కర్మసన్యాస యోగము
భగవద్గీత
బ్రహ్మ భూతోధిగచ్ఛతి. బ్రహ్మ భూతుడు వాడు. బ్రహ్మమే అయిపోయాడు. కనుకనే అధిగచ్చతి. ఎప్పుడూ అందుకొంటూనే ఉంటాడు. ఏమిటది. బ్రహ్మ నిర్వాణం. నిర్వృతే నిర్వాణం. అంటేమోక్షమని అర్ధం వ్రాశారు భగవత్పాదులు. బ్రహ్మ నిర్వాణమది. బ్రహ్మభావంలోనే లభిస్తుం దది. వాడు బ్రహ్మ భావం పొందాడు. కాబట్టి మోక్షం కూడా దానితో పాటే అందుకొన్నాడు. మోక్షం వేరూ బ్రహ్మం వేరూ కాదు వేదాంతులకు. బ్రహ్మమే మోక్షం. మోక్షమంటే విడుదల. దేనిలో నుంచి. సంసారంలో నుంచి. సంసారమంటే సుఖదుఃఖానుభవమే. సుఖం కూడా తాత్కాలికమే కాబట్టి వాస్తవానికదీ దుఃఖమే. కనుక దుఃఖంలో నుంచి బయట పడటమే మోక్షం. అది బ్రహ్మ జ్ఞానం వల్లనే. కాబట్టి బ్రహ్మ జ్ఞానికెప్పుడూ సుఖమే. ఎప్పుడూ మోక్షమే. దుఃఖ స్పర్శకూడా లేదు. అది కూడా ఎప్పుడో మరణానంతరం కాదు. జీవించి ఉండగానే నంటారు భగవత్పాదులు. జీవితంలో దాని అనుభవం లేకపోతే రేపు మరణానంతరం కలుగుతుందని గ్యారంటీ ఏమిటి. కనుక జీవన్నేవ బ్రహ్మ భూతః సన్నధిగచ్ఛతి - ప్రాప్నోతి అని వర్ణిస్తారాయన.
లభంతే బ్రహ్మనిర్వాణం ఋషయః క్షీణకల్మషాః |
ఛిన్నద్వైధా యతాత్మానః సర్వభూతహితే రతాః || 25 ||
మరి ఇలాంటి జీవన్ముక్తు లెవరైనా ఉన్నారా లోకంలో . మనకు కనిపిస్తారా అని సందేహ ముండవచ్చు మీకు. అలాంటి పిచ్చి పిచ్చి సందేహా లేవీ పెట్టుకోకండి. సంశయాత్మా వినశ్యతి. ఎప్పుడూ అనుమానాలు
Page 432