ఆత్మసంయమ యోగము
భగవద్గీత
అంతే కాదు. యుక్త చేష్టస్య కర్మసు. ఆహార విహారాలేగాక అసలు ఏ పని చేసినా అది ఎంత మాత్రమో అంత మాత్రమే. అతి మాత్రంగా చేయగూడదు. సముద్ర స్నానం చేసేవాడు సముద్రంలో ఎంత దూరం దిగుతాడు. తిరిగి రాగలిగినంత దూరమే దిగుతాడు. అసలు దిగకుండా పోడు. దిగితే అలాగే దిగిపోడు. అదే ఇక్కడా సూత్రం. ఏ పని చేసినా గంటల తరబడి చేస్తూ పోవటమూ మంచిది గాదు. అసలు మానేసి కూచున్నా మంచిది గాదు. దేనికైనా నియతంగా ఉండాలి పరిమాణం. అలా ఉన్నప్పుడే కాలం మిగులుతుంది మానవుడికి. కాలవ్యవధి ఉంటే దాన్ని ఎలాగైనా ఉపయోగించుకోవచ్చు. యోగాభ్యాసానికైనా వ్యవధి Leisure ఉండాలిగా. సమయ మనేది చాలా విలువైనది జీవితంలో. జీవితమంటేనే ఒక గొప్ప అవకాశం. అది ఆలోచనలతో పనులతో నిండి క్రిక్కిరిసి పోతే మరి ఏమంచి పనికీ ఆస్కారం లేకుండా పోతుంది. ఏమిటా మంచి పనులు. రెండే. ఒకటి ధర్మం. మరొకటి మోక్షం. ఆ రెండింటిలో కూడా మోక్షమనేది పరమ పురుషార్ధమన్నారు. జీవిత సమస్యకు ఏకైకమైన పరిష్కారమదే. అది ఆత్మజ్ఞానం వల్లనే ప్రాప్తిస్తుంది. ఆ జ్ఞానం సాధించటానికే కర్మయోగం ధ్యానయోగం. మరి ఇలాటి ధ్యానయోగాని కవకాశమంటూ లేకపోతే ఎలా కృషి చేస్తాడు. ఎలా నోచుకొంటాడా జ్ఞానానికి. అంచేత ఆహార విహార స్వప్న జాగ్రదాది విషయ వ్యవహారా లన్నింటిలోనూ జాగ్రత్త వహించాలి మానవుడు. అప్పుడే యోగో భవతి
Page 484