#


Index

ఆత్మసంయమ యోగము భగవద్గీత

మనస్సు. అంతే కాదు. ప్రమాధి బలవ దృఢం. మధిస్తుంటుం దెప్పుడూ. పురుగులాగా లోలోపల తొలుస్తుంటుంది. శరీరాన్ని ఇంద్రియాలనూ తన ఇష్టానుసారంగా తిప్పుతూ పరవశం చేస్తుంటుంది. తాను తిరగటమే గాక వాటిని గూడా తిప్పుతుంది తనతోపాటు. బలిష్ఠం కూడా. ఏదీ దాన్ని బంధించలేదు. దుర్నివారం. దృఢమైనది కూడా. ఎంత దృఢమైనదంటే తంతు నాగవత్తన్నారు భాష్యకారులు. తంతు నాగమంటే Shark అని అర్ధం వ్రాశాడు మోనియరు విలియమ్సు. ఒక సొర చేప - ఒక మొసలి మన కాలు పట్టుకొంటే ఎలా విడిపించుకోలేమో కాలు అక్కడికి తెగిపోయి ఊడి వచ్చినా ఆశ్చర్యం లేదో అలాటి దృఢమైన స్వభావం దానికి.

  ఇలాటి మనస్సు నదుపులో పెట్టుకోమంటారు మీరు. అది సాధ్యమా. తస్యాహం నిగ్రహం మన్యే. దాన్ని అరికట్టటం అదుపులో పెట్టటం ఎలాటిదంటే వాయోరివ సుదుష్కరం. గాలిని మూట గట్టటమెంత దుష్కరమో అంత దుష్కరం. గాలి నెవడు మూట గట్టగలడు. కడితే కట్టు పడుతుందా. కడుతుంటేనే పారిపోతుంది. జారిపోతుంది. అలాగే నాకే ఆలోచనా రాగూడదు. ఒక్క పరమాత్మ ఆలోచనే రావాలంటే వింటుందా మాట. ఒక ఆలోచన వదిలేశామను కొంటుండగానే మరో ఆలోచన రెడీగా ఉంటుందక్కడ. అన్ని ఆలోచనలూ అరికట్టటమంటే సముద్ర తరంగాల నాపి వేయటమే. ఇదీ అర్జునుడి భయం. మనకూ కూడా ఇదే భయం.

Page 522

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు