#


Index

ఆత్మసంయమ యోగము భగవద్గీత

  మొదట ప్రతిలోమంగా దాన్ని విషయ ప్రపంచం మీది నుంచి మళ్లించాలి. తరువాత అనులోమంగా దాన్ని ఆత్మలోనే నిలుపుకోవాలి. అనాత్మ నుంచి మళ్లించాటానికే వైరాగ్యమని పేరు. ఆత్మలో నిలపటాని కభ్యాసమని పేరు. వైరాగ్యమూ అభ్యాసమూ ఇవి రెండే మార్గాలు మనో జయానికి. అప్పుడే సాధనకు పరిపూర్ణత. ఒక బస్సు ప్రయాణం గుర్తుంచుకొంటే సరిపోతుంది. బస్సు విజయవాడ వదిలేసింది. హైదరాబాదు వైపు వెళ్లుతున్నది. విజయవాడ ఎంతెంత దూరమైతే హైదరాబాదంతంత దగ్గర పడుతుంది. అది ఎంత దగ్గరైతే ఇది అంత దూరమవుతుంది. ప్రయాణం ప్రయాణమే. ఫలితాలు రెండు. అలాగే ఇక్కడా యోగసాధన సాధనే. ఫలితాలు రెండు. అనాత్మ దూరం కావటమొక ఫలితం. ఆత్మ దగ్గర పడట మొక ఫలితం. ఆ దూరం కావటమే వైరాగ్యం. ఈ దగ్గర పడటమే అభ్యాసం. అభ్యాసం లేనిదే ఆత్మ కనపడదు. వైరాగ్యం లేనిదే అనాత్మ కనపడకుండా పోదు. అది ఎలా కనపడకుండా పోవాలో చెబుతున్నారు భాష్యకారులు. యాధాత్మ్య నిరూపణేన ఆభాసీకృత్య. ఇదీ ఆయన మాట. అనాత్మ ప్రపంచమనే దేమిటో దాని స్వరూపం లోతుకు దిగి నిరూపణ Scrutiny చేస్తే చాలు. అదంతా ఆ భాస అయిపోతుంది. ఆ భాస అయినప్పుడిక అభిమానమే ముంటుంది. కనుక వైరాగ్యమే. అప్పుడా భాసీ భూతమైన అనాత్మ ఏమవుతుంది చివరకు. ఆత్మగానే అనుభవానికి వస్తుంది. ఇదం సర్వం యదయమాత్మా అని ఉపనిష ద్వాణి. ఆత్మా ఆత్మే. అనాత్మా ఆత్మే. మాండూక్యం చెప్పిన ఏకాత్మ.

Page 502

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు