ఆత్మసంయమ యోగము
భగవద్గీత
లోకంతో వ్యవహార ముండక తప్పదు. అలాంటప్పుడు బ్రహ్మ జ్ఞాని ముక్తుడెలా అయ్యాడు. ముక్తుడయి మరలా లోకంతో సంబంధమెలా పెట్టుకొంటాడని పెద్ద సందేహం. దానికిప్పు డిస్తున్నాడు సమాధానం వ్యాసభట్టారకుడు. వినండి. ఇది చాలా అద్భుతమైన శ్లోకం. అద్భుతమైన సమాధానం. అన్ని ప్రశ్నలకూ సమన్వయమిది.
సర్వభూతాలని ఒక మాట ఆత్మ అని మరొక మాట రెండు మాటలు వినిపిస్తున్నాయి మనకిక్కడ. ఇందులో సర్వభూతాలనేవి విశేషం. ఆత్మ అనేది సామాన్యం. అంటే ఏమిటర్ధం. భూతాలంటే అవి చేతనాలు కావచ్చు అచేతనాలు కావచ్చు. మొత్తం సృష్టి అంతా భూతమనే మాటలో కలిసి వచ్చింది.
ఇప్పుడీ జడ చేతనాత్మకమైన భూతాలన్నీ విశేషాలని గదా చెప్పాము. విశేషాలంటే ఏమిటి. ఎక్కడికక్కడ తెగిపోతుంటాయివి. దేనిపాటికదే. ఇది అది గాదు. అది ఇది గాదు. వృక్షం పక్షి గాదు. పక్షి పశువు గాదు. పశువు మనిషి గాదు. అలాగే నది పర్వతం కాదు. పర్వతం పట్టణం కాదు. పృథివి జలం కాదు జలం వాయువు కాదు. వాయువాకాశం కాదు. భూమి చంద్రుడు కాదు. చంద్రుడు సూర్యుడు కాదు. నీ ఇష్టం. ఏదైనా తీసుకొనిచూడు. అన్నీ దేనిపాటికదే. వ్యాపకమేదీ కాదు. వ్యాప్త్యమే ప్రతిదీ. పరిచ్ఛిన్నమే. అదే విశేషమంటే. అన్నిటినీ వ్యాపించే స్తోమత దేనికీ లేదు.
Page 506