#


Index

ఆత్మసంయమ యోగము భగవద్గీత

పెట్టుకో నక్కరలేదు. ఎక్కడా లేవవి వాస్తవంలో. మేము వర్ణించిన లక్షణాలున్న వాడే సన్న్యాసి - వాడే యోగి కూడా. ఇంకెక్కడైనా ఆ మాటలు నీకు వినిపించినా అలాటి వ్యక్తులు నీకు కనిపించినా వారి విషయంలో అవి ఔపచారికమే Secondary గాని ముఖ్యార్ధంగా Primary మీరు భావించ నక్కర లేదంటున్నాడు మహర్షి. ఇంకా ఒక విశేషం కూడా ఉంది మనం గుర్తుంచుకోవలసింది. సన్న్యాసం యోగమని మేము రెండు మాటలు చెప్పినా అవి రెండూ వేర్వేరు గావు. ఒకటి సన్న్యాసం వేరొకటి యోగమని గాదు మా ఉద్దేశం. రెండూ కలిసి ఒక్కటే. ఒకదాని కొకటి పర్యాయాలు. ఏది సన్న్యాసమో అదే యోగం. ఏది యోగ మంటున్నామో అదే సన్న్యాసం. రెండు లక్షణాలున్న వాడూ ఒక్కడే. వాళ్లే సన్న్యాసి అనవచ్చు. వాళ్లే యోగి అనవచ్చు. యం సన్న్యాస మితి ప్రాహు ర్యోగం తం విద్ధి - సన్న్యాసమని దేన్ని పేర్కొంటున్నావో యోగం కూడా అదేనని తెలుసుకో మంటున్నది గీత.

  యోగం సన్న్యాసమెలా అవుతుంది. ఒకటి వదిలేయటం మరొకటి చేయటం గదా. రెండూ ఒకటెలా అవుతాయి. అంటే సమాధాన మిస్తున్నాడు. గీతాచార్యుడు. నహ్యసన్న్యస్త సంకల్పో యోగీ భవతి కశ్చన. యోగి కూడా ఆ మాటకు వస్తే సన్న్యసించాడు గనుక సన్న్యాసే. ఏమి సన్న్యసించా డంటారు. సంకల్పాన్ని. నేను చేస్తున్నాననే కర్తృత్వ బుద్ధి ఒక సంకల్పమైతే దీని ఫలం తప్పకుండా నేనుభవించాలనే భోక్తృత్వ బుద్ధి మరొక సంకల్పం.

Page 451

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు