#


Index

ఆత్మసంయమ యోగము భగవద్గీత

యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరమ్ |
తతస్తతో నియమ్యైతదాత్మన్యేవ వశం నయేత్ || 26 ||

  అలా ఆత్మ సంస్థంగా మనస్సును చేయాలంటే అది అంత సులభమైన పనిగాదు. మనసంటే ఏమిటో అది ఎలాంటిదో తరువాత చెప్పబోతుంది గీత. పాదరసంలాగా అతి చంచలమది. అస్థిరం. స్థిరత్వమే మాత్రమూ లేదు దానికి. కోతిలాగా చపలమైన స్వభావం దానికి. ఒక్కక్షణం నిలకడగా ఉండబోదు. శబ్ద స్పర్శాదులైన విషయాల మీదికెప్పుడూ పరుగెడుతుంటుంది. అవి అనేకం అనంతం. వాటిని గ్రహించే ఇంద్రియ వ్యాపారాలూ అనేకమూ అనంతమే. మరి తద్వారా పనిచేసే మనసు మాత్రం తక్కువా. ఇంద్రియ వ్యాపారాలంటే అంతకు ముందు మనో వ్యాపారమేగా అది. అంచేత మనోవృత్తులూ అసంఖ్యాకంగా జన్మిస్తూనే ఉంటాయి. సాగర తరంగాల లాంటివవి. అవిచ్ఛిన్నంగా ప్రసరిస్తూనే ఉంటాయి. ఆగమన్నా ఆగవు.

  అంచేత యతో యతో నిశ్చరతి మనః ఎటువైపు నీ మనస్సు పరుగెత్తుతుంటే అటు వైపు పోనీయకుండా దాన్ని నియమ్య నిరోధించటమే సాధకుడి డ్యూటీ. నిగ్రహించటం వరకే గాదు. అది ప్రతిలోమమైతే అనులోమ క్రియ మరొకటుంది. ఆత్మన్యేవ వశం నయేత్ - ఆత్మలోనే దాన్ని కట్టి పడేయాలి - అది అనులోమం ఇలా ఎడా పెడా వాయిస్తే గాని అది నిలకడ చెందదు.

Page 501

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు