ఉపోద్ఘాతము (ప్రధమ)
భగవద్గీత
గుర్తిస్తే చాలు. అదే అయిపోతాడీ జీవుడు. కొత్తగా అయిపోవటం కూడా కాదు. అయి ఉన్నాననే సత్యం మరచిపోయి మరలా దాన్ని కంఠచామీకర న్యాయంగా గుర్తు చేసుకోవటమే. దీనికే ప్రత్యభిజ్ఞాన Recognition మని నామకరణం చేశా రద్వైతులు.
కాబట్టి జ్ఞానమొక్కటే సాధనం మోక్షానికి. ఈ రహస్యం లోకానికి చాటి చెప్పటమే భగవద్గీత విశిష్టత. యదౌ జ్ఞాత్వా మోక్ష్యసే అశుభాత్ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం. జ్ఞానం వల్లనే సంసారోప శమనం. సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. సాంసారికమైన తాపాలన్నీ దాటి బయట పడాలంటే జ్ఞానమే శరణ్యం. నహి జ్ఞానేన సదృశం. జ్ఞానంతో సమానమేదీ లేదు. కర్మ భక్తి సమాధు లేవైనా ఉన్నాయని భావించినా అవన్నీ జ్ఞానే పరిసమాప్యతే. జ్ఞానంలోనే కలిసి వస్తాయి. వేరుగా ఆచరించ నక్కర లేదు. ఎందుకంటే జ్ఞానం జ్ఞేయం జ్ఞాన గమ్యం అంతా మన స్వరూపమే. అది కూడా ఎక్కడో లేదు. ఎక్కడబడితే అక్కడే ఉంది. అంతర్బహిశ్చ భూతానా మచరం చరమే వచ. సమస్త పదార్ధాలలో సకల జీవులలో లోపలా వెలపలా మధ్యలో అనే తేడా లేకుండా నిండి నిబిడీకృత మయి ఉంది. అంతే కాదు. ప్రత్యక్షావ గమం ప్రత్యక్షంగా మనకు కనిపిస్తూనే ఉంది. సుసుఖం కర్తుం. దాన్ని అందుకోటం కూడా అతి సులభం. అందుకే మీరు జ్ఞానమే ఒక యజ్ఞ మనుకొని సాధన చేయండి నేను సంతోషిస్తానని జ్ఞాన స్వరూపుడైన పరమాత్మ పదే పదే మనలను హెచ్చరిస్తున్నాడు.
Page 6