#


Index

ఆత్మసంయమ యోగము భగవద్గీత

  అలా నిరోధం మాత్రమే సాధిస్తే సుఖం లేదు మరలా. అది ప్రతిలోమ మార్గమే గాని అనులోమం గాదు. అవతలి కొమ్మ పట్టుకొంటే గాని ఇవతలి కొమ్మ వదిలేయ లేవు. లేకుంటే ఏదీ పట్టు చిక్కక పడిపోతావు. అంచేత ఇప్పుడు యోగి పట్టుకోవలసిన భావమేదో బయటపెడుతున్నాడు మహర్షి యత్ర చైవాత్మనాత్మానం పశ్య న్నాత్మ ని తుష్యతి - ఆత్మానం పశ్యన్నంటున్నాడు. ఆత్మనే చూస్తుండాలట. దాన్ని ఏమరగూడదు. ఎప్పుడూ విడవకుండా చూస్తుండాలట. ఏమిటది. ఆత్మ. అంటే తన స్వరూపం. ఎలా ఉంటుందది. నేనున్నానే స్ఫురణే అది. అది నాలో ఎలా ఉందో అలాగే నేను చూచే బాహ్య ప్రపంచమంతా వ్యాపించి ఉన్నది. ఉండటమనే స్ఫురణ లేని పదార్ధ మేముంది సృష్టిలో. నేనూ లేను నాకు కనిపించేదీ లేదు. నాతో సహా ప్రతి పదార్థాన్నీ ఉన్నది ఉన్నదనే గమనిస్తుంటాను. ప్రతి ఒక్కటీ ఉండటమనే స్ఫురణతోనే గోచరిస్తున్నది. అలాగే అనుభవానికి వస్తున్నది. ఉండకుండా ఉన్నట్టు స్ఫురించకుండా నేనూ లేను. నాదీ లేదు. అదే ఆత్మ అంటే. అదే చూస్తుండా లెప్పుడూ. చూస్తూనే ఉన్నాం గదా అని అడగవచ్చు. చూడటం లేదలా. స్ఫురించే పదార్ధాన్ని చూస్తుంటావు. పదార్థం తాలూకు స్ఫురణను చూడటం లేదెవ్వడూ. స్ఫురించేవి దాని విశేషాలు. అవి మారుతుంటాయి ఎక్కడికక్కడ. ఏ స్ఫురణలో అవి నీకు స్ఫురిస్తున్నాయో ఆ స్ఫురణ సామాన్యం. అది మారదు. అది పట్టుకొంటేనే యోగం. లేకుంటే వియోగం.

Page 489

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు