#


Index

ఉపోద్ఘాతము (ప్రధమ) భగవద్గీత

ఎంత గొప్ప మాట ఇది. బుద్ధి జీవులని పేరు మానవులకు. అందరికీ బుద్ధి అనే సాధనం దగ్గర ఉన్నా దానికి రజో మాలిన్యం తమో మాలిన్యం దట్టంగా పట్టి ఉంటాయి. అందుకే బ్రహ్మ జ్ఞానం వారికెంత బోధించినా పట్టుపడదు. అంచేత తమో మాలిన్యం క్షాళితం చేయటానికి కర్మయోగమూ రజో మాలిన్యం కడిగి వేయటానికి సమాధి భక్తియోగాలనూ వర్ణించి చెప్పింది. అప్పటికెంత సానుభూతో చూడండి మన మీద భగవానుడికి. ఎంత సార్వ జనీనమో Universal చూడండి భగవద్గీత. పండితులకే కాదు పామరులకూ చూపుతుందది తరణోపాయం. తేపి చాతి తరంత్యేవ నిత్యం శ్రుతి పరాయణాః - పెద్దల నడిగి తెలుసుకోండి. వారి బోధ వినండి. మీరూ జ్ఞానం సంపాదించి బాగుపడతారని పామరులకూ కూడా అభయ మిస్తుంది గీత.

  అంతేగాదు. కర్మగాని సమాధి గాని భక్తిగాని జ్ఞానంగాని ఏదైనా యోగంగా మార్చుకొని చూడండని అది మనకిచ్చే గొప్ప సలహా. అసలైన పరిపూర్ణమైన భగవత్తత్త్వాన్ని పట్టుకోటమే యోగం. యోగమంటే అసలు కలయిక Union అని అర్ధం. జీవేశ్వరైక్యమే అది. దానికి కేవల కర్మ పనికిరాదు. అహంకార మమకారాలు వదలని అనుష్ఠాన రూపమది. కేవల సమాధి పనికిరాదు. అనులోమంగా ఏదీ పట్టుకోక ప్రతిలోమంగా చిత్తవృత్తులను ఖాళీ చేసుకొనే ఉద్యమమది. అలాగే కేవల భక్తి పనికిరాదు. అనులోమంగా ఒక మూర్తిని ధ్యానిస్తూ కూచున్నా అది ఆయా దేవతా మూర్తులే.

Page 8

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు