#


Index

ఆత్మసంయమ యోగము భగవద్గీత

ఉందో అప్పుడీ యోగ సంస్కారాన్ని అది దెబ్బ తీసి పనిచేయకుండా ఆపేస్తుంది. అయితే ఇక ఇది ఇంతేనా అని సాధకుడు బెంబేలు పడగూడదు. ఎందుకంటే అది తాత్కాలికమే. ఫలానుభవం వరకే. అనుభవించి బాకీ తీర్చుకొంటే చాలు. తత్ క్షయే తు యోగ జ స్సంస్కారః స్వయమేవ కార్యమారభతే. ప్రారబ్ధ కర్మ నశించగానే యోగాభ్యాస సంస్కారం స్వయంగానే రంగంలోకి వచ్చి మరలా ముందుకు సాగిపోతుంది. క్రమంగా ఫలితమిస్తుంది. ఒక్కమాట గుర్తుంచుకోవాలి మనం. న దీర్ఘ కాలస్థ స్యాపి వినాశ స్తస్యాస్తి. ప్రారబ్ధ మనుభవించటంతోనే సరిపోతే అది ఎప్పుడు మరలా బలం పుంజుకొంటుంది. ఆపాటికి అణగారి పోదా అని బెంగపెట్టుకో రాదు. ఎంతకాల మజ్ఞాత వాసం చేసినా యోగాభ్యాస వాసన నష్టమై పోదు. ప్రారబ్ధం తీరగానే పైకి వచ్చి అది చేయవలసిన పని చేస్తుంది. భయం లేదని హామీ ఇస్తారు స్వామివారు. ఇంతకూ ఇది ఒక గొప్ప సన్నివేశం Position. ప్రారబ్ధమా ప్రయత్నమా రెండింటికీ ఎప్పుడూ వైరమే. కాని అది మన భావనేగాని నిజంగా శత్రుత్వం లేదు వాటికి. ఒకటి చేసిన దాని కనుభవ రూపమైతే మరొకటి అనుభవానికి చేసే ప్రయత్న రూపం. ఒకటి గతానికి చెందినదైతే వేరొకటి అనాగతానికి సంబంధించినది. రెండూ కలిసే ఉంటాయి జీవితంలో. ఇదొక చిత్రం. ఎలాగంటే ఇంతకు ముందే చెప్పాము. జీవుడు భోక్తే గాక కర్త కూడా. ఒక పక్క ప్రారబ్ధ మనుభవిస్తుంటాడు. మరొక పక్క ప్రయత్నం చేస్తుంటాడు.

Page 541

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు