సాంఖ్య యోగము
భగవద్గీత
రూపాలే. ఆ శరీరాలే. అవి వస్తూ పోతున్నాయి. అందులోనే ఉండి వాటిని సాక్షిగా చూస్తున్న ఆత్మ మాత్ర మలా రావటం లేదు. పోవటం లేదు. అది శరీరం కాదు. శరీరి - శరీరాన్ని ధరించిందే గాని అది శరీరం కాదు. శరీరమనేది దానికొక తొడుగు. ఒక వేషం. వేషం పోయినా వేషధారి పోడు. వేషాలెన్నైనా ఉంటాయి. వేషధారి ఒక్కడే. నిత్యస్యోక్తాః శరీరిణః వేషధారి ఎప్పుడూ ఉంటాడు. అతని వేషాలే వస్తూపోతూ ఉంటాయి.
అనాశినో ప్రమేయస్య. అయితే చిత్రమేమంటే నశించే శరీరంలో ఉండి కూడా అది నశించకుండా అవినాశిగా నిలిచి ఉండటం. ఈ సందర్భంలో కఠోపనిషత్తు చాటి చెప్పిన మాట చిరస్మరణీయం. అశరీరం శరీరేషు అనవస్థే ష్వవస్థితమ్. అశరీరమైన దొకటి మన శరీరంలో వచ్చి కూచున్నది. ఇది నశించినా అది నశించని పదార్ధం. ఏమి కారణం. అది నిరాకారమూ వ్యాపకమూ కావటమే. వ్యాపకం గనుకనే శరీరం వెలపలే గాక లోపలా ఉండగలదు. లోపల ఉన్నా నిరాకారం గనుక సాకారమైన శరీరం నశించినా అది నశించదు.
మంచిదే కాని నిరాకారమైన పదార్ధమదే గాక ఆకాశం కూడా ఒకటి ఉంది గదా. అది కూడా ఆత్మలాగా అవినాశియేనా అని అడిగితే చెబుతున్నది సమాధానం గీత. అప్రమేయస్య. ప్రమేయం కానిదేదో అది అప్రమేయం. ఆత్మ ఒక్కటే ప్రమేయం కాదు. మిగతా దంతా ప్రమేయమే. ప్రమేయమంటే ప్రమాణానికి విషయమయ్యేది Object గోచరించేది అని
Page 84