ఆత్మసంయమ యోగము
భగవద్గీత
చూచేవాడి కనాత్మగా ఏది కనిపిస్తుంది. ఎవడు కనిపిస్తాడు. కనిపించాడంటే వాణ్ణి ఆత్మ భావనతో నీవు చూడటం లేదన్న మాట. అలా చూడకనే వాణ్ణి నీవు శత్రువని ఉలిక్కి పడుతున్నావు. వాస్తవంలో ఆత్మకు భిన్నంగా ఏదీ లేదు. భిన్నంగా భావించినప్పుడే మిత్రుడనీ శత్రువనీ భేద మేర్పడుతున్నది. దృష్టిని బట్టి సృష్టి. సృష్టి అనేది వాస్తవంలో లేదు. ఆత్మే వాస్తవం. దాని తాలూకు ఆ భాసే సృష్టి. అలాంటప్పుడు మిత్రులనీ శత్రువులనీ చూస్తున్నావంటే వారు మాత్రం వాస్తవంగా ఎక్కడున్నారు. అది నీ మానసికమైన భావనే. భౌతికంగా లేరు. మనసులో అంతా ఆత్మేననే దృష్టితో చూస్తే ఆత్మే. అలా చూడలేక వీడు నాకు కావలసినవాడు బంధువని వాడు పనికిరానివాడు శత్రువని భావిస్తే మాత్రం అలాగే కనిపిస్తుంటారు.
బంధురాత్మాఽఽత్మనస్తస్య యేనాత్మైవాత్మనా జితః |
అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్ || 6 ||
అసలా మాటకు వస్తే నీకు బాహ్యంగా ఎవరూ లేరు. అయిన వారూ లేరు. కాని వారూ లేరు. నీకు నీవే బంధువు వాస్తవంలో. బంధురాత్మా త్మన స్తస్య. ఎప్పుడు. యేనాత్మై వాత్మనాజితః - ఆత్మతో నీవు నీ ఆత్మను వశపరుచు కొన్నప్పుడు. ఆత్మను అంటే కార్యకరణ సంఘాతమని అర్థమట. కార్యమంటే శరీరం. కరణమంటే మనః ప్రాణేంద్రియాలు. ఈ కలాపమంతా నీకు స్వాధీనమైతే అదే నీకు ఆత్మబంధువు. ఎందుకంటే అది ఇక నీ సాధన మార్గాని కడ్డు తగలదు. పైగా నీకు చేయూత నిచ్చి ముందుకు నడిపిస్తుంది.
Page 461