#


Index

ఆత్మసంయమ యోగము భగవద్గీత

తరువాత చెప్పబోతున్నది గీత. అంచేత సంప్రేక్ష్య నాసికాగ్ర మన్నాడు గదా అని ముక్కకు ముక్క అర్థం చెప్ప గూడదు. దృష్టి ఒకే లక్ష్యం మీద పెట్టాలి అలా పెడుతున్నప్పుడు మనసెక్కడ నిలిపితే అక్కడే ఉండాలి నీ దృష్టి అని అర్ధం చెప్పుకోవాలి. దిశ శ్చానవలోకయన్. మధ్యే మధ్యే పానీయ మన్నట్టు కళ్లు తెరచి అటూ ఇటూ దిక్కులు చూడగూడదట. చూస్తే మనసు కూడా నీ దృష్టితోపాటు అటూ ఇటూ పరుగెడుతుంది. దృష్టి చెదిరితే మనసు చెదురుతుంది. మనసు చెదిరితే దృష్టి చెదురుతుంది. కాబట్టి మనసూ దృష్టి రెండూ ఒకే లక్ష్యం మీద ఉంటేనే ధ్యానానికి ఫలం.

ప్రశాంతాత్మా విగతభీ - రృహ్మచారి వ్రతే స్థితః
మన స్సంయమ్య మచ్చిత్తో - యుక్త ఆసీత మత్పరః - 14

  మళ్లీ మనసు దగ్గరికే వచ్చి మాటాడుతున్నాడు. ప్రశాంతాత్మా. ఆత్మ ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలి సాధకుడికి. ఆత్మ అంటే మనస్సే. అది ఏవిధమైన అల్ల కల్లోలమూ లేకుండా ఏ ఆలోచనా లేకుండా స్తిమితంగా ప్రసన్నంగా ఉండాలి. విగతభీః - అలాంటప్పుడే దానికే భయమూ బాధా ఉండబోదు. ఆలోచనే భయోత్పాదకం. అది నెరవేరుతుందా లేదా అని. నెరవేరకున్నా భయమే. నెరవేరినా భయమే. ఒకటి నెరవేరినా మరొకటి ఇంకా ఫలించలేదే అని ఆందోళన. ఇక భయం లేనిదెప్పుడూ మనస్సుకు. కాబట్టి సంకల్పమే చెడ్డది. అది కామానికి దారి తీస్తుంది. కామం క్రోధానికీ క్రోధ మశాంతికీ - ఇది ఒక అనర్ధ పరంపర.

Page 477

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు