మ చైతన్యమొక్కటే ఇలాంటి వికారాలేవీ లేని పదార్ధం. అది జన్మించదు.

Page 90

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు