#


Index

ఆత్మసంయమ యోగము భగవద్గీత

ఎవరెంత బోధించినా నీకు దాన్ని అమలుపరచాలనే ఉత్సాహమూ దీక్షా లేకపోతే అదంతా నిరుపయోగం. నిన్ను నీవుద్దరించుకోవాలి. అయితే ఆత్మను ద్ధరించుకోట మేమిటి. ఉద్దరించటమంటే పైకి తెచ్చుకోటం గదా. పడిపోతే గదా పైకి తెచ్చుకోటానికి. నిరాకారం నిశ్చలమైన చైతన్యమెలా పడిపోతుందని ప్రశ్న. నిజమే అసలైన ఆత్మ కాదు పడిపోయింది. దాని ఆభాస. అసలైనది పడటం లేవటమంటూ లేదు. అది ప్రత్యగాత్మ. కేవల చిద్రూపమది. ఇది చిత్తు గాదు చిదాభాస. దీనికే జీవాత్మ అని పేరు. చైతన్యమే అయినా ఇది అచేతనమైన దేహేంద్రియాదులతో చేతులు కలిపి చిదాభాసు డయింది. ఇదుగో దీన్నీ మనం పైకి తెచ్చుకోవలసింది.

  ఎలా తెచ్చుకోవాలి. ఆత్మనా ఆత్మానం. ఆత్మతోనే ఆత్మ నుద్ధరించాలి. ఆత్మతో నంటే ఆత్మజ్ఞానంతో. ఆత్మాకార వృత్తితో. మనసులో అనాత్మ వృత్తులుంటాయి. ఆత్మవృత్తికీ అవకాశముంటుంది. అందులో అనాత్మ జగత్తును గురించి ఆలోచించకుండా ఆత్మ స్వరూపాన్నే చింతించ గలిగితే అది ఆత్మాకార వృత్తి. దాని బలంతో సాధకుడు తన అసలైన ప్రత్యగాత్మను దర్శించాలి. అదే ఆత్మోద్ధరణ మంటే. నాత్మాన మవ సాదయేత్ అలా ఆత్మోద్ధరణకే నడుము కట్టాలి గాని సాధకుడు తన ఆత్మను తానే అణచి పుచ్చుకోరాదు. కుంగదీసుకో రాదు.

  అంతేకాదు. ఎవడో తన్నుద్దరించాలని వాడికోసం ఎదురు చూడ గూడదు. శాస్త్రమూ ఆచార్యుడూ కూడా కొంతవరకే నీకు తోడ్పడగలరు.

Page 459

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు