ఆత్మసంయమ యోగము
భగవద్గీత
శమః కారణ ముచ్యతే. ధ్యానయోగ మారోహించిన తరువాత ఇక వాడే కర్మా అదేపనిగా చేస్తూపో నక్కర లేదు. బాహ్యమైన శరీరేంద్రియ వ్యాపారాలన్నీ మానేసి వాటినుంచి వైదొలగి అంతరింద్రియమైన మనస్సుకే పనిచెప్పటం మంచిది. ఆ వైదొలగటానికే శమమని పేరు. శమమంటే ఉపశమనం లేదా ఉపరమం. మానుకోటమని అర్ధం. యావద్యావ త్కర్మభ్యః ఉపరమతే తావ త్తావ న్నిరాయాసస్య జితేంద్రియస్య చిత్తం సమాధీయతే - ఎంతెంత బాహ్య వ్యాపారాలనుంచి తప్పుకొంటాడో సాధకు డంతంత అనాయాసంగా ఇంద్రియాలు వాడికి వశమవుతాయి. అంతేకాదు. ఇంద్రియాలు చెదిరిపోకుంటే మనస్సు కూడా లక్ష్యం మీదనే నిలకడ చెందుతుంది. తదా సతి స ఝటితి యోగా రూడో భవతి. అలా నిలిస్తే వాడు వెంటనే యోగారూఢ పదవినందు కోగలడు అని వర్ణిస్తారు భగవత్పాదులు. అంతేగాక నైతాదృశం బ్రాహ్మణ స్యాస్తి విత్తం - తతస్తత శ్చోపరమః క్రియాభ్యః అని వ్యాసప్రోక్తమైన సుభాషితం కూడా ఒకటి ఉదాహరిస్తారు. కర్మల నుంచి నివర్తించటం కన్నా బ్రహ్మజ్ఞాన సాధకుడి కింకొక ధనమంటూ వేరేలేదట.
యదా హి నేంద్రియార్థేషు న కర్మస్వనుషజ్జతే |
సర్వసంకల్పసంన్యాసీ యోగారూఢస్తదోచ్యతే || 4 ||
ఇంతకూ యోగారూఢుడని ఎప్పుడనిపించు కొంటాడీ సాధకుడు. అయినందు కేమిటి నిదర్శనమని ప్రశ్న వచ్చింది. దానికిప్పుడిస్తున్నాడు
Page 455