#


Index

ఆత్మసంయమ యోగము భగవద్గీత

  ఇప్పుడు నూటికి తొంభయి మంది దాన్ని గాదు పట్టుకోటం. స్ఫురించే విశేషాలను. అవే నామరూపాలు. అందుకే సంసార బంధమయి కూచున్నదది. దానిలో నుంచి బయటపడాలంటే స్ఫురించే నామరూపాలను గాక వాటిలో పరుచుకొని ఉన్న స్ఫురణ అనే అధిష్ఠానాన్ని Basis పట్టుకోవాలి. ఆత్మానం పశ్యన్ననే మాట కర్థ మదీ. అయితే ఎలా పట్టుకోవాలది. ఆత్మనా - ఆత్మతోనే పట్టుకోవాలి. ఆత్మతో నంటే ఆత్మ తాలూకు అభిప్రాయంతో. దాని జ్ఞానంతో. దేన్ని పట్టుకోవాలన్నా దాని జ్ఞానంతోనే గదా పట్టుకొంటాము. అప్పుడే గదా దాని అనుభవం. అలాగే ఆత్మను గూడా ఆత్మ జ్ఞానంతోనే The idea of Atman గ్రహించవలసి ఉంది.

  పోతే ఎక్కడ ఉందని గ్రహించాలి దాన్ని అని ప్రశ్న. ఏదైనా ఒకటి చూడాలన్నా గ్రహించాలన్నా అది ఎక్కడ ఉందో తెలుసుకోవాలి గదా ముందు. ఎక్కడో లేదది. ఎక్కడో ఒకచోట ఉండి కనిపించేది ప్రపంచమూ-అందులో ఇటూ అటూ సంచరిస్తున్న మనబోటి ప్రాణుల శరీరాలూ. అవి గ్రహించాలంటే ఎక్కడ దొరుకుతాయో వాటి చిరునామా తెలుసుకొని వెళ్లి పట్టుకోవలసి ఉంటుంది. ప్రస్తుత మీ ఆత్మ అలాంటిది గాదు. స్ఫురించే పదార్ధం . The Thing to be cognised కాదది స్పురణ Awareness of Their presence. అది ప్రతి పదార్థంలోనూ పరుచుకొని ఉంది. అదే ఆత్మ. కనుక దేశంలో కాలంలో వస్తువులో ఎక్కడో ఒక మూల ఉన్నదిగాదు.

Page 490

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు